World Steel Association
-
తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన సజ్జన్ జిందాల్..!
వరల్డ్ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) ఛైర్మన్‌గా జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌ను ఎన్నుకున్నారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఛైర్మన్‌గా నియమితులైన తొలి భారతీయుడిగా సజ్జన్ జిందాల్ నిలిచారు. సజ్జన్ ఒక ఏడాదిపాటు ఈ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ వైస్ఛైర్మన్లుగా హెచ్‌బీఐఎస్ గ్రూప్‌కు చెందిన యూ యాంగ్, పోస్కో జియాంగ్ వూ చోయ్ సెలక్ట్ అయ్యారు. చదవండి: అరేవాహ్...! జాతీయ రికార్డును కొల్లగొట్టిన మహీంద్రా ఎక్స్‌యూవీ..! ఎగ్జిక్యూటివ్ కమిటీలో భాగంగా టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్, ఆర్సెలార్ మిట్టల్ చీఫ్ ఎల్ఎన్ మిట్టల్ ఎంపికైనారు. ఈ సంస్థకు ట్రెజరరీగా బ్లూస్కోప్ స్టీల్‌కు చెందిన మార్క్ వాసెల్లా, ఇంటర్నేషనల్ స్టెయిన్లెస్ స్టీల్ ఫోరమ్ ఛైర్మన్‌గా టియోటియో డి మాలో (అపెరామ్) ఎన్నికయ్యారు. అంతేకాకుండా బోర్డు సభ్యులు 16 మందితో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని నియామకం కూడా జరిగింది. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ సభ్యుల పదవి కాలం ఒక సంవత్సరం పాటు కొనసాగనుంది. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఉక్కు పరిశ్రమకు కేంద్ర బిందువుగా పనిచేస్తోంది. స్టీల్‌రంగంలో ప్రభావితం చేసే అన్ని ప్రధాన వ్యూహాత్మక సమస్యలపై పరిష్కారాలను డబ్ల్యూఎస్‌ఏ చూపిస్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టీల్ ధరలను నియంత్రిస్తోంది. దీనిని 1967లో స్థాపించారు. ఈ సంస్థలో ఉన్న సభ్యులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 శాతం ఉక్కును ఉత్పత్తి చేస్తున్నారు. చదవండి: పేరు వాడితే...! రూ. 7500 కోట్లు కట్టాల్సిందే...! -
ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల
న్యూఢిల్లీ: దేశీయంగా ముడి ఉక్కు ఉత్పత్తిలో తగ్గుదల నమోదైంది. తాజాగా వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం.. గతనెల్లో మొత్తం ఉత్పత్తి 8.934 మిలియన్ టన్నులు (ఎంటీ)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని 9.192 ఎంటీలతో పోల్చితే 2.8 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో 3.4 శాతం తగ్గిన సంగతి తెలిసిందే కాగా, వరుసగా రెండు నెలల పాటు ఉత్పత్తిలో క్షీణత నమోదైంది. ఇక అంతర్జాతీయంగా కూడా గత నెల్లో ఉక్కు ఉత్పత్తి ఒక శాతం తగ్గింది. అయితే, ఈ పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న చైనా మాత్రం నవంబర్‌లో 4 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం విశేషం. ఆ దేశం గత నెల్లో 80.287 ఎంటీ ఉత్పత్తిని నమోదుచేసింది. అమెరికా ఉత్పత్తి 2.2 శాతం తగ్గి 7.233 ఎంటీగా ఉంది. -
ప్రపంచ స్టీల్ మార్కెట్‌ను దెబ్బతీస్తున్న చైనా
వాషింగ్టన్: ప్రపంచ స్టీల్ మార్కెట్‌కు చైనా విఘాతం కలిగించడంతోపాటు... ప్రత్యక్షంగా, పరోక్షంగా దానికి నష్టం కలగజేస్తోందని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ ఆరోపించారు. స్టీల్ దిగుమతులపై 25%, అల్యూమినియం ఉత్పత్తులపై 10% టారిఫ్ విధిస్తూ ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అనైతిక వ్యాపార విధానాల ఫలితంగా సమస్యలను ఎదుర్కొంటున్న అమెరికా పరిశ్రమను కాపాడేందుకు ఈ స్థాయిలో టారిఫ్‌ల విధింపు అవసరమని విల్బర్రాస్ సెనేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులకు వివరించారు. చైనా అమెరికాకు చేసే ఎగుమతులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని, ఇతర దేశాల ద్వారా వాటిని ఎగుమతి చేస్తోందని రాస్ పేర్కొన్నారు. చైనా అనైతిక వాణిజ్య విధానాల ద్వారా మార్కెట్ వాటాను పెంచుకుంటోందన్న సెనేట్ సభ్యుల పరిశీలనతో రాస్ ఏకీభవించారు. అమెరికా చర్యలు దానికీ నష్టమే: చైనా చైనాకు చెందిన వందలాది బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్‌లు విధిస్తామంటూ అమెరికా ఒత్తిడి తీసుకొచ్చే ఎత్తుగడలు, బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని చైనా విమర్శించింది. చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావోఫెంగ్ ఈ విషయమై మాట్లాడుతూ... ప్రపంచ వాణిజ్య క్రమాన్ని అమెరికా దెబ్బతీస్తోందని ఆరోపించారు. అమెరికా విధానాలు సొంత వాణిజ్యంతోపాటు, భాగస్వామ్య దేశాలకూ హాని కలగజేస్తాయన్నారు. అమెరికా టెక్నాలజీ, మేధో సంపత్తి హక్కులను చైనా హరిస్తోందంటూ ఆ దేశ ఉత్పత్తులపై ట్రంప్ సర్కారు 50 బిలియన్ డాలర్ల మేర టారిఫ్‌లకు ఆదేశించిన విషయం తెలిసిందే. -
స్టీల్ డిమాండ్ వృద్ధి అంచనా 5.4 శాతం
న్యూఢిల్లీ: భారత్‌లో స్టీల్ డిమాండ్ పుంజుకోనుంది. ఇది ఈ ఏడాది 5.4 శాతం వృద్ధితో 83.8 మిలియన్ టన్నులకు (ఎంటీ) పెరగొచ్చని వరల్డ్ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) అంచనా వేసింది. 2017లోనూ డిమాండ్ ఇదే వృద్ధితో 88.3 ఎంటీలకు చేరుతుందని అభిప్రాయపడింది. తక్కువ ముడి చమురు ధరలు సహా ఇన్ఫ్రా వృద్ధికి, దేశీ త యారీ సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణలు డిమాండ్ పెరుగుదలకు దోహదపడతాయని వివరించింది. కాగా అంతర్జాతీయంగా స్టీల్ డిమాండ్ ఈ ఏడాది 0.8% క్షీణతతో 1,488 ఎంటీలకు తగ్గొచ్చని అంచనా వేసింది. ఇక 2017లో ఈ డిమాండ్ మళ్లీ పుంజుకొని 0.4% వృద్ధితో 1,494 ఎంటీలకు పెరగొచ్చని తెలిపింది. -
ఉక్కు ఉత్పత్తిలో మూడో స్థానానికి భారత్
న్యూఢిల్లీ: భారత్‌లో ఉక్కు ఉత్పత్తి ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో అమెరికాను మించిపోయింది. 2015 జనవరి, ఫిబ్రవరి నెలల్లో అమెరికా 13.52 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయగా, భారత్ 14.56 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసిందని వరల్డ్ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) వెల్లడించింది. దీంతో ఉక్కు ఉత్పత్తి విషయంలో మూడో అతి పెద్ద దేశంగా అమెరికాను తోసిరాజని భారత్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుందని పేర్కొంది. డబ్ల్యూఎస్‌ఏ గణాంకాల ప్రకారం.. వివిధ ఉక్కు కంపెనీల కొత్త ప్లాంట్లు ఈ ఏడాదిలోనే ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించనున్నందున భారత్‌లో ఉక్కు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో భారత ఉక్కు ఉత్పత్తి ఈ ఏడాది 100 మిలియన్ టన్నులను దాటొచ్చు. మరోవైపు సమీప భవిష్యత్తులో అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకునే సూచనలు లేనందున ఈ దేశంలో ఉక్కు ఉత్పత్తి కొంచెం తగ్గే అవకాశాలున్నాయి. గత నాలుగేళ్లుగా అమెరికాలో ఏడాదికి 86 నుంచి 88 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతోంది. ఈ కారణాల వల్ల ఈ ఏడాది ఉక్కు ఉత్పత్తి విషయంలో చైనా, జపాన్ల తర్వాత స్థానం భారత్‌దే కానున్నది. ఇప్పటి వరకూ మూడో స్థానంలో ఉన్న అమెరికాను భారత్ దాటేసే అవకాశాలున్నాయి.