అంతరించిపోయేలా ఉన్నాం.. మమ్మల్ని కాపాడండయ్యా!
World Wildlife Day Special: ‘‘మా బతుకు మేం బతుకుతున్నాం. మా సరిహద్దుల్లోకి వచ్చేది మీరు. అనవసరంగా మమ్మల్ని బలిగొనేదీ మీరే. మా కుటుంబం ప్రకోపాన్ని చూపిస్తే తట్టుకోగలరా మీరు?. కానీ, అలా చేయం. ఎందుకంటే.. మాకంటూ అడవి ధర్మం ఉంది. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. అంతరించిపోతున్న మా జాతుల్ని వీలైతే పరిరక్షించి పుణ్యం మూటగట్టుకోండి’’ మూగ జీవాలకు మాటొస్తే.. కచ్చితంగా మనుషులతో ఇలాగే మొరపెట్టుకుంటాయేమో.
భూమ్మీద వృక్షజాలం, జంతుజాలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదే. ఆ బాధ్యతను గుర్తు చేసేందుకే ఒక రోజు ఉంది. ఇవాళ(మార్చి 3వ తేదీ) వరల్డ్ వైల్డ్‌లైఫ్ డే. వైల్డ్‌లైఫ్ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా అవగాహన కల్పించే రోజు. అంతేకాదు అందమైన వాటి ప్రపంచం గురించి ప్రస్తావించుకునే రోజు కూడా. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వనజీవుల సంరక్షణ కోసం చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో కొత్తగా అర్టిషిషియల్ టెక్నాలజీ (AI) ద్వారా అంతరించిపోతున్న దశలో ఉన్న జంతువుల్ని గుర్తించడం, తద్వారా వాటి పరిరక్షణకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని భావిస్తున్నారు.
1973లో సైట్స్ (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora) ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఆ తేదీని World Wildlife Dayగా పరిగణించాలని డిసెంబర్ 20, 2013లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తీర్మానించింది.
వైల్డ్‌లైఫ్ డే సందర్భంలో మన గడ్డ మీద ఉండి.. అంతరించిపోయే దశకు చేరుకున్న ఆరు జాతుల గురించి చర్చించుకుందాం.
ఏషియాటిక్ లయన్
ప్రపంచంలోనే అతిపెద్ద రెండో జాతి ఇది. రాజసం ఉట్టిపడే సింహాలకు.. గుజరాత్ ‘గిర్’ శాంక్చురీ దీనికి అడ్డా. కానీ, చాలా ఏళ్ల కిందట భారత్‌లోని ఉత్తర, మధ్య తూర్పు ప్రాంతాల్లోనూ వీటి సంఖ్య ఎక్కువగా ఉం డేది. అంతరించిపోతున్న క్రమంలో వీటి పరిరక్షణకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
నీలగిరి మార్టెన్
దక్షిణ భారత దేశంలో.. అందునా నీలగిరి కొండల్లో కనిపించే అరుదైన మార్టెన్ జాతి ఇది. తమిళనాడు, అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. కేరళ నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనూ వీటి పరిరక్షణకు కృషి చేస్తున్నారు. వీటి సంఖ్య వెయ్యి లోపే ఉంది. అందుకే ఐయూసీఎన్ (International Union for Conservation of Nature) ఈ జాతిని రెడ్ లిస్ట్‌లో చేర్చింది.
మంచు చిరుత
ఔన్స్ అని ముద్దుగా పిల్చుకునే ఈ జాతి.. అరుదైన జీవుల్లో ఒకటి. అరుణాచల్ ప్రదేశ్ దిబాంగ్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో, హిమాచల్ ప్రదేశ్ హిమాలయన్ నేషనల్ పార్క్‌లో, ఉత్తరాఖండ్ నందా దేవి నేషనల్ పార్క్‌లో ఇవి కనిపిస్తాయి. శరవేగంగా వీటి జనాభా క్షీణించి పోగా.. ప్రస్తుతం మొత్తంగా పది వేల లోపే మంచు చిరుతలు ఉంటాయని అధికారులు లెక్కలు వేశారు.
సంగై
అనిమిలీయా కుటుంబంలోని దుప్పి జాతి సంగై (Brow-antlered Deer). మణిపూర్ లోక్టక్ సరస్సును ఆనుకుని ఉన్న కెయిబుల్ లామ్జావో నేషనల్ పార్క్‌లో ఇవి కనిపిస్తాయి. ఇక్కడో ప్రత్యేకత ఏంటంటే.. సంగై ఆ రాష్ట్ర జంతువు. డ్యాన్సింగ్ డీర్ పేరుతో వీటి మీద జానపద కథలు సైతం ప్రచారంలో ఉన్నాయి.
సింహపు తోక మకాక్
వాండెరూ.. సింహపు తోక మకాక్(కోతులు). ప్రపంచంలోనే అతి పురాతనమైన, అరుదైన జాతిగా వీటిని చెప్తుంటారు రీసెర్చర్లు. కేరళ షెండూర్నీ వైల్డ్‌లైఫ్ శాంక్చురీలో ఇవి కనిపిస్తాయి.
ఒంటికొమ్ము రైనో
వేట, కొమ్ముల అక్రమ రవాణాతో క్షీణించే దశకు చేరుకున్న జాతి ఇది. కజిరంగ నేషనల్ పార్క్ (అస్సాం), దుద్వా టైగర్ రిజర్వ్(యూపీ), పోబిటోరా వైల్డ్‌లైఫ్ శాంక్చురీ(అస్సాం)లో మాత్రమే ఇవి కనిపిస్తాయి.
పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను రక్షించడం అనే థీమ్‌తో ఈ ఏడాది వరల్డ్ వైల్డ్‌లైఫ్ డేని నిర్వహిస్తున్నారు.
There are over 22,000 endangered & critically endangered species on the IUCN Red List. Continued species loss is a threat to people and planet. For #WWD2022, let us all support conservation of vulnerable plants and animals. Learn more: https://t.co/hW7VtdeXHK #RecoverKeySpecies pic.twitter.com/AtjMmtVCio
— World Wildlife Day (@WildlifeDay) February 22, 2022
పరుగు, పుట్రా, మొక్కలే కాదు.. పరిమాణంలో పెద్ద జంతువులు సైతం మనిషి నిర్లక్ష్యానికి బలై అంతరించే దశకు చేరుకోగా.. ఇప్పటికే కొన్ని అంతరించిపోయాయి కూడా.
-సాక్షి, వెబ్ స్పెషల్