పూరి తీరంలో ప్రపంచంలో అతిపెద్ద జీసస్ విగ్రహం
ఒడిశాకు చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో అద్భుతం సృష్టించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జీసస్ ప్రతిమను రూపొందించారు. పూరి తీరంలో 35x75 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకోసం వెయ్యి టన్నుల రంగుల మిశ్రమంతో కూడిన ఇసుకను వాడారు. పట్నాయక్ 25 మంది శిష్యులతో కలసి మూడు రోజుల్లో తయారు చేశారు. జీసస్ తో పాటు మేరీ మాత, శాంతా క్లాజ్ తో కూడిన విగ్రహం అందర్నీ ఆకర్షిస్తోంది.
ఈ నెల 24 నుంచి జనవరి 1 వరకు జీసస్ ప్రతిమను భక్తుల సందర్శనార్థం ప్రదర్శించనున్నారు. జీసస్ విగ్రహాన్ని సందర్శించేందుకు క్రైస్తవ సోదరులు అమితాసక్తి చూపుతున్నారు. పట్నాయక్ ఇంతకుముందే ఏడు ప్రపంచ రికార్డులు సృష్టించారు. తాజాగా అతిపెద్ద జీసస్ విగ్రహాన్ని గుర్తిస్తున్నట్టుగా లిమ్కా బుక్ రికార్డుల నిర్వాహకుల నుంచి ఆయనకు లేఖ అందింది.