భారత కబడ్డీ సారథి అనూప్
ముంబై: ప్రపంచకప్‌లో భారత కబడ్డీ జట్టుకు హరియాణా స్టార్ రైడర్ అనూప్ కుమార్ సారథ్యం వహించనున్నాడు. 14 మంది సభ్యులుగల ఈ జట్టుకు బల్వన్ సింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. భారత్ ఆతిథ్యమిచ్చే ఈ ప్రపంచకప్ కబడ్డీ టోర్నీ వచ్చే నెల 7 నుంచి అహ్మదాబాద్‌లో జరుగనుంది.
మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జట్టు వివరాలను వెల్లడించారు. మొత్తం 12 దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటాయి. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కబడ్డీ జట్టు జెర్సీని ఆవిష్కరించారు. ప్రపంచకప్‌కు భారత కబడ్డీ జట్టు: అనూప్ (కెప్టెన్), మన్జీత్ చిల్లర్ (వైస్ కెప్టెన్), అజయ్ ఠాకూర్, దీపక్ హుడా, ధర్మరాజ్, జస్వీర్ సింగ్, కిరణ్ పర్మార్, మోహిత్, నితిన్, పర్దీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, సందీప్, సురేందర్, సుర్జీత్.
పాక్‌ను ఆడించమంటారా..?
కపిల్ ఆగ్రహం
కబడ్డీ జట్టు ప్రకటన కార్యక్రమంలో ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నతో క్రికెట్ దిగ్గజం కపిల్ ఆగ్రహానికి లోనయ్యారు. ‘ఈ టోర్నీలో పాకిస్తాన్‌ను ఎందుకు ఆహ్వానించలేదు’ అని ఓ విలేకరి ప్రశ్నించగా... వెంటనే సహనం కోల్పోరుున కపిల్ ‘నువ్వో భారతీయుడవైవుండి ఈ ప్రశ్నను అడుగుతావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రశ్నను అడుగుతారా..? పాక్‌ను పిలిచి ఆడించమంటారా?’ అని కస్సుమన్నాడు. యురీ ఘటనలో పాక్ ఉగ్రవాదుల దాడిలో 18 మంది భారత జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే.