breaking news
World Culture Festival
-
ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల్లో ఉక్రెయిన్‌లో శాంతి కోసం ప్రార్ధనలు
ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల రెండవ రోజున విశ్వమానవ హృదయ స్పందన గురుదేవ్ నేతృత్వంలో 180 దేశాల ప్రజలచే ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం ప్రార్థన. బెంగుళూరు : వందలాది దేశాల పతాకాల రెపరెపల నేపథ్యంలో 180 దేశాల సంస్కృతులు, నృత్య-గాన రీతులు, ఆహార వ్యవహారాలకు సమైక్య వేదికగా ప్రపంచ సాంస్కృతిక మహోత్సవాలు అమెరికాలోని నేషనల్ మాల్ ప్రాంగణంలో కొనసాగాయి. ప్రపంచ ప్రజలను సమైక్యపరచటంలో భారతదేశానికి గల సామర్థ్యాన్ని ఈ ఉత్సవాలు ఘనంగా చాటిచెప్పాయి. మానవజాతి మైత్రి బంధం.. ఇక్కడి చారిత్రక లింకన్ మెమోరియల్ వద్ద హాజరైన 1000 మందికి పైగా ఆహుతుల యోగాభ్యాసంతో రెండవరోజు వేడుకలు కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకోసం ప్రత్యేకించిన యోగ, ప్రాణాయామం జరిగిన అనంతరం గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ స్వయంగా ఆహుతులచే ధ్యానం చేయించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు, స్ఫూర్తిదాయక ప్రసంగాలు అక్కడ హజరైన జనహృదయాలను ఉర్రూతలూగించి మానవజాతి మైత్రీబంధానికి సాక్షిగా నిలిచాయి. విశ్వమానవ కుటుంబం.. భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించినట్లుగా, ‘పర్వతప్రాంతాల నుంచి మైదానాలదాకా, నదీతీరాల నుంచి ఇసుకతిన్నెలు, ఎడారులదాకా వ్యాపించిన ప్రజావాహిని అంతా నేడు ఇక్కడ సమావేశమైందని ఈ విధంగా విశ్వ మానవ కుటుంబపు సంక్షిప్తరూపం ఇక్కడ ఆవిష్కరింపబడిందని అన్నారు. సమైక్య ప్రార్ధనలు.. రెండవరోజు ప్రదర్శింపబడిన అనేక కళారూపాలలో ప్రఖ్యాత ఉక్రేనియన్ సంగీతకారురాలు ఒలెనా అస్తాషేవా నిర్వహించిన సాంప్రదాయ ఉక్రేనియన్ పాట కూడా ఉంది. యుద్ధం కారణంగా తన మాతృభూమిని విడిచిపెట్టాల్సి వచ్చిన ఆమె, తన బృందంతో ఇచ్చిన ప్రదర్శనతో మనసు చలించిన ప్రేక్షకులు గురుదేవ్ నేతృత్వంలో ఉక్రెయిన్ లో శాంతి నెలకొనాలని ప్రార్థించారు. ‘సమైక్యంగా చేసే మన ప్రార్థనలు ఫలిస్తాయి’ అని గురుదేవ్ పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రూఫ్? ప్రజలను ఉర్రూతలూగించే ప్రసంగాలకు పేరుగాంచిన రెవరెండ్ గెరాల్డ్ ఎల్ డర్లీ, మాట్లాడుతూ, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' పేరును 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రూఫ్'గా మార్చాలని ఎందుకంటే మనం ప్రేమించగలమని, ప్రేమను పంచగలమని, దయతో ఉండగలమని గురుదేవ్ ఇక్కడ నిరూపిస్తున్నారని పేర్కొన్నారు. మీ నాయకుడు ఎవరని అడిగితే.. అమెరికన్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్, వ్యాపారవేత్త టిమ్ డ్రేపర్ తన అభిప్రాయాలను పంచుకుంటూ, 'అమెరికన్లు ఇతర దేశాల ప్రజలను గ్రహాంతరవాసులని పిలిచేవారం. ఇది మంచి పదం కాదు. క్రమంగా మేము ఏదో ఒక విధంగా ఇతర దేశాల ప్రజలను అంగీకరించి, ఏకీకృతం చేయడం ప్రారంభించాము. గురుదేవ్ నాయకత్వంలో ఈనాడు ఇంతమంది ప్రజలను ఒకచోట చేర్చాము. ఇకపై భూమిపై ఎవరూ గ్రహాంతరవాసులు కాదు. ఇంకా ఈ భూమిపై ఎవరైనా గ్రహాంతర వాసులు.. నన్ను మీ నాయకుడి దగ్గరకు తీసుకెళ్లమని అడిగితే, నేను వారికి గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ను చూపుతానని అన్నారు. ఇలాంటివి అవసరం.. యు.ఎస్. సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి మాట్లాడుతూ.. ఇటువంటి సాంస్కృతిక ఉత్సవాలు శక్తివంతమైనవి ఎందుకంటే, మనమందరమూ పరస్పర సంబంధాలను కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను ఇవి గుర్తుచేస్తాయని అన్నారు. గతంలో కంటే ఈరోజుల్లో ఇవి మనకు అత్యవసరం. ఈనాటి జీవనంలో ఒంటరితనం, తోడు లేకపోవడం అనేవి అంటువ్యాధులుగా మారి, మతిభ్రమణం, గుండె జబ్బుల వంటి మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని తద్వారా మన సమాజపు సంక్షేమానికే బెడదగా పరిణమిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అతిరథమహారధులు.. రెండవ రోజు కార్యక్రమంలో ప్రసంగించిన ఇతర ప్రముఖులలో మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపన్, భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, జపాన్ దివంగత ప్రధాన మంత్రి షింజో అబే భార్య అకీ అబే, అమెరికాలోని సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి తదితరులు ఉన్నారు. వివిధ దేశాల సాంస్కృతిక కార్యక్రమాలు.. 2వ రోజు జరిగిన సాంస్కృతిక ముఖ్యాంశాలలో, ప్రముఖ భారతీయ అమెరికన్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత ఫాలు షా నేతృత్వంలో 10,000 మంది నాట్యబృందంచే గార్బా నృత్య ప్రదర్శన, 200 మంది కళాకారులతో ఉత్సాహభరితమైన భాంగ్రా ప్రదర్శన, ఐర్లాండు కళాకారుల బృందంచే ఐరిష్ స్టెప్ డ్యాన్స్, అప్ఘన్ కళాకారుల గీతాలాపన, 1,000 మంది చైనీస్-అమెరికన్ గాయకులు, కళాకారుల అద్భుతమైన నృత్యం, కుంగ్ ఫూ ప్రదర్శనతోపాటు వాటికి తోడుగా గంభీరమైన డ్రాగన్లు, సింహాలు ప్రాణంతో ఉన్నవా అనిపించేలా తీర్చిదిద్దిన కళాత్మక నాట్యం మొదలైనవి వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంకా ఇండోనేషియా, బ్రెజిల్, బొలీవియా, లాటిన్ అమెరికా దేశాల కళాకారుల మరపురాని ప్రదర్శనలు, కుర్టిస్ బ్లో వంటి దిగ్గజాల నేతృత్వంలో హిప్ హాప్, బ్రేక్ డ్యాన్స్ ప్రదర్శనలు, 1200 మందిచే సువార్త గానం, పాకిస్తానీ కళాకారుల మంత్రముగ్ధమైన ప్రదర్శన ప్రేక్షకులను అలరించాయి. ఇది కూడా చదవండి: డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్! -
మిగతా రూ. 4.75 కోట్లు కట్టండి
న్యూఢిల్లీ: యమునా నదిని కలుషితం చేసిందుకు విధించిన జరిమానా చెల్లించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్(ఏఓఎల్) ఫౌండేషన్ ను జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. మార్చిలో ఏఓఎల్ నిర్వహించిన ప్రపంచ సాంసృత్కిక ఉత్సవం సందర్భంగా ఎన్జీటీ రూ. 5 కోట్లు జరిమానా విధించింది. అయితే ఏఓఎల్ రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించింది. మిగతా మొత్తం రూ. 4.75 కోట్లు చెల్లించాలని ఎన్జీటీ మంగళవారం ఆదేశించింది. యమునా నది తీరంలో శ్రీశ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో మార్చి 11 నుంచి మూడు రోజుల పాటు వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ నిర్వహించింది. ఈ ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. -
