సింగరేణిలో మెరుగైన ఆరోగ్య సేవలు
ఆదిలాబాద్: సింగరేణి కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. భూపాలపల్లి ఏరియాలోని మంజూర్‌నగర్ సింగరేణి ఆసుపత్రిలో రూ.4.71 లక్షలతో తయారైన అత్యాధునిక ఐసీయూ అంబులెన్స్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం జీఎం పాలకుర్తి సత్తయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ కార్మికుల కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలను అందించటం పట్ల హర్షం ప్రకటించారు. ఏరియా స్థాయిలోనే కాక హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ మెరుగైన చికిత్స చేయిస్తున్నారని చెప్పారు. 1200 కిలోమీటర్ల వరకు ఆక్సిజన్‌ను అందించే అత్యాధునిక అం బులెన్స్‌ను అందుబాటులోకి తీసుకరావటం హర్షణీయమని, అత్యవసర సమయూల్లో కార్మికులకు సంజీవనిగా సహా యపడుతుందని అన్నారు.
సింగరేణి సంస్ధ సీఎస్ఆర్ నిధులతో భూపాలపల్లి నగర పంచాయతి పరిధిలో అంతర్గత రోడ్లు, సైడ్ కాల్వలను నిర్మించామని, కేటీపీపీ నుంచి భూపాలపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం, నియోజకవర్గంలో పలు బస్షెల్టర్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సింగరేణి పాలుపంచుకోవటం ఆనందించాల్సిన విషయమన్నారు. భూపాలపలి నగర పంచాయతి పరిధిలోని కార్ల్‌మార్క్స్ కాలనీలో నిర్మించిన రెండు సీసీ రోడ్లు, రాంనగర్లో సైడు కాల్వలను జీఎంతో కలసి స్పీకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, డిప్యూటీ సీఎంఓ కిరణ్‌రాజ్, పర్సనల్ మేనేజర్ సీతారాం, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్యాంకుమార్, కౌన్సిలర్స్ ఫోరం చైర్మన్ సిరుప అనిల్, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు బడితెల సమ్మయ్య, కేంద్ర కమిటీ కార్యదర్శి ఆగయ్య, కొక్కుల తిరుపతి, ఫిట్ కార్యదర్శి స్రవంతి పాల్గొన్నారు.