సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు తప్ప మిగితా వాహనాలకు డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి1 ఉదయం 5గంటల వరకు నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్ రూట్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు.
ఇక రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు.. సైబర్ టవర్స్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్లు(1, 2), మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-జేఎన్‌టీయూ ఫ్లైఓవర్, రోడ్డు నెం. 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు వంతెన, బాబూ జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ (బాలానగర్) మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
డిసెంబర్ 31న విధుల్లో ఉండే క్యాబ్, ఆటో డ్రైవర్లకు పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్, ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు విధుల్లో యూనిఫామ్‌లో ఉండి అన్ని వాహన డాక్యుమెంట్లు కలిగి ఉండాలన్నారు. క్యాబ్ డ్రైవర్లు రైడ్‌కు అనుమతి నిరాకరిస్తే ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ప్రజలు ఫిర్యాదు చేస్తే క్యాబ్ ఆటో ఓనర్లపై మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 178 కింద రూ.500 పెనాల్టీ విధిస్తామని చెప్పారు. పబ్లిక్ వద్ద అధిక డబ్బు డిమాండ్ చేస్తూ మిస్‌బిహేవ్ చేయవద్దని అన్నారు.
పబ్‌లో తాగి బయటకి వెళ్లే కస్టమర్ తాగి వాహనం నడపకుండా పబ్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. అడుగడుగున డ్రంకన్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సరైన ధ్రువపత్రాలు సమర్పించకపోతే వాహనాలు జప్తు కూడా చేస్తామని తెలిపారు. మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వాహనం నడిపితే డ్రైవర్, వాహన యజమాని ఇద్దరు జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.
వాహన నంబర్ ప్లేటులు లేకుండా, వాహనంలో అధిక శబ్ధాలతో ప్రయాణిస్తే బండి సీజ్ చేస్తామన్నారు. వాహనాల్లో అధిక జనాభా, వాహనం మీద కూర్చోని ప్రయాణించడం, పబ్లిక్ స్థలంలో న్యూసెన్స్ క్రియేట్ చేయడం వంటివాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తాగి వాహనం నడిపితే మొదటిసారి దొరికితే రూ.10వేల జరిమాన లేదా ఆరు నెలల జైలు శిక్ష, రెండో సారి పట్టుబడితే రూ.15 ఫైన్ లేదా రెండేళ్ల జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment