ప్రణాళికా సంఘంలో ‘సీమాంధ్ర’ ప్రత్యేక విభాగం
* ప్రపంచ బ్యాంకు మాజీ అధికారి పి.శ్రీనివాస్ నేతృత్వం
* తొలి సమావేశంలో ప్యాకేజీల అమలుపై చర్చ: జైరాం రమేశ్
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రకు ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు అభివృద్ధి ప్యాకేజీల అమలుకు ప్రణాళికా సంఘంలో ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. ప్రపంచ బ్యాంకు మాజీ అధికారి పి.శ్రీనివాస్ దీనికి నేతృత్వం వహించనున్నారు. శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యులని సమాచారం. ప్రత్యేక విభాగానికి సంబంధించిన తొలి సమావేశం శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నేతృత్వంలో జరిగింది. పి.శ్రీనివాస్‌తోపాటు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ కూడా పాల్గొన్నారు.
సమావేశం తర్వాత జైరాం మీడియూతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీల అమలు, సీమాంధ్రలో నెలకొల్పాల్సిన ఐఐటీ, ఐఐఎం తదితర జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, వాటికయ్యే వ్యయం తదితర అంశాలపై చర్చించినట్టు చెప్పారు. ప్రత్యేక విభాగం వీటికి సంబంధించిన అంచనాలు రూపొందిస్తుందని తెలిపారు.
రాజధాని ఎంపికకు ముగ్గురు సభ్యుల కమిటీ
కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేసేందుకు తగిన అధ్యయనం కోసం ముగ్గురు నిపుణులతో కమిటీ ఏర్పాటు కానున్నట్టు జైరాం తెలిపారు. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అందుబాటులో లేనందున పదో తేదీ తరువాత ఈ విషయం ప్రకటిస్తామని తెలిపారు. పట్టణాభివృద్ధిలో నైపుణ్యం కలిగినవారు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ప్రస్తుతం కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో రాజధాని కోసం డిమాండ్లు ఉన్నాయని, వీటితోపాటు ఒక హరితక్షేత్ర ప్రాంతాన్ని (అటవీ నిర్మూలనకు అనుకూలంగా ఉన్నది) కూడా కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు.
పురందేశ్వరి విశ్వాస ఘాతకురాలు
మాజీ మంత్రి పురందేశ్వరి విశ్వాస ఘాతకురాలని జైరాం రమేశ్ విమర్శించారు. ఎనిమిదేళ్ల పాటు కేంద్రమంత్రి పదవి కట్టబెట్టి సోనియాగాంధీ ఆమెను ప్రోత్సహించారని, అరుుతే క్లిష్ట సమయంలో స్వార్థం కోసం పార్టీని విడిచివెళ్లారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పురందేశ్వరి అడిగిన హైదరాబాద్ యూటీ విషయం మినహా అన్నిటినీ కేంద్రం మన్నించిందన్నారు. కేంద్ర మంత్రులు అందరూ దుగ్గరాజపట్నం నౌకాశ్రయం గురించి అడిగితే ఆమె రామాయపట్నం గురించి అడిగారన్నారు. అక్కడ ఆమెకు స్థలాలు ఉండడంతోనే ఆ విధంగా పట్టుబట్టారనే ఆరోపణ వినిపించిందన్నారు.