World Suicide Prevention Day
-
సమస్యల్ని పంచుకుంటున్నాం..అవగాహన పెంచుకుంటున్నాం..
‘క్షణంలో వెయ్యోవంతు కాలంలో జీవితం పట్ల దృక్పథం మారిస్తే చాలు ఓ జీవితాన్ని నిలబెట్టగలుగుతాం’అంటున్నారు వన్‌లైఫ్ వలంటీర్లు. మానసిక ఒత్తిడి, ఇతరత్రా సమస్యలతో ఆత్మహత్య లాంటి ఆలోచనల నుంచి విముక్తి కల్పించడానికి జాతీయస్థాయిలో 24/7 సేవలు అందిస్తోది వన్‌లైఫ్ సంస్థ. దీని ఆధ్వర్యంలో గత కొంత కాలంగా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన వలంటీర్లు సాక్షితో తమ అనుభవాలు పంచుకున్నారు. –సాక్షి, హైదరాబాద్ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించిన వారికి సంబంధించిన సమస్యల విషయంలో మేం పూర్తిగా గోప్యత పాటిస్తాం. కాల్స్ కోసం 24/7 అందుబాటులో ఉంటాం అంటున్న వలంటీర్లు చెప్పిన విశేషాలు వారి మాటల్లోనే...ఒత్తిడిని చిత్తు చేస్తూ..ట్రిపుల్ ఐటీ పూర్తి చేశా..చదువుకునే సమయం నుంచీ ఒత్తిడి బాగా ఉండేది. అయితే లోకువగా చూస్తారేమోనని ఎవరికీ చెప్పలేకపోయేవాడ్ని. అదే సమయంలో వన్‌లైఫ్ సంస్థ గురించి తెలిసింది..వీరిని అప్రోచ్ అయ్యి నా ఒత్తిడి పోగొట్టుకోగలిగాను. మరెంతో మందికి పరిష్కారంగా మారాలని వన్లైఫ్లో వలంటీర్‌గా జాయినయ్యా. మూడేళ్ల నుంచి ప్రతీ శనివారం 4గంటల పాటు వలంటీర్‌గా ఇంటి నుంచే చేస్తున్నా. తొలుత చాలా నెగిటివిటీ వస్తుంటుంది జాగ్రత్త అని ఫ్యామిలీ మెంబర్స్ హెచ్చరించారు. అయితే ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నాకేమీ సమస్య అనిపించలేదు. స్టూడెంట్స్ పరీక్షల టైమ్‌లో ఎక్కువ కాల్స్ రిసీవ్ చేసుకున్నా. అది నేను అనుభవించి వచ్చాను కాబట్టి బాగా కనెక్ట్ అయ్యాను. లవ్ ప్రాబ్లెమ్స్‌తో కూడా వస్తున్నాయి.. ఇతరుల సమస్యలు వినడం వల్ల మన సమస్యలు చిన్నగా అనిపిస్తూంటాయి. అలా ఈ పని నాకు వ్యక్తిగత జీవితంలో సమస్యల పరిష్కారానికి కూడా చాలా హెల్ప్ అయింది. –సూర్య, మాదాపూర్నాలో ఉన్న ఖాళీని భర్తీ చేసుకుంటూ...రిటైర్మెంట్ తర్వాత కొంత ఎంప్టీనెస్ అనిపించి ఈ సేవలోకి వచ్చాను. నాకు విభిన్న భాషల్లో పట్టు ఉండడం వల్ల దేశవ్యాప్తంగా కాల్స్ వస్తుంటాయి. రిలేషన్ షిప్స్‌కు సంబంధించినవే ఎక్కువగా వస్తున్నాయి. ‘నేను అమ్మాయిని కాను నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు... నాది అబ్బాయి మనస్తత్వం అని చెప్పలేకపోతు న్నా’అంటూ ఓ అమ్మాయి చేసిన కాల్, అలాగే ఓ అమ్మాయి తనను ప్రేమ పేరుతో డబ్బులు ఖర్చుపెట్టించి వదిలేసిందని, నేనెంతో తెలివిగల వాడ్ని అనుకునేవాడ్ని ఎలా ఇలా మోసపోయానో’అంటూ మరో అబ్బాయి కాల్... ఇలాంటివి కొన్ని గుర్తుండిపోయే సమస్యలు వస్తుంటాయి. వారితో మాట్లాడడం ద్వారా వారిలో కొత్త ఆలోచనలు వచ్చేలా చేయడమే ముఖ్యం తప్ప సలహాలు, సూచనలు ఇవ్వడం చేయం. –రుక్మిణి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్అవగాహన పెంచుతున్న సమస్యలు...హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగినిగా చేస్తున్నా. ఏడాది నుంచి వన్లైఫ్లో వలంటీర్‌గా రాత్రి 9 నుంచి 11 గంటల సమయంలో కాల్స్ అటెండ్ అవుతుంటా. ఇష్టం వచ్చినట్టు లోన్స్ తీసుకున్నాం కట్టలేకపోతున్నాం లాంటి సమస్యల నుంచివిడాకుల తర్వాత లోన్లీనెస్ ఫేస్ చేయలేకపోతున్నాం దాకా ఎన్నో రకాల సమస్యలతో కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం అయిందేమిటంటే...ప్రాబ్లెమ్‌ని ఇతరులతో షేర్ చేసుకుంటే మమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తారో అని భయంతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఈ వలంటరీ విధుల వల్ల అనేక రకాల సమస్యలపై యుక్త వయసులోనే అవగాహన కలుగుతోంది.–అనూష, బోయినపల్లిజీవితం మీద ఆశ చిగురించేలా చేయొచ్చు విద్యార్థుల్లో అధిక గ్రేడ్స్‌కు సంబంధించిన ఒత్తిడి అంచనాలు, ఇతరులతో పోల్చడం, ర్యాగింగ్. మిగిలిన వారిలో అనుబంధాలు, అంచనాలు, తీర్చలేని డిమాండ్లు, సందేహాలు పరస్పరం నిందించుకోవడం తగాదాలు, వాదనలు, కోపం, ఆందోళన,.ఆర్థిక సంక్షోభాలు, వంటివి ప్రతికూలతకు దారి తీసిన ఫలితంగానే ఆత్మహత్యకు ఆలోచనలు చేస్తారు. అలాంటివారిలో జీవితం పట్ల ఆసక్తి పెంచే ఆలోచనల్ని ప్రోత్సహించడం, సానుకూలతను అందించడం, జీవితం అప్పుడే అయిపోలేదని నొక్కిచెప్పడం తమ కోసం మేం ఒక స్టాండ్ తీసుకోవడానికి ప్రోత్సహించడం చేస్తాం. ఒక్కో కాల్ అత్యధికంగా 45 నిమిషాల పాటు వింటాం. మా దగ్గర సీనియర్ కౌన్సెలర్లు ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఉన్నారు. కాలర్స్ మాటల్ని బట్టి ప్రమాదస్థాయిని అర్థం చేసుకొని, వెంటనే జోక్యం చేసుకొని, 3 నుంచి 4 ఫాలో అప్లు, కౌన్సెలింగ్ సెషన్స్ కొనసాగిస్తాం. పదేళ్లుగా మా వన్‌లైఫ్ ద్వారా ఏడాదికి 30 మంది వరకూ ఆత్మహత్య ఆలోచనల నుంచి దారి మళ్లించామని చెప్పగలను. మరింత మందిని వలంటీర్లుగా చేరమని ఆహ్వానిస్తున్నాం. ఈ వలంటీర్ వర్క్ మన ద్వారా మరికొందరికి జీవితం మీద ఆశ చిగురించేలా చేయడంతో పాటు మన జీవితంలోనూ ఎన్నో మంచి మార్పులకు దోహదం చేస్తుందని రచ్చితంగా చెప్పగలను. –రెబెకామరియా, వన్‌లైఫ్ నిర్వాహకులుఆలోచనల నుంచి డైవర్ట్ చేస్తే ఆత్మహత్యలు తగ్గిపోతాయి...వన్లైఫ్లో చేరాక మూమెంటరీ థింకింగ్ గురించి అర్థమైంది. ఫోన్ చేసినప్పుడు వారిని కాసేపు డైవర్ట్ చేస్తే చాలు. చాలా వరకూ ఆత్మహత్య ఆలోచనలు సమసిపోతాయి. కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్లనే చాలా వరకూ భారం తగ్గుతుంది. జీవితం చాలా గొప్పదనే విషయం తెలిసేలా చేస్తా తప్ప సలహాలు, సూచనలు ఇవ్వను. తొలుత ఫ్రీగా మాట్లాడలేరు కానీ కాసేపు గడిచాక చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఎవరికీ చెప్పలేని తీవ్రమైన ర్యాగింగ్ సంఘటనల నుంచి, భార్య వెళ్లిపోయింది పిల్లలు లేరు దాకా ఎన్నో.. నేను 15 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేశాను కాబట్టి నాకు ఈ పని కొంచెం సులభంగా మారింది. చేసేవారిలో 90 శాతం మంది కేవలం బాధలను చెప్పుకోవడం కోసమే చేస్తారు. మాట్లాడుతుండగానే వారి స్కిల్స్ గుర్తించి వాటిని వారికి గుర్తు చేస్తా. –వెంకటరమణి -
World Suicide Prevention Day 2022: ఆగండి.. ఒక్క క్షణం ఆలోచించండి!
