గూడూరు టౌన్: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు కన్నెర్రజేశారు. ఆర్డీఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ డివిజన్ పరిధిలోని అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో శుక్రవారం ఉదయం ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అంతకుముందే పోలీసు లు పెద్ద సంఖ్యలో వచ్చి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద బారిక్యాడ్లను అడ్డుగా ఉంచారు. కార్యకర్తలను అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆర్డీఓ కార్యాలయం ముట్టడిని శాంతియుతంగా నిర్వహిస్తామని, కార్యాలయం వరకు అనుమతించాలని కార్యకర్తలు కోరినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు. దీంతో సీఐటీయూ నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేస్తే అంగన్‌వాడీ కార్యకర్తలను గతంలో కూడా చంద్రబాబు గుర్రాలతో తొక్కించిన చరిత్ర ఉందన్నారు. తిరిగి ప్రస్తుతం అదేవిధంగా కార్యకర్తలను అడ్డుకోవడం దారుణమన్నారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.15వేలు, గ్రాడ్యుటీ లక్షతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీలను నమ్మి అంగన్‌వాడీ కార్యకర్తలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. అధికారంలోకి వచ్చాక మాటలతో మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు.
ఆర్డీఓ రవీంద్ర కార్యకర్తల వద్దకు చేరుకుని చర్చించారు. అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. సుమారు మూడు గంటలకు పైగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఎండలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు కేశవులు, వెంకటేశ్వర్లు, యాదగిరి, యూనియన్ నాయకులు హెప్సిబా, సుజాత పాల్గొన్నారు.
ఆర్డీఓ కార్యాలయం ముట్టడి
నెల్లూరు(బారకాసు): తమ సమస్యలను పరిష్కరించాలంటూ నాలుగు రోజులుగా నిరసనలు చేపడుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడారు.
సమస్యలపై పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదన్నారు. అంగన్‌వాడీలకు నెలకు రూ.15వేలు చొప్పున వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సమస్యలు పరిష్కరించుకునే క్రమంలో ఈనెల 17వ తేదీన చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అజయ్‌కుమార్, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు మసాన్‌బీ, అధ్యక్షురాలు జయలక్ష్మి పాల్గొన్నారు.
అంగన్‌వాడీల కన్నెర్ర
Published Sat, Mar 14 2015 2:17 AM | Last Updated on Fri, Aug 17 2018 5:18 PM
Advertisement