లలిత్ బాబు పరాజయం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్స్ (జీఎం) చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జీఎం ఎంఆర్ లలిత్ బాబుకు తొలి పరాజయం ఎదురైంది. గత నాలుగు గేమ్‌లలో మూడు గెలిచి, ఒకటి ‘డ్రా’ చేసుకున్న లలిత్, ఐదో రౌండ్లో తలవంచాడు. ఇక్కడి కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌కే చెందిన ఎస్పీ సేతురామన్ 41 ఎత్తుల్లో లలిత్‌ను ఓడించాడు.
ఈ పరాజయంతో ఏపీ ఆటగాడు మూడున్నర పాయింట్లతో 11వ స్థానానికి దిగజారాడు. అయితే లలిత్‌పై విజయంతో చెన్నైకి చెందిన సేతురామన్ (4.5)...ఉక్రెయిన్ జీఎం వ్లదీస్లావ్ (4.5)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. రాష్ట్రానికి చెందిన ఎస్. రవితేజ ఐదో రౌండ్లో సంచలన విజయం సాధించాడు. ఈ గేమ్‌లో ఐఎం స్వప్నిల్ ధోపడేను చిత్తు చేసిన రవితేజ 13వ స్థానానికి చేరుకున్నాడు. ఏపీ అమ్మాయి బొడ్డా ప్రత్యూషకు ఈ రౌండ్లోనూ ఓటమి ఎదురైంది. భారత్‌కే చెందిన దేవరాజ్ ఛటర్జీ చేతిలో ప్రత్యూష పరాజయం పాలైంది.