‘కష్టమనేది లేని రోజంటు లేదు కదా.. కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా’ అన్నారో సినీ కవి. ఇది అక్షర సత్యం. ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదనేది జీవితం నేర్పిన పాఠం. ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల కంటే.. దానిని అధిగమిస్తే వచ్చే బంగారు జీవితం గురించి ఒక్క క్షణం ఆలోచించాలని మానసిన వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కలిసుంటే.. కలదు సుఖం అని గ్రహించి, బలవన్మరణాలకు స్వస్తి పలకాలని కోరుతున్నారు. – భువనేశ్వర్ జాతీయ స్థాయి సగటు కంటే ఒడిశాలో ఈ విషాద ఘటనలు పుంజుకోవడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల నివారణ పట్ల జంట నగరాల పోలీసు కమిషనరేట్ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తోంది. వీటి నివారణకు ప్రేరేపిస్తున్న శక్తులు, దర్యాప్తు, విచారణ, మీడియా ప్రసారాల పట్ల దృష్టి సారించాల్సి ఉందని ప్రముఖ మానసిక తత్త్వవేత్త ప్రొఫెసర్ సౌమిత్ర పఠారే తెలిపారు. జాతీయ స్థాయిలో ఆత్మహత్యల పెరుగుదల రేటు 12శాతం నమోదు కాగా, రాష్ట్రంలో 12.5 శాతంగా నమోదు కావడం కలవర పరుస్తోంది. ఇటీవల వెల్లడించిన జాతీయ నేర నమోదు బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదికలో ఈ విషయం పేర్కొంది. యువతరం ఆత్మహత్యల వర్గంలో ఒడిశా దేశంలో రెండో స్థానంలో నిలిచింది. కటక్–భువనేశ్వర్ జంట నగరాల్లో ఈ ఏడాది ఆగస్టు వరకు 226 ఆత్మహత్య ఘటనలు నమోదైనట్లు జంట నగరాల పోలీసు కమిషనరేట్ వెల్లడించింది. ఈ విచారకర ఘటనకు పాల్పడిన వారిలో న్యాయమూర్తులు, మహిళలు, ఇంజినీర్లు, విద్యార్థులు ఉన్నారని నివేదిక విశ్లేషించింది. ఈ పరిస్థితి నివారణ పట్ల పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. తాజా గణాంకాలు ఉపశమనం.. విద్యార్థుల ఆత్మహత్య వర్గంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచింది. విద్యాభ్యాసంతో ఉజ్వల భవిష్యత్ చవి చూడాల్సిన వారు ఆత్మహత్యకు పాల్పడి, బంగారు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఉత్తీర్ణతలో నిరాశ, ఉన్నత విద్యాభ్యాసం ఇతరేతర మౌలిక అవసరాలకు ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలతో విద్యార్థి వర్గంలో ఆత్మహత్య ఘటనలు పుంజుకుంటున్నాయి. ఎన్సీఆర్బీ–2021 నివేదిక ప్రకారం రాష్ట్రంలో గత ఏడాది సమగ్రంగా 834మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో యువకులు అధికంగా బలవన్మరణానికి పాల్పడినట్లు గణాంకాలు వివరించాయి. 697మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినుల సంఖ్య 137గా ఈ నివేదిక వెల్లడించింది. అయితే రాష్ట్రంలో క్రమంగా ఈ పరిస్థితి కుదుటపడే శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్సీఆర్బీ గత ఏడాది జారీ చేసిన నివేదికలో విద్యార్థుల ఆత్మహత్యల వర్గంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది పరిస్థితి కొంత మెరుగుపడినట్లు తాజా నివేదిక వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జాతీయస్థాయి రేటు ప్రకారం ఈ ఘటనలు తగ్గడంతో 5వ స్థానానికి చేరడం ఉపశమనంగా పరిగణిస్తున్నారు. 2020లో రాష్ట్రంలో 1,469మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో 1,042 మంది బాలురు, 427 మంది బాలికలు ఉన్నారు. 