వాల్ డిస్నీ మూవీలో షకీరా హల్చల్
లాస్ ఎంజెల్స్: వాకా వాకా . లా..లా..లా..పాటలతో ఫుట్ బాల్ ప్రేమికులతోపాటు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించిన పాప్ సింగర్ షకీరా ఇపుడు మరో సంచలనానికి నాంది పలికింది. వాల్ డిస్నీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న యానిమేషన్ సినిమా 'జూటోపియా'లో ఓ పాత్రకు తన గొంతును అరువివ్వబోతోంది. తన అద్భుతమైన గొంతుతో గ్రామీ అవార్డును కూడా సొంతం చేసుకున్న షకీరా.. తన అందం, మేనరిజమ్సే ఈ క్యారెక్టర్‌కు స్పూర్తి అట. ఈ అమ్మడి లాగానే చాలా సెక్సీగా, క్యూట్ గా రూపొందుతోంది గాజిల్లే అనే జింక పాత్ర . ఈ జింక పాత్రకే(గాజిల్లే) ఆపాప్ సింగర్ డబ్బింగ్ చెప్పనుంది.
గాజిల్లే ఫస్ట్ లుక్‌ను వాల్ డిస్నీ స్టూడియో రిలీజ్ చేసింది. అనాహీం కన్వెన్షన్ సెంటర్లో ఒక వీడియోను శుక్రవారం రిలీజ్ చేసింది. ఈ యానిమేషన్ చిత్రంలోని జంతువుల పాత్రలు అచ్చం మనుషుల్లానే మాట్లాడుకుంటాయట. దీంతోపాటు ఈ సినిమాకోసం ట్రై ఎవ్రీథింగ్ అనే పాటను కూడా పాడనుందట షకీరా. కాగా 2016 మార్చిలో ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.