కొత్త బిజినెస్ సెంటర్.. వెయ్యి ఉద్యోగాలు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గ్లోబల్ ఫైనాన్స్ అండ్ ఎకౌంటింగ్ సంస్థను ప్రారంభించనున్నట్టు లిక్కర్ కంపెనీ డియాజియో బిజినెస్ సర్వీస్ ఇండియా(డీబీఎస్ఐ) ప్రకటించింది. కార్లే టౌన్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) లో కొత్త వ్యాపారకేంద్రాన్ని సోమవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా కొత్త కేంద్రం కోసం 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని వెల్లడించింది.
2017 అక్టోబర్ 17 నాటికి దేశంలో వ్యాపార సేవలను మొదలు పెడతామని డియాజియో మేనేజింగ్ డైరెక్టర్ ట్రేసీ బర్న్స్ చెప్పారు. ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ రంగాలపై దృష్టి పెట్టామన్న డీబీఎస్ఐ బిజినెస్ ఇంటలిజెన్స్, ఎనలిటిక్స్ అండ్ డేటా, ఇతర సేవల వైపు వేగంగా పయనిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో 1,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే నియామకాలు మొదలుపెట్టామని 100మందిని ఎంపిక చేశామని తెలిపింది. నైపుణ్యానికి పెద్ద పీట వేసి ప్రోత్సాహాన్నిచ్చే తాము చాలా అవకాశాలను కల్పించడంతో పాటు స్త్రీ పురుషులకు సమాన ప్రాతినిధ్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు.