ముస్తఫా రచనల నిండా మానవతా పరిమళాలే
కడప కల్చరల్ :
డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా రచనలన్నీ మానవత్వపు పరిమళాలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాయని ప్రముఖ రచయిత, అనువాదకులు కొమ్మిశెట్టి మోహన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా జీవితం–సాహిత్యం అనే అంశంపై ఆయన మాట్లాడారు. ముస్తఫా రచనలన్నీ వెలుగుల రవ్వలేనని, సమాజంలోని విలువల పట్ల ఆయన కాంక్ష, స్పందన ఆ రచనల్లో ప్రతిఫలిస్తున్నాయని తెలిపారు. ఉత్తమ సమాజం కోసం ఆయన రచనలు సాగాయన్నారు. రాజకీయాల పట్ల ఆయన నిరసన కవిత్వంలోని వ్యంగం ద్వారా అర్థమవుతోందని, గోవును గ్రామంతో, పులిని పట్నంతో పోల్చడం ఎంతో పదునుగా ఉందన్నారు.
సీమ వాసి గనుక ఈ ప్రాంత కడగండ్లను కవితా వస్తువుగా స్వీకరించడం విశేషమన్నారు. రచనలన్నీ దేనికవే గొప్పవిగా చెప్పవచ్చన్నారు. ఇంతటి ప్రతిభావంతుడైన ముస్తఫా నిగర్వి, సంయమనశీలి, జ్ఞాని అని, ఆయనతో మాట్లాడితే పుస్తకంతో మాట్లాడినట్లు ఉంటుందని అభివర్ణించారు. దశాబ్దాల క్రితం ఆయన ఈ ప్రాంత రైతుల ఆత్మహత్యల పట్ల ఆవేదనను రచనల్లో వివరించారన్నారు. ప్రక్రియ ఏదైనా మూల వస్తువు మానవత్వమేనని వివరించారు. పలు పత్రికల్లో వచ్చిన ఆయన వ్యాసాలు రాష్ట్రంలోని మేధావుల ప్రశంసలు కూడా అందుకున్నాయన్నారు. ఈ సందర్భంగా బ్రౌన్ గ్రంథాలయ బాధ్యులు డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి ముస్తఫా రచనలను విశేషంగా ప్రశంసించారు. బ్రౌన్ గ్రంథాలయం పక్షాన వక్తతోపాటు రచయిత ముస్తఫాను కూడా నిర్వాహకులు, డాక్టర్ జానమద్ది సాహిత్య పీఠం అధ్యక్షుడు జానమద్ది విజయభాస్కర్ సత్కరించారు.