రాష్ట్రానికి కీళ్లనొప్పులు!
- దాదాపు 20 శాతం మందికి ఆర్థరైటిస్
- రుమటాలజీ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జనాభాలో 20 శాతం.. అంటే సుమారు 70 లక్షల మంది వివిధ రకాల కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. ఈ బాధితుల్లో దాదాపు 70 శాతం వరకు మహిళలు, 30 శాతం పురుషులు. అంతేకాదు బాధితుల్లో ఎక్కువమంది 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువారే. మరి ఈ వ్యాధికి చికిత్స చేయించుకుందామన్నా... రుమటాలజీ నిపుణులు కరువు. 70 లక్షల మంది బాధపడుతున్న చోట ఉన్న నిపుణులు.. కేవలం 20 మంది లోపే. రుమటాలజీ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ విభాగం ఈ విషయాలను వెల్లడించింది. ఈ నెల 12న ప్రపంచ కీళ్ల నొప్పుల (ఆర్థరైటీస్) దినం సందర్భంగా ప్రత్యేక కథనం!
హైదరాబాద్‌లో ఎక్కువ..
కీళ్లనొప్పి బాధితులపై రుమటాలజీ ఆర్థరైటిస్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ ఇటీవల ఓ సర్వే చేసింది. దేశంలోని ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే ఇక్కడ ఆర్థరైటిస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. జన్యు సంబంధ కారణాలతో పాటు జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం, సంప్రదాయ ూల పేరుతో మహిళలు కుర్చీలు, సోఫాల్లో కాకుండా నేలపై కూర్చుంటుండటం, శరీరానికి ఎండ తగలకుండా పగలంతా ఏసీ గదుల్లోనే గడుపుతుండటం, గర్భ నిరోధక మాత్రల వినియోగం వంటి కారణాల వల్ల చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల బారిన పడుతున్నట్లు నిర్ధారించింది. చాలా మందికి కీళ్ల నొప్పులపై అవగాహన లేకపోవడం వల్ల నిర్లక్ష్యం చేస్తూ... గుండె, కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నట్లు పేర్కొంది. వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులు సాధారణమేగానీ ఇప్పుడు యువతరాన్ని కూడా కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి.
బాధితుల్లో హృద్రోగ సమస్యలు
కీళ్లనొప్పుల సమస్య పరోక్షంగా గుండె పనితీరుపైనా ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు. బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లివర్‌ఫూల్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ సెంటర్, ఎబి రుమటాలజీ సెంటర్ సంయుక్తంగా ఇటీవల హైదరాబాద్‌లో ఓ సర్వే చేశాయి. కీళ్లనొప్పులతో బాధపడుతున్న 25 నుంచి 46 ఏళ్లలోపు వారిలో 800 మందిని శాంపిల్‌గా ఎంపిక చేశారు.
ఈ బాధితుల్లో 666 మంది మహిళలే. ఇక ఆరోగ్యంగా ఉన్న మరో 800 మందిని రెండో శాంపిల్‌గా తీసుకున్నారు. వయసు, లింగ నిష్పత్తి, ధూమపాన అలవాటు, నడుం చుట్టుకొలత, హైపర్ టెన్షన్, మధుమేహం, బాడీమాస్ ఇండెక్స్, బీపీ, షుగర్ తదితర అంశాల ఆధారంగా ఈ రెండు గ్రూపులపై పరిశోధన చేశారు. ఆరోగ్యవంతులతో పోలిస్తే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ బాధితుల్లో 2-3 శాతం ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు డాక్టర్ ఫిర్దౌస్ ఫాతిమా వెల్లడించారు.
మహిళల్లోనే ఎక్కువ
‘‘పురుషులతో పోలిస్తే మహిళల్లో కీళ్లనొప్పి బాధితులు ఎక్కువ. రుతుచక్రంలో మార్పులు, ఈస్ట్రోజోన్ ఉత్పత్తి, అతిగా గర్భనిరోధక పిల్స్ వినియోగం, సంప్రదాయాల పేరుతో నేలపైనే కూర్చోవడం, విటమిన్ డి లోపం వల్ల మహిళలు కీళ్లనొప్పుల బారిన
పడుతున్నారు. ’’
- డాక్టర్ లిజా రాజశేఖర్,
రుమటాలజీ ప్రొఫెసర్, నిమ్స్
వైద్యుల కొరత ఉంది
‘‘దేశంలో రుమటాలజిస్టుల కొరత తీవ్రంగా ఉంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో అసలు రుమటాలజీ నిపుణులే లేరు. తెలంగాణ, ఏపీల్లో కలిపి చూసినా ఒక్క హైదరాబాద్ మినహా మరే జిల్లాలోనూ ఈ వైద్యులు లేరు.’’
- డాక్టర్ పి.ఎస్.ఆర్.గుప్త, గుప్తాస్
ఆర్థరైటీస్ అండ్ రుమటిజమ్ సెంటర్
మందులతో తగ్గించవచ్చు..
‘‘ఇతర వ్యాధులతో పోలిస్తే ఆర్థరైటిస్ కొంత భిన్నమైంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి. కీళ్లు, చేతులు, భుజాలు, తుంటి, వెన్నెముకపై ప్రభావం చూపుతుంది. ఎముకల వైద్య నిపుణులు దీనికి శస్త్రచికిత్సలు చేస్తే... రుమటాలజిస్టులు కేవలం మందుల ద్వారానే నయం చేయగలరు.’’
- డాక్టర్ రాజ్‌కిరణ్,
రుమటాలజిస్ట్, స్టార్ ఆస్పత్రి
కీళ్ల నొప్పులు, వైద్య సౌకర్యాల పరిస్థితి
రాష్ట్రంలో బాధితులు: దాదాపు 20 శాతం మంది
మహిళల్లో: 60-70 శాతం
పురుషుల్లో: 30-40 శాతం
ఆస్టియో ఆర్థరైటీస్ (మోకాలి నొప్పి) బాధితులు: 20 శాతం
రుమాటాయిడ్ ఆర్థరైటీస్ (చేతి కీళ్ల నొప్పి) బాధితులు: 3-4 శాతం
స్పాండిలో ఆర్థరైటీస్ (తుంటి, వెన్ను, భుజం నొప్పి) బాధితులు: 0.8 శాతం
లూపస్ ఆర్థరైటీస్ బాధితులు: 1 శాతం
పిల్లల్లో వచ్చే కీళ్లనొప్పి బాధితులు :1 శాతం
దేశంలో రుమటాలజీ వైద్యులు: 700-1000 మంది
హైదరాబాద్‌లో ఉన్నది: 15-20 మంది
ఒక్క నిమ్స్ మినహా మరే ప్రభుత్వ ఆస్పత్రిలోనూ రుమటాలజీ వైద్యులు లేరు