తొలి రౌండ్లోనే యోగేశ్వర్ అవుట్
రియో డి జనీరో: ఒలింపిక్స్‌లో భారత్ చివరి ఆశగా భావించిన రెజ్లర్ యోగేశ్వర్ దత్ 65కేజీ ఫ్రీస్టయిల్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్లోనే వెనుదిరిగాడు. ఆదివారం జరిగిన బౌట్లో తను 0-3 తేడాతో మండక్‌నరన్ గన్‌జోరిగ్ (మంగోలియా) చేతిలో చిత్తుగా ఓడాడు. 2012 లండన్ గేమ్స్‌లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ తన చివరి గేమ్స్‌ను పతకంతో ముగిస్తాడని అంతా అనుకున్నా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు గన్‌జోరిగ్ క్వార్టర్స్‌లో ఓడిపోవడంతో అటు రెప్‌చేజ్ అడే అవకాశం కూడా పోయింది.
పురుషుల మారథాన్‌లో పాల్గొన్న థనక్కల్ గోపి, ఖేతా రామ్ వరుసగా 25, 26వ స్థానాల్లో నిలిచారు. గోపి 2:15:25 సెకన్ల టైమింగ్‌తో లక్ష్యాన్ని చేరుకోగా ఖేతారామ్ 2:15:26సెకన్లలో చేరుకున్నాడు. మరో భారత అథ్లెట్ నితేంద్ర సింగ్ (2:22:52) 84వ స్థానంలో నిలిచాడు.