ఒత్తిడికి మూలం అనుబంధాల విఛ్చిన్నమే
అసలు సమస్య పంచుకునేవారు లేకపోవడమే
క్షణికావేశాలను మళ్లిస్తే...ఆత్మహత్యలు తగ్గించొచ్చు.. తమ అనుభవాలను వెల్లడించిన వన్‌లైఫ్ వలంటీర్లు..
‘క్షణంలో వెయ్యోవంతు కాలంలో జీవితం పట్ల దృక్పథం మారిస్తే చాలు ఓ జీవితాన్ని నిలబెట్టగలుగుతాం’అంటున్నారు వన్‌లైఫ్ వలంటీర్లు. మానసిక ఒత్తిడి, ఇతరత్రా సమస్యలతో ఆత్మహత్య లాంటి ఆలోచనల నుంచి విముక్తి కల్పించడానికి జాతీయస్థాయిలో 24/7 సేవలు అందిస్తోది వన్‌లైఫ్ సంస్థ. దీని ఆధ్వర్యంలో గత కొంత కాలంగా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన వలంటీర్లు సాక్షితో తమ అనుభవాలు పంచుకున్నారు.
–సాక్షి, హైదరాబాద్
ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించిన వారికి సంబంధించిన సమస్యల విషయంలో మేం పూర్తిగా గోప్యత పాటిస్తాం. కాల్స్ కోసం 24/7 అందుబాటులో ఉంటాం అంటున్న వలంటీర్లు చెప్పిన విశేషాలు వారి మాటల్లోనే...
ఒత్తిడిని చిత్తు చేస్తూ..
ట్రిపుల్ ఐటీ పూర్తి చేశా..చదువుకునే సమయం నుంచీ ఒత్తిడి బాగా ఉండేది. అయితే లోకువగా చూస్తారేమోనని ఎవరికీ చెప్పలేకపోయేవాడ్ని. అదే సమయంలో వన్‌లైఫ్ సంస్థ గురించి తెలిసింది..వీరిని అప్రోచ్ అయ్యి నా ఒత్తిడి పోగొట్టుకోగలిగాను. మరెంతో మందికి పరిష్కారంగా మారాలని వన్‌లైఫ్‌లో వలంటీర్‌గా జాయినయ్యా. మూడేళ్ల నుంచి ప్రతీ శనివారం 4గంటల పాటు వలంటీర్‌గా ఇంటి నుంచే చేస్తున్నా. తొలుత చాలా నెగిటివిటీ వస్తుంటుంది జాగ్రత్త అని ఫ్యామిలీ మెంబర్స్ హెచ్చరించారు. అయితే ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నాకేమీ సమస్య అనిపించలేదు. స్టూడెంట్స్ పరీక్షల టైమ్‌లో ఎక్కువ కాల్స్ రిసీవ్ చేసుకున్నా. అది నేను అనుభవించి వచ్చాను కాబట్టి బాగా కనెక్ట్ అయ్యాను. లవ్ ప్రాబ్లెమ్స్‌తో కూడా వస్తున్నాయి.. ఇతరుల సమస్యలు వినడం వల్ల మన సమస్యలు చిన్నగా అనిపిస్తూంటాయి. అలా ఈ పని నాకు వ్యక్తిగత జీవితంలో సమస్యల పరిష్కారానికి కూడా చాలా హెల్ప్ అయింది.
–సూర్య, మాదాపూర్
నాలో ఉన్న ఖాళీని భర్తీ చేసుకుంటూ...
రిటైర్‌మెంట్ తర్వాత కొంత ఎంప్టీనెస్ అనిపించి ఈ సేవలోకి వచ్చాను. నాకు విభిన్న భాషల్లో పట్టు ఉండడం వల్ల దేశవ్యాప్తంగా కాల్స్ వస్తుంటాయి. రిలేషన్ షిప్స్‌కు సంబంధించినవే ఎక్కువగా వస్తున్నాయి. ‘నేను అమ్మాయిని కాను నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు... నాది అబ్బాయి మనస్తత్వం అని చెప్పలేకపోతు న్నా’అంటూ ఓ అమ్మాయి చేసిన కాల్, అలాగే ఓ అమ్మాయి తనను ప్రేమ పేరుతో డబ్బులు ఖర్చుపెట్టించి వదిలేసిందని, నేనెంతో తెలివిగల వాడ్ని అనుకునేవాడ్ని ఎలా ఇలా మోసపోయానో’అంటూ మరో అబ్బాయి కాల్... ఇలాంటివి కొన్ని గుర్తుండిపోయే సమస్యలు వస్తుంటాయి. వారితో మాట్లాడడం ద్వారా వారిలో కొత్త ఆలోచనలు వచ్చేలా చేయడమే ముఖ్యం తప్ప సలహాలు, సూచనలు ఇవ్వడం చేయం.
–రుక్మిణి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్
అవగాహన పెంచుతున్న సమస్యలు...
హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగినిగా చేస్తున్నా. ఏడాది నుంచి వన్‌లైఫ్‌లో వలంటీర్‌గా రాత్రి 9 నుంచి 11 గంటల సమయంలో కాల్స్ అటెండ్ అవుతుంటా. ఇష్టం వచ్చినట్టు లోన్స్ తీసుకున్నాం కట్టలేకపోతున్నాం లాంటి సమస్యల నుంచివిడాకుల తర్వాత లోన్లీనెస్ ఫేస్ చేయలేకపోతున్నాం దాకా ఎన్నో రకాల సమస్యలతో కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం అయిందేమిటంటే...ప్రాబ్లెమ్‌ని ఇతరులతో షేర్ చేసుకుంటే మమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తారో అని భయంతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఈ వలంటరీ విధుల వల్ల అనేక రకాల సమస్యలపై యుక్త వయసులోనే అవగాహన కలుగుతోంది.
–అనూష, బోయినపల్లి
జీవితం మీద ఆశ చిగురించేలా చేయొచ్చు
విద్యార్థుల్లో అధిక గ్రేడ్స్‌కు సంబంధించిన ఒత్తిడి అంచనాలు, ఇతరులతో పోల్చడం, ర్యాగింగ్. మిగిలిన వారిలో అనుబంధాలు, అంచనాలు, తీర్చలేని డిమాండ్లు, సందేహాలు పరస్పరం నిందించుకోవడం తగాదాలు, వాదనలు, కోపం, ఆందోళన,.ఆర్థిక సంక్షోభాలు, వంటివి ప్రతికూలతకు దారి తీసిన ఫలితంగానే ఆత్మహత్యకు ఆలోచనలు చేస్తారు. అలాంటివారిలో జీవితం పట్ల ఆసక్తి పెంచే ఆలోచనల్ని ప్రోత్సహించడం, సానుకూలతను అందించడం, జీవితం అప్పుడే అయిపోలేదని నొక్కిచెప్పడం తమ కోసం మేం ఒక స్టాండ్ తీసుకోవడానికి ప్రోత్సహించడం చేస్తాం. ఒక్కో కాల్ అత్యధికంగా 45 నిమిషాల పాటు వింటాం. మా దగ్గర సీనియర్ కౌన్సెలర్లు ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఉన్నారు. కాలర్స్ మాటల్ని బట్టి ప్రమాదస్థాయిని అర్థం చేసుకొని, వెంటనే జోక్యం చేసుకొని, 3 నుంచి 4 ఫాలో అప్‌లు, కౌన్సెలింగ్ సెషన్స్ కొనసాగిస్తాం. పదేళ్లుగా మా వన్‌లైఫ్ ద్వారా ఏడాదికి 30 మంది వరకూ ఆత్మహత్య ఆలోచనల నుంచి దారి మళ్లించామని చెప్పగలను. మరింత మందిని వలంటీర్లుగా చేరమని ఆహ్వానిస్తున్నాం. ఈ వలంటీర్ వర్క్ మన ద్వారా మరికొందరికి జీవితం మీద ఆశ చిగురించేలా చేయడంతో పాటు మన జీవితంలోనూ ఎన్నో మంచి మార్పులకు దోహదం చేస్తుందని రచ్చితంగా చెప్పగలను.
–రెబెకామరియా, వన్‌లైఫ్ నిర్వాహకులు
ఆలోచనల నుంచి డైవర్ట్ చేస్తే ఆత్మహత్యలు తగ్గిపోతాయి...
వన్‌లైఫ్‌లో చేరాక మూమెంటరీ థింకింగ్ గురించి అర్థమైంది. ఫోన్ చేసినప్పుడు వారిని కాసేపు డైవర్ట్ చేస్తే చాలు. చాలా వరకూ ఆత్మహత్య ఆలోచనలు సమసిపోతాయి. కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్లనే చాలా వరకూ భారం తగ్గుతుంది. జీవితం చాలా గొప్పదనే విషయం తెలిసేలా చేస్తా తప్ప సలహాలు, సూచనలు ఇవ్వను. తొలుత ఫ్రీగా మాట్లాడలేరు కానీ కాసేపు గడిచాక చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఎవరికీ చెప్పలేని తీవ్రమైన ర్యాగింగ్ సంఘటనల నుంచి, భార్య వెళ్లిపోయింది పిల్లలు లేరు దాకా ఎన్నో.. నేను 15 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేశాను కాబట్టి నాకు ఈ పని కొంచెం సులభంగా మారింది. చేసేవారిలో 90 శాతం మంది కేవలం బాధలను చెప్పుకోవడం కోసమే చేస్తారు. మాట్లాడుతుండగానే వారి స్కిల్స్ గుర్తించి వాటిని వారికి గుర్తు చేస్తా.
–వెంకటరమణి
Comments
Please login to add a commentAdd a comment