ప్రదీప్‌కు కాంస్యం
ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్
గ్రనాడా (స్పెయిన్): ఒకవైపు సీనియర్లు వరుసగా విఫలమవుతోంటే... మరోవైపు జూనియర్ షూటర్ ప్రదీప్ సత్తాచాటాడు. ఫలితంగా ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. ఈ పోటీల్లో ఇంతకుముందు సీనియర్ విభాగంలో జీతూ రాయ్ (50 మీటర్ల పిస్టల్) రజతం సాధించగా... తాజాగా జూనియర్ షూటర్ ప్రదీప్ కాంస్య పతకం అందించాడు. బుధవారం జరిగిన 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ జూనియర్ విభాగంలో ప్రదీప్ మూడో స్థానంలో నిలిచాడు. ఫైనల్లో ప్రదీప్, డారియో డి మార్టినో (ఇటలీ) 561 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచారు. అయితే ‘షూట్ ఆఫ్’లో ప్రదీప్ 45 పాయింట్లు స్కోరు చేయడంతో అతనికి కాంస్యం... 46 పాయింట్లు సాధించిన మార్టినోకు రజతం దక్కాయి. అలెగ్జాండర్ చిచ్కోవ్ (అమెరికా) 563 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించాడు.