ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: వీడియో కాన్ఫరెన్స్‌కు అంతరాయం కలగడంతో జార్ఖండ్‌లోని ఓ ట్రయల్ కోర్టు కేసు విచారణను వాట్సాప్ కాల్ ద్వారా నిర్వహించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసుల విచారణను జోక్ అనుకుంటున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. జార్ఖండ్ మాజీ మంత్రి యోగేంద్ర సావో, ఆయన భార్య నిర్మలా దేవీలపై 2016లో జార్ఖండ్‌లో అల్లర్లు రెచ్చగొట్టినట్లు కేసు నమోదయింది. ఈ కేసులో హజారీబాగ్ ట్రయల్ కోర్టు జడ్జి నిందితుల్ని భోపాల్ కోర్టులో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు.
ఇంటర్నెట్ సమస్య తో వీడియో కాన్ఫరెన్స్‌కు అంతరాయం కలగడంతో వాట్సాప్ కాల్ ద్వారా విచారణ చేపట్టి నిందితులపై అభియోగాలు నమోదుచేశారు. దీన్ని సవాలు చేస్తూ సావో, నిర్మల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎస్ బాబ్డే, జస్టిస్ ఎల్ఎన్ రావుల ధర్మాసనం స్పందిస్తూ..‘అసలు జార్ఖండ్‌లో ఏం జరుగుతోంది? ఇలాంటి పద్ధతులను అనుమతించకూడదు. ఇదేం రకమైన విచారణ? అని జార్ఖండ్ ప్రభుత్వ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.