2019 నాటి ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 379మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఈ జాబితాలో రాష్ట్రం 14వ స్థానంలో నిలిచింది చక్కటి పరిష్కారం.. ఆత్మహత్యల నివారణలో తల్లిదండ్రులది కీలక పాత్ర. పిల్లలతో నిత్యం కలుపుగోలుగా వ్యవహరించడం తొలి సోపానం. స్వేచ్ఛాపూర్వక భావ వ్యక్తీకరణ ఉచితానుచిత పరిస్థితుల పట్ల అవగాహన కల్పించాలి. జీవితాంతం తోడుగా నిలిచి ఆశయ సాధనకు వెన్నంటి ఉండే వ్యవస్థ కుంటుంబం అనే దృక్పథంతో పిల్లల్లో నమ్మకం, విశ్వాసం బలపరిచి ఒంటరితనాన్ని తరిమితే ఆత్మహత్య నివారణ సాధ్యమే. విద్యాసంస్థల్లో చైతన్య శిబిరాలు అంచెలంచెల ఆశయ సాధన లక్ష్యంగా పలు వర్గాల బాల, బాలికలు, యువతీ, యవకులు విద్యా సంస్థలకు విచ్చేస్తారు. వీరి ఆశయ సాధన సాధ్యా సాధ్యాలను మనస్సుకు హత్తుకునేలా విశ్లేషించుకోగలిగే స్థైర్యం ప్రేరేపించడంలో విద్యాసంస్థలు ముందుకు రావాలి. విద్యార్థుల అలవాట్లను అనుక్షణం పరిశీలిస్తూ తదనుగుణంగా చైతన్య శిబిరాలు, మానసిక ఉల్లాసభరిత కార్యక్రమాలు చేపట్టడం విద్యార్థుల్లో ఆత్మహత్య నివారణకు తొలి మెట్టుగా నిలుస్తుంది. జీవితాంతం కలిసి బతుకుదాం.. పూర్ణాయుష్సుతో ఎదుగుదాం.. అనే నినాదంతో ఆత్మహత్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ పాత్రధారులు కావాలని ప్రేరేపించనున్నారు. విఫలయత్నాలెన్నో.. ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒక ఆత్మహత్య చోటు చేసుకుంటుంది. 15 ఏళ్లు నుంచి 29 ఏళ్ల మధ్య ఉజ్వల తారలుగా వెలుగొందాల్సిన వ్యక్తులు అత్యధికంగా ప్రాణాలు విడవటం ఆందోళనకర పరిస్థితి. ఏటా సగటున 7లక్షల 3వేల మంది ఆత్మహత్యలతో జీవితం ముగిస్తున్నారు. ఇలా మృతిచెందిన ప్రతి ఘటన వెనుక 20 ఆత్మహత్య విఫలయత్నాలు ఇమిడి ఉంటున్నాయి. ఆకస్మిక స్వేచ్ఛ అనర్థం.. ఆకస్మిక స్వేచ్ఛ, ఒంటరి జీవనం, అపరిమిత ఆశయ లక్ష్యం, అపరిచిత వాతావరణంలో సరికొత్త జీవనం విద్యార్థుల్లో అవాంఛిత ఒత్తిళ్లను బలపరిచి, ఆత్మహత్యలను ప్రేరేపిస్తోంది. 90శాతం వరకు సముచిత చికిత్స, వైద్య విధానంతో ఆత్మహత్య పరిస్థితులను నివారించడం సాధ్యం. కళాశాల దశలో అమ్మాయిల కంటే 4, 5 రెట్లు అధికంగా అబ్బాయిలే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. అలాగే యువకుల కంటే 2, 3 రెట్లు అధికంగా యువతులు ప్రాణాపాయం లేని ఆత్మహత్య ప్రయత్నాలకు పాల్పడుతుంటారు. ఒత్తిడి, వేధింపులు, మానసిక అశాంతి, కుటుంబంలో ఆత్మహత్య పూర్వ సంఘటనలు, నిరాశ వంటివి ఆత్మహత్య ప్రేరణ ప్రధాన అంశాలు. రేపటిని ఆహ్వానించాలి.. ఆత్మహత్య స్వయంకృత అపరాధం. రోజూ కొత్త ఆశయాలతో నేటిని ఆస్వాదించి, రేపటిని ఆహ్వానించడమే జీవన సాఫల్యం. కలవర పరుస్తున్న బలవన్మరణాల నివారణ పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం జరుపుకుంటున్నాం. చనిపోయి సాధించేది ఏమీ ఉండదు. మన సమస్యే అందరికంటే పెద్దదని బూతద్దంలో పెట్టి చూడటం మానసికంగా మరింత కృంగదీస్తుంది. ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లి, బయటపడిన వారి విజయ గాథలను స్ఫూర్తిగా తీసుకోవాలి. – డాక్టర్ అలోక్జ్యోతి సాహు, మానసిక వైద్య నిపుణులు, భువనేశ్వర్ -
‘నేనున్నాను’ అని చెప్పాల్సిన బాధ్యతను గుర్తు చేసే రోజు
‘నాకెవరున్నారు’ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవారికి వచ్చే మొదటి ఆలోచన అది. ‘నాకెవరూ లేరు’ అనిపించడం ‘ఈ సమస్య నుంచి నన్నెవరూ బయటపడేయలేరు’ అనిపించడం ‘ఈ సమస్య వల్ల నాతో ఉన్నవాళ్లంతా నాకు లేకుండా పోతారు’ అనిపించడం ‘నాకు ఎవరైనా తోడుంటే ఈ బాధ నుంచి బయటపడగలను’ అనిపించడం ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి అనిపిస్తే నష్టం లేదు. ఎప్పుడూ అనిపిస్తేనే ప్రమాదం. ఎప్పుడూ అనిపించేవారు గమనిస్తే తెలిసిపోతారు. అలాంటి వారికి ‘నేనున్నాను’ అని చెప్పాల్సిన బాధ్యతను గుర్తు చేసే రోజు ఇది. ముఖ్యంగా ఇంట్లో ప్రతి ఒక్కరూ ‘నీకు నేనున్నాను’ అని భరోసా ఇచ్చుకోవాల్సిన రోజు. కుటుంబసభ్యుల బలమే ఆత్మహత్యకు ప్రధాన విరుగుడు. ఆ సంగతిని గ్రహించాల్సిన రోజు కూడా ఇది. భార్గవి మధ్య వయసు గృహిణి. ఉద్యోగం చేసే భర్త, కాలేజీలకు వెళ్లే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజంతా ఇంటి పనుల్లో ఉంటుంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా క్షణాల్లో అమర్చుతుంది. చీకూ చింత చిన్న కుటుంబం. కానీ ఓ రోజు భార్గవి బాత్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉంది. ఆసుపత్రిలో చేర్చారు. మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కోలుకున్న భార్గవి ‘నాకెవరున్నారు’ అన్న మాటలకు భర్త, పిల్లలు ఆశ్చర్యపోయారు. ∙∙ సంజయ్ ఇంజినీరింగ్ చేస్తున్నాడు. ఆలస్యంగా నిద్రలేస్తున్నాడు. అడిగితే ఆకలి లేదంటున్నాడు. పిల్లాడికి ఈ మధ్య బద్ధకం ఎక్కువైంది అనుకుంది తల్లి. అదే మాట గట్టిగా అరిచి చెప్పాడు తండ్రి. మరుసటి రోజు ఉరి వేసుకుంటూ కనిపించిన కొడుకును చూసి అదేమని అడిగితే ‘ఎందుకు బతకాలి’ అని అడిగాడు. ఆ మాటలకు తల్లడిల్లిపోయారు తల్లిదండ్రులు. ∙∙ భార్గవి కుటుంబంలో పిల్లలు కాలేజీ చదువు అయిపోగానే ఫోన్లో ఉంటారు. భర్త ఇంట్లోనూ ఆఫీసు పని చేసుకుంటూ ఉంటాడు. అదేపనిగా స్నేహితులతో మాట్లాడతాడు. కానీ, భార్య స్థితి ఏంటో పట్టించుకోడు. తలనొప్పి, నీరసం అని చెప్పినా ‘మామూలేగా’ అనేస్తాడు. ‘ఎవరూ నన్ను పట్టించుకోరు’ అనే ఆలోచనతో చావే శరణ్యం అనుకుంది భార్గవి. సంజయ్ ప్రేమ విఫలమై, చదువులో ఫెయిల్ అయిన కారణంగా జీవితాన్ని చాలించాలనుకున్నాడనే విషయాన్ని తల్లిదండ్రులు తమ లోకంలో ఉండి పసిగట్టలేకపోయారు. ∙∙ ‘పన్నెండేళ్ల పిల్లల స్థాయి నుంచి వృద్ధుల వరకు ఆత్మహత్యల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉందంటు’న్నారు మనస్తత్వనిపుణులు. ‘‘కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్యకు సంబంధించిన మాటలు మాట్లాడం, బాధపడటం చూసినప్పుడు అసలు పట్టించుకోరు. వారి భావాలను చాలా చిన్నగా చేసి చూస్తారు. 80–90 శాతం జనం ఇలాగే ఆలోచిస్తారు’ అంటారు సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారి ప్రవర్తన ఎలా ఉంటుందో వివరించారు. ► మాట్లాడే మాటల్లో ఎక్కువ శాతం నెగిటిÐŒ గా ఆలోచిస్తారు. ‘నాకంటూ ఏవీ లేవు, ఎవరూ లేరు, ఏం చేసినా మంచి జరగదు..’ అంటూ ప్రతికూల వాతావరణాన్ని వెదుక్కుంటూ ఉంటారు. ► ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు పదే పదే ‘చచ్చిపోతాను’ అని చెబుతున్నా ‘వీళ్లేదో బెదిరించడానికి ఇలాగే చెబుతారులే. వీళ్లకంత ధైర్యం ఎక్కడిది?’ అనుకుంటారు ఇతరులు. దాంతో వీరు తమ మాటకు విలువ లేదని అహం దెబ్బతిని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. ► ఇంకో రకం వారు ఎదుటివారిలో మార్పు కోసం ఆత్మహత్యను వాడతారు. నేను చచ్చిపోతాను అనే ఆలోచన ఎదుటివారికి తెలిస్తే వారిలో మార్పు వస్తుందనుకుంటారు. ఆ విషయాన్ని గ్రహించకపోతే అంతకు తెగిస్తారు. మాటల కరువు ‘‘అసలు కుటుంబ సభ్యుల మధ్య మాటలే కరువయ్యాయి. ఫోన్లోనే జీవిస్తున్నారు’’ అంటారు సైకాలజిస్ట్ డాక్టర్ జ్యోతిరాజ. ‘సమయానికి తినడం, నిద్రపోవడం ఇవి శరీరానికి ఆరోగ్యాన్నిస్తాయి. ఉల్లాసపు మాటలు, ఉత్సాహపు కబుర్లే మనసును ఆహ్లాదంగా ఉంచుతాయి’ అంటారామె. పాజిటివ్ ఆలోచనా ధోరణి ఉన్నవాళ్లలోనే ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు చేసేవారిలోనే ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఉంటుందని అంతా అనుకుంటాం. కానీ, అన్ని విషయాల్లోనూ సానుకూల దృక్ఫధంతో ఉన్నవారు ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితి ఎదురైతే ‘ఇక అయిపోయింది నా జీవితం. ఎప్పటికీ తేరుకోలేను’ అనే ఆలోచన వచ్చి జీవితాన్ని ముగించుకోవాలనుకుంటారు. ‘పాజిటివ్‌గా ఉండే నేను నెగిటివ్ జీవితాన్ని భరించలేను’ అనే ఆలోచన చేస్తారు. ఇలాంటి వారిలో కొన్ని సిగ్నల్స్‌ని కనిపిస్తాయి. కీలకమైన సిగ్నల్స్.. గుర్తించండి సాదా సీదాగా కాకుండా వారి మనసు లోతుల్లోనుంచి వచ్చే భావనలా గుర్తించాలి. ‘నేను ఏదైనా చేయగలను’ అనే మనిషి ‘ఏమీ చేయలేను, నేను వేస్ట్’ అన్నప్పుడు వెంటనే అలెర్ట్ అవ్వాలి. అవి ఎలాంటివంటే.. ► అభిరుచులను, ఆసక్తులు వదిలేయడం ► ఇష్టమైన పనులు చేయకపోవడం ► ఇష్టమైన మాటలు మాట్లాడకపోవడం ► ఒంటరిగా ఉండాలనుకోవడం ► చేసే పని మీద దృష్టి పెట్టకపోవడం ► బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం ► ఆనందంగా ఉండే పరిస్థితుల్లోనూ బాధగా ఉండటం. బాధాకరమైన మాస్క్ వేసుకుంటారు డిప్రెషన్లో ఉన్నవారి కళ్లు నిస్తేజంగా, మెరుపు కోల్పోయి కనపడతాయి. ముఖంలో నవ్వు ఉండదు. బ్లాంక్ ఫేస్‌తో ఉంటారు. భావోద్వేగాలను ముఖంలో పలికించలేరు. మాట్లాడటానికే ఇష్టపడరు. కాళ్లూ చేతుల కదలికలను కూడా ఇష్టపడరు. రోజువారీ పనులనూ నిర్లక్ష్యం చేస్తారు. కాలు విరిగినా, చెయ్యి విరిగినా బాగయ్యేంతవరకు ఎలా విశ్రాంతి తీసుకుంటామో.. అలాగే మనసు కూడా సేదతీరేంత వరకు అవకాశాన్ని ఇవ్వాలి. సహనంతో కుటుంబ సభ్యులు ఇందుకు పూనుకోవాలి. మాటలే మందు..! పలకరించాలి. మాట్లాడుకోవాలి. గతంలో సాధించిన గెలుపు ఓటములను ప్రస్తావించాలి. పరిస్థితులు మారుతాయి అని చెప్పాలి. ఎక్కడన్నా బాధాకరమైన కథనాలు ఉంటే వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారో కూడా చెప్పాలి. సానుభూతి వాతావరణం మంచిది కాదు. ప్రాంతాన్ని మార్చాలి. నలుగురిలో సులువుగా కలిసిపోయేలా ఉంచాలి. – డా. కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ అతి పెద్ద మారణాయుధం ఫోన్ ఫోన్ కుటుంబాల్లోకి వచ్చి తిష్టవేసాకా ఒకరి బాగోగులు ఒకరు పట్టించుకోవడం అనేదే పోయింది. ఎక్కడో ఉన్నవారిని ‘అయ్యో’ అని మెసేజుల్లో పరామర్శిస్తారు. కానీ, ఇంటి వ్యక్తిని మాత్రం విస్మరిస్తారు. పిల్లల దగ్గర నుంచి ఫోన్లు లాక్కుంటే తమ పెన్నిధిని కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. పెద్దవాళ్లు ఫోన్ మాత్రమే తమ సర్వస్వం అన్నట్టుగా ఉంటున్నారు. వీటితోపాటు యువత ప్రేమ విఫలమైన కారణం, చదువులో వెనకబడటం వంటి వాటితో కూడా ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారు. కుటుంబమంతా కలిసి రోజూ పది నిమిషాలు మాట్లాడుకుంటే చాలు ఆ ఇంట ఆనందమే. ఆత్మహత్య అనే పదమే దరిచేరదు. – డా. జ్యోతిరాజ, సైకాలజిస్ట్ -
ధైర్యమే జీవితం.. బతికి సాధిద్దాం
జీవితం ఒక వరం..ఎంతో అందమైనది.. విలువైనది కూడా. దానిని తనివితీరా ఆస్వాదించాలి. అనుభవించాలి. ఇందులో ఒడి దుడుకులు.. కష్ట నష్టాలూ ఎదురవుతుంటాయి. అవి జీవనంలో ఓ భాగమే కానీ శాశ్వతం కాదు. ఈ విషయం తెలిసి కూడా కొందరు అందమైన జీవితాన్ని అర్ధతరంగా కాలదన్నుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలతో తమ వందేళ్ల ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ బలవన్మరణానికి ముందు ఒక్క క్షణం ఆగి.. ధైర్యమే జీవితం.. బతికి సాధిద్దామనుకుంటే.. భవిష్యత్ బాగుంటుంది. మరెన్నో జీవితాలు నిలబడతాయి. నేడు ‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం’ సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్): రోజురోజుకు క్రైమ్‌లు పెరిగిపోతున్నాయి. ఉదయం పేపర్ చూడగానే అవే వార్తలు కనిపిస్తాయి. ఇందులో ఎక్కువగా బలవన్మరణ వార్తలుండటం బాధాకరం. ఇలాంటి కథనాలు చదివితే అయ్యే అనిపిస్తోంది. ఎందుకింత పనిచేశాడని భావిస్తాము. చదివే పాఠకుడికే ఆ వార్త అంత బాధకలిగిస్తే ఆత్మహత్య చేసుకునే సయమంలో సదరు వ్యక్తి ఎంత ఇబ్బంది పడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో వారి మనోవేదన తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలో జిల్లాలో 2018లో 323, 2019లో 345, 2020లో ఇప్పటి వరకు 230 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం, పిల్లలకు మంచి విషయాలు చెప్పేవారు లేకపోవడం, సామాజిక మాధ్యమాలు, సినిమాలు, టీవీ సీరియళ్లు మొదలైన అంశాలు ఆత్మహత్యలు పెరిగేందుకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆత్మహత్యకు దారి తీసే కారణాల్లో కొన్ని ఆత్మహత్యకు చాలా సందర్భాల్లో బలమైన కారణాలు ఉండకపోవచ్చు. ఒక వ్యక్తి బాగా మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు, సమస్యకు పరిష్కారం లభించనప్పుడు, తమకు ఏం చేయాలో, సమస్య నుంచి ఎలా బయట పడాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడతారు. ఉద్యోగం లేదని, మునుపటి ఆత్మహత్య ప్రయత్నాలు, సంబంధ బాంధవ్యాల్లో సమస్యలు, గతంలో జరిగిన విషయాలు, మానసిక రుగ్మతలు, మత్తు మందులకు బానిస, విపరీతమైన భయం, ఎక్కువగా నిరాశకు గురికావడం, కుటుంబ చరిత్ర, విపరీతమైన అప్పులు, జీవితంపై నమ్మకం సన్నగిల్లడం, వ్యవసాయంలో నష్టాలు, పరీక్షలో ఉత్తీర్ణత కాకపోవడం ఇలా అనేక కారణాలు ఉంటాయి. హెచ్చరిక సంకేతాలు ►హఠాత్తుగా నిద్ర, ఆహార అలవాట్లు మారడం ►ఇతరులకు తాము భారం అవుతున్నట్లు మాట్లాడటం ►మోసగించబడినట్లుగా మాట్లాడటం ►నేనెందుకు జీవించాలని భావించడం ►కుటుంబం, స్నేహితుల నుంచి దూరంగా ఉండటం ►వీడ్కోలు పలకడానికి వ్యక్తులను కలవడం, పిలవడం ►విలువైన వస్తువులు వేరే వారికి ఇచ్చేయడం ►గతంలో జరిగిన విషయాలకు క్షమించమని అడగడం ►తరచూ అంతా అయిపోయిందని చెప్పడం ►భరించలేని బాధలో ఉండటం, ఏడవడం ►చికాకుతో ఉండటం ►ఒంటరిగా ఉండటం ఆత్మహత్యలను నివారిద్దామిలా... ♦బాధల్లో ఉన్న వారిని ఒంటరిగా వదలకూడదు. అలాంటి వారికి దగ్గరలో హాని చేసుకునే వస్తువులు, పరికరాలు ఏవీ ఉంచకూడదు. వారి కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ♦ఆత్మహత్య ప్రమాదాలు చాలా వరకు క్షణికావేశంలోనే జరుగుతుంటాయి. అందుకే ముందుగా ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి. ♦బలవన్మరణం చేసుకోవాలనుకున్న వ్యక్తుల కదలికలు, వారి మాటలు గమనిస్తూ ఉండాలి. వారిని ఇతరులతో పోల్చడం, అగౌరపరచడం, కొట్టడం చేయరాదు ♦సమస్యను సానుభూతితో విని నలుగురు కలిసి ధైర్యం చెప్పాలి. ♦వీలైనంత త్వరగా మానసిక నిపుణులను సంప్రదించి చికిత్స/సలహా తీసుకోవాలి. ♦చిన్నపాటి విషయాలకే విలువైన జీవితాన్ని బలితీసుకోకుండా ఒక్క క్షణం ఆలోచించాలి. ♦పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పక చనిపోతారు. ఇంతలోనే తొందర పడాల్సిన పనిలేదు. ♦కాలం అన్నింటికన్నా శక్తివంతమైనది. ఓర్పుతో ఉంటే అదే పరిష్కారం చూపిస్తుంది. కుటుంబ సభ్యుల పాత్ర కీలకం ఆత్మహత్యల నివారణకు ముఖ్యంగా కుటుంబ సభ్యుల పాత్ర కీలకం. నిరాశతో ఉన్న వారిని గమనిస్తూ ఉండాలి. వారిని దగ్గరకు తీసుకుని ఆతీ్మయంగా ఓదార్చాలి. నేనున్నానంటూ భరోసా కలి్పంచాలి. సమస్య పరిష్కారానికి సూచనలు చేయాలి. కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి నేర్పాలి. విద్యార్థులైతే బాల్యం నుంచే వారిలో మనోధైర్యం నింపాలి. చిన్న చిన్న విషయాలే కాదు పెద్ద సమస్యలు వచ్చినా ఏ విధంగా ఎదుర్కోవాలో వివరిస్తూ ఉండాలి. –డాక్టర్ కాటెం రాజశేఖరరెడ్డి, మానసిక వైద్యనిపుణులు, కర్నూలు ఐపీసీ 309 సెక్షన్‌ను రద్దు చేయాలి ఆత్మహత్య అనేకంటే ఇచ్ఛామరణం అనడమే సరైనది. ఐపీసీ 309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నం చేసి బతికిన వారిపై కేసులు పెడతారు. ఇప్పుడు ఆ సెక్షన్ రద్దు కోసం భారత లా కమిషన్ సిఫార్సు చేసింది. ఆత్మహత్యాయత్నం నేరం కాదు అని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. అలాంటి వారికి కావాల్సింది సహాయం కానీ శిక్ష కాదు అని స్పష్టం చేసింది. ఆత్మహత్యకు ప్రయతి్నంచడాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 309 సెక్షన్‌ను తొలగించేందుకు పార్లమెంటుకు సిఫార్సు చేసింది. దేశంలో గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. –డాక్టర్ పెద్దిగారి లక్ష్మన్న, సైకాలజిస్టు, కర్నూలు -
కోవిడ్ భయాందోళనలు వద్దు!
