పులితోలు వలువాయె...
పాట నాతో మాట్లాడుతుంది
నా ఎదురుగా ఓ సౌందర్యవతి. ‘అలంకారాల ఘలంఘలలతో విశేష విశేషణాలతో అలరిస్తున్న శ్రీనాథుని పద్య సుందరి లాగున్నావు ఎవరివమ్మా తల్లీ’’ అన్నాను. చేవ కలిగిన చేమకూర వేంకటకవి యంతటి ‘సినీ చేమకూర వేటూరి సుందరరామమూర్తి నా తండ్రి. నేను ‘భక్త కన్నప్ప’లో ‘కిరాతార్జునీయ గేయ’ కన్యకను.’ భక్త కన్నప్ప... సంగీతం - సత్యం, దర్శకులు - బాపు. చెప్పేదేముంది.
రచన ముళ్లపూడి రమణ. బాపు-రమణలు వేటూరిగారికి కిరాతార్జునీయం ఘట్టం చెప్పగానే వేటూరి ‘అసాధారణ ధారణాధురీణుడు కదా’ వెంటనే శ్రీనాథుని హరవిలాసంలోని ఏడవ ఆశ్వాసంలో కిరాతార్జునీయం అటు నుంచి ఇటు - ఇటు నుండి అటు ఒక్కసారి సాక్షాత్కరించింది. ఇంక ఏ ఆధారం లేకుండా గాలి నుండి గాంధర్వ గీతాలను సృజించగలిగే వేటూరిలోని కవి పెదవులపై సాధికారికత చిరునవ్వు మెరిసింది. గీతానికి తెర లేపుతూ -
తకిట తకతక తకిట చరిత పదయుగళ - మొదలైంది. పాట. మూలంలోని పద్యంలో ఏది ముట్టుకోవాలో దేన్ని వదులుకోవాలో వేటూరి కనుచూపు కొసలకు పెనుపాళి కొసలకు తెలిసిన విద్వత్తో శంకరుడు ఎరుకలవానిగా మారుతున్నాడు. వేటూరి పెనుచూపు శంకరుని తలను ఒక్కసారే నిశితంగా గుర్తు తెచ్చుకుంది. ‘తలపై నెలవంక’ను శ్రీనాథుని ‘వికట పాటల జటా మకుటికాభారంబు కరుకైన జుంజురునెరులు కాగ’
జుట్టు గురించి ఎందుకులే వదిలేశాడు ‘జారు సుధాధామ శకలావతంసంబు పెడకొప్పు పైనుండు పీకె కాగ’ - శ్రీనాథుడు నెలవంకను చుట్టపీకెలా మారిందన్నది వేటూరికి నచ్చలే. సినిమా కన్ను - సినిమా పెన్ను - అందం - ఆనందం పరమావధి అనుకుంటుంది. ‘నెలవంక తలపాగ నెమలి ఈకెగ మారె’ వేటూరి సీతకు రమణ - బాపులిద్దరు శెభాషనుకున్నారు.
శ్రీనాథుడు వదిలిన ‘గంగ’ను వేటూరి అందుకున్నాడు పాటలో తన ముద్ర వేయాలని ‘తలపైన గంగమ్మ తలపులోనికి జారె ‘ఘనలలాటంబున గను పట్టు కనుచిచ్చు గైరిక ద్రవతిలకంబుగాగ’... ఇది తప్పనిసరి అనుకుని ‘నిప్పులు మిసే కన్ను నిదరోయి బొట్టాయె’ శ్రీనాథుడు వదిలిన బూదిని - పులితోలును ‘బూదిపూతకు మారు పులితోలు వలువాయె’ అంటూ ఎరుకలవానికి ఆహార్యం ధరింపజేశాడు.
శ్రీనాథుడు పాములను పూసల సరులుగా మార్చిన పాదాలను వలదని శ్రీనాథుడు రాసిన శంకరుండు కిరాత వేషంబు దాల్చి యగజ చెంచెతయై తోడనరుగుదేరును వాక్యాలను.
‘ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా... తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా’ మార్చాడు.
శ్రీనాథుని ‘బాణినోంకార దివ్యచాపము ధరించి వచ్చె వివ్వచ్చు వరతపోవనము కడకు’లో ‘త్రిశూలం’ లేదని గ్రహించి ‘ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము’ అంటూ త్రిశూలాన్ని శ్రీనాథుని ఓంకార ధనువుగా కూర్చాడు వేటూరి - కవి కన్ను జల్లెడైన వడపోతలో త్రిశూలం దొరికింది వేటూరికి.
శ్రీనాథుని మూలంలోని ‘తాటియంత విల్లు ధరియించినాడవు - తాడి ఎత్తు గాండీవముతో ముత్తాడి ఎత్తుగా’ ఆనాటి కవులకు ఎత్తు అయితే తాటిచెట్టు లేదా హిమాలయం. అలా కిరాతార్జునీయ ఘట్టాన్ని సినీగీతాల చరిత్రలో హిమాలయం ఎత్తులో నిలిపిన వేటూరికి కొందరు నిర్మాతల - దర్శకుల - కథానాయకుల సంగీత దర్శకుల కొల‘తల’ మేరకు - కురచగా అపసవ్య సాచిగా పదాలతో ‘నాటు కొట్టడమూ’ తెల్సు.
ఏమైనా సినీ కవులకు ఏం తెలుసు? శ్రీనాథ పద్యం అని వెటకారించే మలపరాయుల కనుల నలక మకిలి - కెలికి తీసేలా. వెలికి తీసేలా రచించిన ఈ గీతం మీ సినీగీత రచయితలందరికీ గర్వంగా హత్తుకోదగిన సగర్వంగా తలనెత్తుకోదగిన సినీమణి మకుట గీతం అంటూ వేటూరి పాట వేవేల గీతమ్మల ముద్దూ నా రాముడే - ముద్దు సుందర రాముడేనంటూ కొమ్మ కొమ్మకో సన్నాయిగా మారిపోయింది.
- డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత