Workers and Helpers Union
-
అంగన్వాడీల కన్నెర్ర
గూడూరు టౌన్: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు కన్నెర్రజేశారు. ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ డివిజన్ పరిధిలోని అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో శుక్రవారం ఉదయం ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అంతకుముందే పోలీసు లు పెద్ద సంఖ్యలో వచ్చి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద బారిక్యాడ్లను అడ్డుగా ఉంచారు. కార్యకర్తలను అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్డీఓ కార్యాలయం ముట్టడిని శాంతియుతంగా నిర్వహిస్తామని, కార్యాలయం వరకు అనుమతించాలని కార్యకర్తలు కోరినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు. దీంతో సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేస్తే అంగన్వాడీ కార్యకర్తలను గతంలో కూడా చంద్రబాబు గుర్రాలతో తొక్కించిన చరిత్ర ఉందన్నారు. తిరిగి ప్రస్తుతం అదేవిధంగా కార్యకర్తలను అడ్డుకోవడం దారుణమన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.15వేలు, గ్రాడ్యుటీ లక్షతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీలను నమ్మి అంగన్వాడీ కార్యకర్తలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. అధికారంలోకి వచ్చాక మాటలతో మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఆర్డీఓ రవీంద్ర కార్యకర్తల వద్దకు చేరుకుని చర్చించారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. సుమారు మూడు గంటలకు పైగా అంగన్వాడీ కార్యకర్తలు ఎండలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు కేశవులు, వెంకటేశ్వర్లు, యాదగిరి, యూనియన్ నాయకులు హెప్సిబా, సుజాత పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం ముట్టడి నెల్లూరు(బారకాసు): తమ సమస్యలను పరిష్కరించాలంటూ నాలుగు రోజులుగా నిరసనలు చేపడుతున్న అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడారు. సమస్యలపై పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదన్నారు. అంగన్వాడీలకు నెలకు రూ.15వేలు చొప్పున వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల సమస్యలు పరిష్కరించుకునే క్రమంలో ఈనెల 17వ తేదీన చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అజయ్‌కుమార్, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు మసాన్బీ, అధ్యక్షురాలు జయలక్ష్మి పాల్గొన్నారు. -
చిరుద్యోగులం.. చెలగాటం తగదు
కాకినాడ సిటీ : తమ బతుకులతో చెలగాటమాడడం సర్కారుకు తగదని చిరుద్యోగులు ఆక్రోశించారు. ఇకనైనా న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎలుగెత్తారు. తొలగించిన 227 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్‌తో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. 23వ రోజైన బుధవారం బాధిత అంగన్వాడీలు కుటుంబ సభ్యులతో పీడీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మధ్యాహ్నం పీడీ కార్యాలయం నుంచి కలెక్టరేట్, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా బాలాజీచెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. శాంతిభవన్ సెంటర్ ఫూలే విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని మూడువారాలుగా ందోళన చేస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కల్పించుకుని తొలగించిన అంగన్వాడీలను విధుల్లోకి తీసుకునేలా చూడాలని, లేకుంటే వారి ఇళ్ళను ముట్టడించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 25 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీలను ఆందోళన బాట పట్టించి ఐసీడీఎస్‌ను స్తంభింపజేస్తామన్నారు. ఆందోళనలో యూనియన్ నాయకులు ప్రమీల, ఏసురత్నం, సూర్యకళ, సత్యవాణి, హేమలత, వరలక్ష్మి, బాధిత అంగన్వాడీల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణరాజుతో పాటు 108 అంబులెన్స్ యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు ఆర్థిక మంత్రికి వినతిజిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో తొలగించిన 227 మంది అంగన్వాడీలను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకి అంగన్వాడీ యూనియన్ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యో గ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వీరలక్ష్మి బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో మంత్రిని కలిసి సమస్యను వివరిం చారు.