ప్రపంచ అథ్లెటిక్స్ డే.. ఎలా మొదలైదంటే!
మానవ మనుగడ మొదలైందే అథ్లెట్‌గా అంటే అతిశయోక్తి కాదు. మానవ పరిణామక్రమంలో మనిషి రెండు కాళ్లతో నడవడం ప్రారంభించాడు. మెరుగైన జీవనం కోసం పరుగెత్తాడు. ఆహార అన్వేషణలో భాగంగా విసిరాడు.. దుమికాడు. ఇవన్నీ మనిషి జీవన గమనాన్ని ఊహించలేని స్థితికి చేర్చాయి. నడవడం, పరుగెత్తడం, దుమకడం, విసరడం అనేవి అథ్లెటిక్ ట్రాక్, ఫీల్డ్ అంశాలైనా.. ప్రతి క్రీడలోనూ ప్రాథమిక అంశాలు. క్రీడాకారుడి(అథ్లెట్)గా ఎదిగేందుకు శిక్షణలో శారీరక బలం, చురుకుదనం, నైపుణ్యం ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటి అథ్లెట్‌గా పిల్లలు, యువతలో ఫిట్నెస్ ప్రాముఖ్యం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఏటా మే 7న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం జరుపుకుంటారు.
అథ్లెటిక్ ఫర్ ఏ బెటర్ వరల్డ్..
మనిషి ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగానే ఉంటుంది అనే నానుడిని నిజం చేయాలని 1996లో తొలిసారిగా ప్రపంచ అథ్లెటిక్స్ డే ను అంతర్జాతీయ అథ్లెటిక్ అమెచ్యూర్ సమాఖ్య ప్రారంభించింది. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా సర్వమానవాళి ఆరోగ్యంగా ఉండాలనేది ఈ డే ప్రధాన లక్ష్యం. అథ్లెటిక్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అనేది ఐఏఏఎఫ్ ప్రధాన నినాదం. (క్లిక్: భారతీయులు గర్వపడేలా చేసిన సచిన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?)
యువత, క్రీడ, పర్యావరణం
ఏ దేశానికైనా యువతే ప్రధాన వనరు. అలాంటి యువత ఆరోగ్యం, ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దేదే క్రీడ. ఏ క్రీడలోనైనా ప్రావీణ్యం సాధించడానికైన మౌలికంగా అవసరమయ్యే శక్తి, సామర్థ్యాలకు పర్యావరణ పరిరక్షణ తోడైతే ఆ దేశ ఖ్యాతి ఇనుమడిస్తుంది. పురాతన ఒలింపిక్ క్రీడల్లో అగ్రభాగం జంప్, జావెలిన్, డిస్కస్లతో పాటు పరుగుదే. బాక్సింగ్, రథాల పోటీలతో పాటు మల్లయుద్ధం ఉండేవి. ప్రపంచ క్రీడా వేదికైన ఆధునిక ఒలింపిక్స్‌లో పతకం సాధించడం ప్రతి క్రీడాకారుడి కల. ఒలింపిక్స్‌లో సైతం అత్యధిక పతకాలు(48 బంగారు పతకాలు) అథ్లెటిక్స్‌లోనే అందిస్తారు.