జానపద కళల్ని కాపాడుకుంటాం: రాజయ్య
ప్రపంచ జానపద దినోత్సవంలో డిప్యూటీ సీఎం రాజయ్య
సాక్షి, హైదరాబాద్: జానపద కళాకారులను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి రాజయ్య హామీ ఇచ్చారు. వారికి తప్పక ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక జానపద పాటలే పోషించాయని తెలిపారు. శుక్రవారం రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ జానపద దినోత్సవం-2014 కార్యక్రమం జరిగింది. నిజమైన సమాజిక కార్యకర్త కేసీఆర్ అని ఈ సందర్భంగా రాజయ్య కొనియాడారు.
కళాకారులే తమ మాటలు, పాటల ద్వారా నేతలను తయారు చేశారన్నారు. ‘‘నేను ముందు తెలంగాణ వస్తుందనుకోలేదు. సదాలక్ష్మిలా చరిత్రలో అయినా నిలుస్తానని ఆశపడ్డాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు రుణం తీర్చుకోలేనంత పదవినిచ్చారు’’ అన్నారు. జానపదం అద్భుత విజ్ఞాన గని అని గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. కళాకారుల బాగోగుల బా ధ్యతలన్నీ ప్రభుత్వమే తీసుకుంటుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. జానపదం తెలంగాణలో తిరిగి రాజ్యమేలుతుందన్నారు. జానపద కళారూపాలను బతికేలా చేయటానికే ప్రభుత్వం ఈ ప్రదర్శనలను నిర్వహిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి తెలిపారు.