చిన్నారికి ఎక్కించిన సెలైన్లో పురుగులు
రోగాన్ని నయం చేసుకునేందుకు హాస్పిటల్ కు వెళ్తే కొత్త రోగాలు తెచ్చుకునే పరిస్థితి ప్రభుత్వాసుపత్రుల్లో నెలకొంది. తాజాగా జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. జనగాం జిల్లా కొనకళ్ల మండలం, మైదం చెరువు తండాకు చెందిన బిక్షపతి, సుమలత దంపతులకు ఆరేళ్ల కుమార్తె సాయి ప్రవళిక ఉంది. చిన్నారికి ఇటీవల నీరసంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రుల్లో చూపించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నిన్న(బుధవారం) గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు చిన్నారిని పరీక్షించి ప్లూయిడ్స్ ఎక్కించారు.
కానీ, చిన్నారికి ఎక్కించిన సెలైన్లో పురుగులు ఉన్నాయి. అది పెట్టిన కాసేపటికే ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టమవ్వడంతో తల్లిదండ్రులు గమనించారు. వెంటనే తాను వైద్యుల దృష్టికి తీసుకెళ్లానని చిన్నారి తండ్రి చెప్పాడు. ఈ విషయాన్ని మీడియాకు తెలపడంపై వైద్యులు తల్లిదండ్రులపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై మాట్లాడటానికి గాంధీ ఆసుపత్రి సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఈ ఘటనపై వైద్యులు విచారణ జరుపుతున్నారు.