సాక్షి హైదరాబాద్: ‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’ అనే కాన్సెప్ట్ కాదు వీళ్లది. సమాజానికి తమ వంతు సహాయం, బాధ్యతగా వ్యవహరించాలనుకునే గుణం! కార్యాలయాలు, విద్యా సంస్థల పునఃప్రారంభంతో సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవటంతో నియంత్రణ, క్రమబద్దీకరణలో వీళ్లూ భాగస్వామ్యులవుతున్నారు. వారే ట్రాఫిక్ పోలీసులతో సమానంగా రోడ్ల మీద విధులు నిర్వరిస్తున్న ట్రాఫిక్ వలంటీర్లు!
ఉద్యోగులు, గృహిణులు, నిరుద్యోగులు గత తొమ్మిదేళ్లుగా సైబరాబాద్ పరిధిలో మేము సైతం అంటూ ట్రాఫిక్ సేవ చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఉత్త మ ప్రతిభ కనబర్చిన ట్రాఫిక్ వలంటీర్లను బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణా యెదుల తదితరులు పాల్గొన్నారు.
2013 నుంచి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 4,500 మంది ట్రాఫిక్ వలంటీర్లు సేవలందిస్తున్నారు. వలంటీర్లుగా సేవలు అందించాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్లు ఏడీఎట్‌దిరేట్‌ఎస్‌సీఎస్‌సీ.ఇన్ కు మెయిల్ లేదా 9177283831 నంబరులో సంప్రదించాలి.
వలంటీర్లు ఏం చేస్తారంటే...
తొలుత సాధారణ ట్రాఫిక్ సమయంలో మాత్రమే ట్రాఫిక్ పోలీసులకు వలంటీర్లు మద్దతు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వారాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ (డీడీ), ట్రాఫిక్ ఉల్లంఘనదారులను గుర్తించి చలాన్లు జారీ చేయించడం, రోడ్డు ప్రమాదాలలో బాధితులను ఆసుపత్రికి చేర్చడంలో వంటి వాటిల్లో కూడా సహాయం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో ఈ ట్రాఫిక్ వలంటీర్లు 5,500 గంటలు పని చేశారు. 8,200 ట్రాఫిక్ ఉల్లంఘనదారులను గుర్తించారు. వీరిలో 6,100 మంది వాహనదారులకు చలాన్లు జారీ అయ్యాయి. (క్లిక్ చేయండి: మెట్రో స్టేషన్‌లో బ్యాగులు తారుమారు.. ట్వీట్ చేయడంతో..)
ఒత్తిడి తగ్గుతుంది
అన్ని వర్గాల ప్రజల నుంచి ట్రాఫిక్ వలంటీర్లకు ఆసక్తిగా కనబర్చటం హర్షణీయం. కొన్ని ఐటీ కంపెనీలైతే వారి సెక్యూరిటీ గార్డులను వలంటీర్లగా నియమిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల రాకపోకల సమయంలో వాళ్లే ఆయా మార్గంలోని ట్రాఫిక్‌ను నియంత్రించుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులపై పని ఒత్తిడి తగ్గుతుంది.
– టీ.శ్రీనివాస రావు, డీసీపీ, ట్రాఫిక్ సైబరాబాద్
Comments
Please login to add a commentAdd a comment