చిరుద్యోగులం.. చెలగాటం తగదు
కాకినాడ సిటీ : తమ బతుకులతో చెలగాటమాడడం సర్కారుకు తగదని చిరుద్యోగులు ఆక్రోశించారు. ఇకనైనా న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎలుగెత్తారు. తొలగించిన 227 మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల్లోకి తీసుకోవాలన్న డిమాండ్‌తో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. 23వ రోజైన బుధవారం బాధిత అంగన్‌వాడీలు కుటుంబ సభ్యులతో పీడీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మధ్యాహ్నం పీడీ కార్యాలయం నుంచి కలెక్టరేట్, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా బాలాజీచెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
శాంతిభవన్ సెంటర్ ఫూలే విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని మూడువారాలుగా ందోళన చేస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కల్పించుకుని తొలగించిన అంగన్‌వాడీలను విధుల్లోకి తీసుకునేలా చూడాలని, లేకుంటే వారి ఇళ్ళను ముట్టడించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 25 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న అంగన్‌వాడీలను ఆందోళన బాట పట్టించి ఐసీడీఎస్‌ను స్తంభింపజేస్తామన్నారు.
ఆందోళనలో యూనియన్ నాయకులు ప్రమీల, ఏసురత్నం, సూర్యకళ, సత్యవాణి, హేమలత, వరలక్ష్మి, బాధిత అంగన్‌వాడీల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణరాజుతో పాటు 108 అంబులెన్స్ యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు ఆర్థిక మంత్రికి వినతిజిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో తొలగించిన 227 మంది అంగన్‌వాడీలను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకి అంగన్‌వాడీ యూనియన్ నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యో గ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వీరలక్ష్మి బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంత్రిని కలిసి సమస్యను వివరిం చారు.