20 వేల వివాహాలు.. 35 లక్షల మంది అతిథులు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ప్యాకైపోయింది. ఎక్కడ చూసినా జనమేజనం. అన్ని రోడ్లూ కార్లతో నిండిపోయాయి. తెల్లవారు జామునుంచీ ఇదే పరిస్థితి. సూర్యుడు పడమరకు వాలుతున్నకొద్దీ ఇంకా కిక్కిరిసిపోనుంది. ఇలా ఎందుకు జరిగిందంటే.. ఢిల్లీ మహానగరంలో శుక్రవారం 20 వేల వివాహాలు జరగనుండటం సాధారణ కారణమైతే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ నిర్వహిస్తోన్న మెగా ఈవెంట్ కు 35 లక్షల మంది అతిథులు హాజరుకానుండటం ప్రధాన కారణం. ట్రాఫిక్ నియంత్రణ దుస్సాధ్యంగా మారుతున్న తరుణాన పోలీసులు కూడా చేసేదేమీలేక 'అయ్యలారా, అమ్మలారా.. దయచేసి ఈ ఒక్కరోజు రోడ్లపైకి రాకండి' అని జనాన్ని వేడుకుంటున్నారు. అక్కడి పరిస్థితికి సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు యమునా తీరంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉత్సవ వేదికకు వెళ్లే వారంతా ఢిల్లీ- నోయిడా రహదారిపై నుంచే వెళుతుండటంతో ఉదయం నుంచే ఆ రోడ్డుపై ట్రాఫిక్ జామ్స్ కొనసాగుతున్నాయి. సాంస్కృతిక ఉత్సవం దృష్ట్యా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ నేటి వివాహాలతో రోడ్లు రద్దీగా మారాయి. కేవలం 1000 ఎకరాల్లోనే పార్కింగ్ స్థలాన్ని కేటాయించడంతో ముందు వచ్చిన వాహనాలను మాత్రమే పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు. దీంతో సాయంత్రానికి యమునా తీరమంతా కార్లమయం అయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 వరకు వాహనాలు తీసుకొని బయటికి రావద్దంటూ సౌత్ ఢిల్లీలోని రింగ్ రోడ్డు, హైవే, నోయిడా లింక్ రోడ్లు, తూర్పు ఢిల్లీ లోని అక్షరధామ్ ఆలయం, మయూర్ విహార్ తదితర ప్రాంతాల ప్రజలకు పోలీసులు విజ్ఙప్తి చేస్తున్నారు. రవిశంకర్ వేడుక వద్ద 1700 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవేకాక యమునా నదీతీరంలో వేడుక నిర్వహించినందుకుగానూ రూ.5 కోట్ల జరిమాన కట్టాలన్న గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలను బేఖాతరు చేసిన నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ వ్యవహారం పార్లమెంట్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. రవిశంకర్ చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తున్నారంటూ విపక్షపార్టీలు ఫైర్ అయ్యాయి. వరల్డ్ కల్చరల్ ఫెస్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న సంగతి తెలిసిందే. కాగా గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ. 5 కోట్ల జరిమానా చెల్లించేందుకు 4 వారాల గడువు కావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కోరినట్టు తెలిసింది.