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా రెండు నెలల క్రితంఖైరతాబాద్లోని ఆనంద్‌నగర్ ప్రాంతంలో ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగు రోజులుగా తగ్గని జ్వరమే అందుకు కారణం. ఆ జ్వరాన్నే కరోనాగా భావించి తమ వల్ల తమ కుటుంబ సభ్యులకు సోకుతుందేమోననే ఆందోళనతోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ తరువాత కొద్ది రోజులకే ఒక కోవిడ్ పేషెంట్ ఆసుపత్రి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. గాంధీ ఆసుపత్రిలో చేరిన మరో పేషెంట్ చికిత్స పొందుతూనే ఆసుపత్రి నుంచి పారిపోయాడు. ఇదంతా కరోనాకు ఒకవైపు అయితే మరోవైపు కరోనా కల్లోలాన్ని సృష్టించింది. మహమ్మారి నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ కారణంగా లక్షలాది మంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ప్రశాంతంగా బతికిన కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం భయాందోళనలు రేపింది. దీంతో అనేక కుటుంబాలు ఆత్మహత్యా సదృశ్యమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. భార్యాభర్తల మధ్య ఘర్షణలు, గృహహింస, ఆన్లైన్ చదువుల వల్ల పిల్లల్లో పెరిగిన మానసిక వ్యాకులత, ఆందోళన, డిప్రెషన్ వంటి అనేక సమస్యల వల్ల నగరంలో సూసైడల్ టెండెన్సీ అతి పెద్ద సవాల్‌గా మారింది. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా పని చేస్తున్న స్వచ్చంద సంస్థ రోష్ని అంచనాల మేరకు గతంతో పోల్చుకుంటే కరోనా కారణంగా సూసైడల్ టెండెన్సీ 20 శాతం వరకు పెరిగింది. గత మూడు నెలలుగా రోష్ని సహాయ కేంద్రానికి వచ్చిన సుమారు 5000 ఫోన్‌కాల్స్‌లో ఎక్కువ శాతం ఆత్మహత్యా పరిస్థితులకు సంబంధించిన బాధితులవే ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో మానసిక తోడ్పాటును, ఆత్మస్థైర్యాన్ని అందజేసేందుకు అనేక స్వచ్చంద సంస్థలు సైతం ముందుకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా 2003 నుంచి యూఎన్వో పిలుపు మేరకు సెప్టెంబరు 10ని ఆత్మహత్యల నివారణ దినంగా పాటిస్తున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి మొత్తం భూగోళాన్నే కబళించింది. యావత్ ప్రపంచాన్ని అనిశ్చితిలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో ‘ఆత్మహత్యల నివారణకు కలసి పని చేయాలనే’ సమష్టి కర్తవ్యానికి పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. ఆత్మస్థైర్యమే ఆయుధం.. రాము (పేర్ మార్చాం) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కోవిడ్ కారణంతో ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఏర్పడిన తీవ్ర ఆర్థిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యే సమస్యకు పరిష్కారమని భావించాడు. కానీ అదే సమయంలో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న ప్రశాంత్ ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ ఏ మాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కూరగాయల వ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఒక్క ప్రశాంత్ మాత్రమే కాదు. లక్షలాది మంది పూలమ్మిన చోటే కట్టెలమ్ముతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటున్నారు. వైరస్ బారిన పడిన వారిలోనూ చాలా మంది మహమ్మారిని భయాందోళనకు గురికాకుండా వైద్య చికిత్సలు పొందుతూ ధైర్యంగా జయిస్తున్నారు. (కరోనా పాజిటివ్.. తప్పుడు రిపోర్ట్ అనుకుంటా) తీవ్రమైన, భయం ఒత్తిడికి గురయ్యేవారిలోనే మరణాలు చోటుచేసుకుంటున్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ విసిరిన సవాళ్లెన్నో ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడిన ప్రజలు ఆరోగ్య, వృత్తిపరమైన, ఆర్థిక పరమైన ఒత్తిడిలకు లోనవుతున్నారు. ఇలా ఏర్పడిన మానసిక, శారీరక ఒత్తిడుల కారణంగా అటు కోవిడ్ వచ్చిన వారిలో, రాని వారిలోనూ డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా నెలకొన్న ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆత్మస్థైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. మేమున్నామనీ.. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో మానసిక ధైర్యాన్ని, ఓదార్పును అందజేసేందుకు, ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మేమున్నామంటూ అనేక స్వచ్చంద సంస్థలు ముందుకొస్తున్నాయి. సికింద్రాబాద్‌లోని సింధ్కాలనీ కేంద్రంగా పని చేస్తున్న రోష్ని సంస్థ ప్రత్యేక కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారు ఈ కేంద్రాన్ని సంప్రదిస్తే సరైన పరిష్కారం లభిస్తుందని, నిపుణుల ద్వారా అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేయగలమని సంస్థ ప్రతినిధి ఆనంద దివాకర్ తెలిపారు. గత 3 నెలలుగా 5 వేల మందికి పైగా తమ సంస్థను సంప్రదించి పరిష్కారం పొందినట్లు పేర్కొన్నారు. కుటుంబ కలహాలు, ఉపాధి కోల్పోవడం, కోవిడ్ భయంపైనే ఎక్కువ మంది తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అండగా మనో జాగృతి.. సుమారు 200 మంది మానసిక నిపుణులతో ప్రత్యేక నెట్ వర్క్ కలిగిన స్వచ్చంద సంస్థ మనోజాగృతి సైతం కోవిడ్ కారణంగా ఏర్పడిన మానసిక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ప్రారంభించింది. మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు పరిష్కార మార్గాలను సూచిస్తారు. ఉద్యోగాలు, విద్యార్ధులు, గృహిణులు, తదితర వర్గాల సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారించాం. – డాక్టర్ గీత చల్లా, మనోజాగృతి వ్యవస్థాపకులు వివరాలు గోప్యంగా ఉంటాయి ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా రోష్ని సేవలను అందజేస్తోంది. మానసిక నిపుణులు, కౌన్సిలర్లు కచ్చితమైన పరిష్కారాన్ని సూచిస్తారు. ఇప్పటి వరకు అనేక వేల మందిని కాపాడగలిగాం. మా సంస్థను ఆశ్రయించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయి. తమ బాధలను, సమస్యలను నిర్భయంగా చెప్పుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మా కాల్‌సెంటర్ (040–66202000, 040–66202001)ను సంప్రదించవచ్చు. – ఆనంద దివాకర్, రోష్ని -
ఆత్మహత్య చేసుకునే వారిలో ఆ వయస్సు వారే ఎక్కువ!
-
ఆత్మహత్య చేసుకునే వారిలో ఆ వయస్సు వారే ఎక్కువ!
ప్రపంచ వ్యాప్తంగా సగటున ప్రతి సంవత్సరం 10 లక్షల మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వారిలో 15 నుంచి 30 ఏళ్ల వయస్సువారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోన్న విషయం. అయితే వారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి? వాటి గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలంటే వీడియో ఓసారి చూడండి.