కార్మికులతో చర్చల్లో ప్రతిష్టంభన
వేతన సవరణపై హామీ ఇవ్వని ఆర్టీసీ ఎండీ
ఉద్యమబాట తప్పదన్న కార్మికులు
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ విషయంలో కార్మికులతో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. బుధవారం గుర్తింపు పొందిన కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ అధికారులు చర్చిం చారు. దాదాపు 274 అంశాలతో కూడిన సర్వీస్ కండిషన్స్‌పై సమగ్రంగా చర్చించినప్పటికీ వేతన సవరణపై ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేస్తే ఆర్టీసీపై రూ.1,800 కోట్ల భారం పడుతుందని, దాన్ని మోసే శక్తి ఆర్టీసీకి లేనందున ప్రభుత్వంతో చర్చిస్తానని సంస్థ ఎండీ సాంబశివరావు కార్మిక సంఘాల ప్రతినిధులకు స్పష్టం చేశారు.
ఇందుకు కనీసం ఏప్రిల్ చివరి నాటికి గడువు అవసరమవుతుందన్నారు. ఇప్పటికే వేతన సవరణ గడువు దాటి రెండేళ్లు అయ్యిందని, ఇంకా జాప్యం సరికాదని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటే తప్ప ఇందులో స్పష్టత రాదని ఎండీ తేల్చిచెప్పారు. దీంతో ముందుగా ప్రకటించిన విధంగా గురువారం నాటి బస్‌భవన్ ముట్టడిని కొనసాగించి తీరుతామని కార్మిక సంఘాలు ప్రకటించాయి.