బీజింగ్ గేమ్స్ తర్వాత వైదొలగమన్నారు: సుశీల్
న్యూఢిల్లీ: భారత్ నుంచి వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రెజ్లర్ సుశీల్ కుమార్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తొలిసారిగా తను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన అనంతరం కెరీర్ నుంచి తప్పుకోవాలని కొంతమంది సలహాలిచ్చారని తెలిపాడు. ‘మై ఒలింపిక్ జర్నీ’ అనే పుస్తకంలో సుశీల్ ఈ విషయాన్ని తెలిపాడు. అయితే ఈ పతకం తన కెరీర్‌కు ఆరంభంగానే భావించానని అన్నాడు.
‘బీజింగ్ గేమ్స్ అనంతరం నేను స్వదేశానికి రాగానే నా శ్రేయోభిలాషులు ఇక కెరీర్‌కు ముగింపు పలికితే బావుంటుందని చెప్పారు. నాకు కూడా ఆ సమయంలో ఏమీ అర్థం కాలేదు. అయితే ఇన్నేళ్ల కాలంలో ఒలింపిక్ విజేతకు గల అర్థమేమిటో తెలిసింది. ఆ పత కం సాధించిన అనంతరం రెజ్లింగ్‌పై మరింత అవగాహన పెంచుకున్నాను. అందుకే అది ఆరంభమే కానీ ముగింపు కాదని భావించాను’ అని సుశీల్ పేర్కొన్నాడు.