అన్యాయంగా ఆపేశారు
♦ న్యాయంగా రూ.25 లక్షలు చెల్లించండి
♦ 15 ఏళ్ల తర్వాత రెజ్లర్ సతీశ్‌కు అనుకూలంగా ఢిల్లీ కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: ప్రతిభావంతుడైన రెజ్లర్ జీవితంతో ఆడుకున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై ఢిల్లీ కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రెజ్లర్ సతీశ్ కుమార్‌కు పరిహారంగా రూ. 25 లక్షలు చెల్లించాలని డబ్ల్యూఎఫ్ఐని ఆదేశించింది. తీర్పు ఆలస్యమైనా... న్యాయం మాత్రం లభించింది. 2002లో జరిగిన ఉదంతంపై 15 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. 2002లో బుసాన్ (దక్షిణ కొరియా)లో జరిగిన ఆసియా క్రీడలకు సతీశ్ (పంజాబ్) పయనమయ్యాడు. అయితే అదే పేరుతో ఉన్న పశ్చిమ బెంగాల్ రెజ్లర్ డోపీగా తేలడంతో పంజాబ్ రెజ్లర్ సతీశ్‌ను ఎయిర్‌పోర్ట్‌లో నిలిపేశారు.
ఎన్నో కలలతో బరిలోకి దిగాలనుకున్న సతీశ్ తను డోపీ కాదని నెత్తి, నోరు మొత్తుకున్న డబ్ల్యూఎఫ్ఐ అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో బుసాన్‌కు అతను వెళ్లలేకపోయాడు. తను పడిన మానసిక వేదనపై సతీష్ న్యాయపోరాటం చేశాడు. మరోవైపు అతను కామన్వెల్త్ చాంపియన్‌షిప్, ప్రపంచ పోలీస్ గేమ్స్‌లో పతకాలు గెలుపొందాడు. సుదీర్ఘ విచారణ అనంతరం ఢిల్లీ కోర్టు రెజ్లింగ్ సమాఖ్య అధికారులు ‘కళ్లు తెరిచి పడుకున్నారు’ అని తీవ్రస్థాయిలో మండిపడింది. దీనికి కారణమైన ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టొద్దని, అందరిపై .కేసు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవిష్యత్తులో మరే క్రీడాకారుడు ఇలా అన్యాయానికి గురికాకుండా చూడాలని కేంద్ర క్రీడాశాఖను ఆదేశించింది.