విశ్వచిత్రం
ఒక చిత్ర రచనాక్రమంలో, ధౌతం, ఘట్టితం, లాం ఛితం, రంజితం అనే నాలుగు దశలున్నాయి. చిత్ర కారుడు చిత్ర రచనకు తెచ్చిన తొలి వినిర్మల వస్త్రమే ధౌతం. గట్టి పరచడానికి గంజి పెట్టగా ఏర్పడిన వస్త్రమే ఘట్టితం. ఆ గట్టి పడ్డ వస్త్రంపై ప్రాథమికంగా స్కెచ్ వేయటమే లాంఛితం. ఆస్కెచ్పై చిత్రానికి అను కూలంగా రంగుల్ని వేయటమే రంజితం. ఈ నాల్గు దశల్లో చిత్రం సిద్ధమవుతుంది.
చిత్ర రచనకు తొలి దశలో ధౌతం ఉన్నట్లే, ఈ విశ్వచిత్ర రచనకూ ఆదిలో ఉన్నది చిత్ పదార్థమే. అప్పటి ఈ చిత్ పదార్థం మాయ కానీ, మాయా కార్య మైన ద్వైత సంస్పర్శ కానీ లేనిది. అదే విశ్వ చిత్ర రచ నలో తొలిదశ. ఆ చిత్ నేను చాలా కావాలి అని తల పోసి, మాయను పొంది, ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వి అనే పంచ తన్మాత్రల్ని సృజించి, అందులో తానే ప్రవేశాన్ని పొంది, అంతర్యామిగా మారింది. ఇది విశ్వ సృష్టిలో రెండవ దశ.
ఈ అపంచీకృత పంచమహా భూతాల్లో, తన్మా త్రలు ఐదింటిలో, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఒక్కొక్క మహాభూతంలో ఒక్కొక్క గుణాన్ని వ్యష్టిగు ణమంటారు. అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్విలో గల విడివిడి సత్వగుణం వ్యష్టి. ఐదింటిలో కల ఐదు సత్వగుణాంశలు కలిస్తే సమష్టి. అలాగే వ్యష్టి రజోగుణం, సమష్టి రజోగుణం. వ్య ష్టితమోగుణం, సమష్టి తమోగుణం. ఐదింటి ఐదు వ్యష్టి సత్వగుణాలవల్ల, శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వఘ్రాణాలనే పంచ జ్ఞానేంద్రియాలు జనించాయి. ఐదు తన్మాత్రల సమష్టి సత్వాంశచే, మనోబుద్ధి చిత్తా హంకారాలనే అంతఃకరణ పుట్టింది. ఐదింట ఐదు వ్యష్టి రజోగుణాల వల్ల, వాక్ పాణి పాద పాయు ఉపస్థ లనే పంచకర్మేంద్రియాలు పుట్టాయి. ఐదింటి సమష్టి రజోగుణాంశచే, పంచ ప్రాణాలు పుట్టాయి.
ఇలా జనించిన పంచ జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతఃకరణ చతుష్ట యం, ఈ పందొమ్మిదింటి కలయికనే సూక్ష్మ శరీరం అంటారు. ఒక్కొక్కడు తన సూక్ష్మశరీరాన్ని ఎలా అభి మానిస్తాడో, అలా ఈ విశ్వంలోని అన్ని వ్యష్టి సూక్ష్మ దేహాల్ని సమష్టిగా అభిమానించే వాడిని సూత్రాత్మ అంటారు. విశ్వ చిత్ర రచనలో ఇది మూడవ దశ.
ప్రతి మహాభూతంలోనూ, దాని స్వీయ తత్వం సగం ఉండి, రెండవ సగంలో మిగిలిన నాల్గు మహా భూతాల తత్వాలు చేరటమనే పంచీకరణాన్ని పంచ మహాభూతాలు పొందాయి. ఈ పంచీకృత పంచమ హాభూతాల వల్ల చరాచరాత్మకమైన సృష్టి ఏర్పడింది. ఇదంతా స్థూల ప్రపంచం. ఒక్కొక్కడూ తన స్థూల దేహాన్ని ఎలా అభిమానిస్తాడో, అలా ఈ సృష్టిలోని సమష్టి స్థూల శరీరాల్ని అభిమానించేవాడు విరాట్. ఇది విశ్వచిత్ర రచనలో నాల్గవ దశ. ఈ నాల్గు దశల్లో విశ్వచిత్రం పరమాత్మపై చిత్పై ఆరోపితమైనది. ఈ సృష్టి మర్మాన్ని గ్రహించి, విశ్వచిత్రాన్ని దర్శిస్తూ జగత్ చిత్రానికి ఆధారమైన చిత్ను ధ్యానిస్తూ, మనమూ తత్వవేత్తలమై నిలుద్దాం.
పరమాత్ముని