writters
-
Nobel Prize: నార్వే రచయితకు సాహిత్యంలో నోబెల్
స్టాక్‌హోం: ప్రపంచలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. తాజాగా సాహిత్యం కేటగిరిలో 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ప్రకటించారు. కాగా, 2023 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతిని గురువారం ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్ వరించింది. ఇక, ఇప్పటికే రసాయన శాస్త్రం, భౌతిక, వైద్య రంగాల్లో నోబెల్ అవార్డులను ప్రకటించారు. తాజాగా సాహిత్యంలో నోబెల్ ప్రకటించారు. శాంతి కేటగిరిలో ప్రకటించాల్సి ఉంది. The 2023 Nobel Prize in Literature is awarded to the Norwegian author Jon Fosse “for his innovative plays and prose which give voice to the unsayable". (Pic: The Nobel Prize) pic.twitter.com/RI2jThwOYV — ANI (@ANI) October 5, 2023 -
ట్రంప్‌కు బిగ్ షాక్.. రేప్ చేశాడంటూ రచయిత్రి సంచలన వ్యాఖ్యలు!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనే అవుతుంది. కాగా, ట్రంప్‌పై ఓ రచయిత్రి.. లైంగిక దాడి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ట్రంప్‌పై రేప్ కేసు నమోదు చేసేందుకు రచయిత్రి జీన్ కారోల్ సిద్దమైంది. వివరాల ప్రకారం.. రచయిత్రి ఈ. జీన్ కారోల్ 1996లో బెర్గడోర్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్‌లో పనిచేస్తున్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ లైంగిక దాడి చేసిన కారణంగా తాను మానసిక క్షోభను అనుభవించానని.. అందుకే కోర్టులో దావా వేయాలని భావిస్తున్నట్లు బాధితురాలు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆమె తరఫు న్యాయవాది రాబర్టా కప్లాన్.. నవంబర్ 24న ట్రంప్‌పై దావా వేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, కారోల్ ఆరోపణలపై మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ స్సందించారు. కారోల్ రాసిన పుస్తకాన్ని విక్రయించడానికి తనపై ఇలాంటి తప్పుడు కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. -
కథా రచయిత ‘శ్రీవిరించి‘ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై: శ్రీ విరించి అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన ప్రముఖ కథా రచయిత డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రామానుజాచారి (87) బుధవారం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఉదయం 11 గంటలకు రామానుజాచారి తుది శ్వాస విడిచారని ఆయన సోదరుడు, ఆకాశవాణి విశ్రాంత డైరెక్టర్ నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్య తెలిపారు. ఆయన అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శ్రీవిరించికి ఒక కుమార్తె ఉన్నారు. రామానుజాచారి 1935లో విజయవాడలో జన్మించారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ, పారిశ్రామిక వాణిజ్య చట్టాలలో బీఎల్‌తో పాటు డాక్టరేట్ కూడా చేశారు. తులనాత్మక తత్వశాస్త్రంలోనూ పట్టభద్రులు. థియోసాఫికల్ సొసైటీలో సేవలు రామానుజాచారి 1958 నుంచి థియోసాఫికల్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. అడయార్‌లోని సంస్థ ప్రపంచ ప్రధాన కార్యాలయంలో అనేక హోదాలలో బాధ్యతలు నిర్వర్తించారు. 1951లో తెలుగులో ఆయన చేసిన తొలి రచన ఒక వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత తెలుగు, ఇంగ్లిష్‌లో అనేక కథలు రాశారు. తెలుగులో 100, ఇంగ్లి‹Ùలో 50కిపైగా విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. వందలాది గ్రంథ సమీక్షలు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీకి, నేషనల్ బుక్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు అనువాదకులు. మధ్యమావతి, కొత్తనక్షత్రం (1982), అర్థం, కారని కన్నీరు, మెట్లులేని నిచ్చెన (1995), కనకపు గట్టు (1997); గంధపు చుక్క (2000) వంటి పలు కథా సంపుటాలు వెలువరించారు. ఇంగ్లిష్‌లో అవేకనింగ్ టూ ట్రూత్, సీక్రెట్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, ద ట్రూ పాత్ ఆఫ్ థియోసాఫీ, వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ తదితర రచనలు చేశారు. సముద్ర శిఖర్ అనే హిందీ రచన కూడా చేశారు. తెలుగు యూనివర్శిటీ అవార్డు, డాక్టర్ దాశరథి రంగాచార్య, శ్రీమతి కమలా సాహిత్య పురస్కారం (2004) వంటి పలు పురస్కారాలను అందుకున్నారు . శ్రీవిరించి మరణం సాహితీలోకానికి తీరనిలోటని మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు విభాగం పూర్వాధిపతి మాడభూషి సంపత్‌కుమార్ పేర్కొన్నారు. కథాశిల్పం విషయంలో ఆయనది ప్రత్యేకమైన శైలి అని, తెలుగు కథా ప్రపంచం ఓ గొప్ప రచయితను కోల్పోయిందంటూ నివాళులర్పించారు. -
మరాఠీలో మాట్లాడలేదని 20 గంటలు నిరసన
ముంబై: మరాఠీ మాట్లాడని ఓ జ్యువెలరీ షాపు యజమానికి వ్యతిరేకంగా ప్రముఖ మరాఠీ రచయిత శోభా దేశ్‌పాండే ఆందోళన నిర్వహించారు. ఆమెకు సంఘీభావంగా రంగంలోకి దిగిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ఆ షాపు యజమాని క్షమాపణ చెప్పించేలా చేశారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. రచయిత శోభా దేశ్‌పాండే గురువారం మధ్యాహ్నం కొలాబాలోని మహావీర్ జ్యువెలరీ షాప్‌కి వెళ్లారు. అయితే ఆ షాపులోని వ్యక్తి హిందీలోనే మాట్లాడుతుండటంతో ఆమె మరాఠీలో మాట్లాడమని కోరారు. మరాఠీలో మాట్లాడేందుకు అతడు నిరాకరించాడు. దీంతో మరాఠీలో మాట్లాడాలని పట్టుబట్టడంతో ఆ షాపు యజమాని పోలీసుల సహాయంతో ఆమెను షాపు నుంచి బైటికి పంపించాడు. దీంతో తనకు అవమానం జరిగిందని భావించిన ఆమె గురువారం మధ్యాహ్నం నుంచి ఆ షాపు ఎదుటే బైఠాయించి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెన్నెస్ నాయకు డు సందీప్ దేశ్‌పాండే శుక్రవారం ఉదయం అక్కడికి చేరుకుని ఆమెకు మద్దతుగా అక్కడే బైఠాయించారు. సుమారు 20 గంటల ఆందోళన అనంతరం అక్కడికి షాపు యజమానికి చేరుకోవడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. అనంతరం ఆమెకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెన్నెస్ కార్యకర్తలు షాపు యజమానిని డిమాండ్ చేశారు. దీంతో షాప్ యజమాని శోభా దేశ్‌పాండేకు క్షమాపణ చెప్పాడు. అయితే అప్పటికే తీవ్ర కోపోద్రిక్తుడైన ఎమ్మెన్నెస్ కార్యకర్త ఒకరు ఆ షాపు యజమానిపై చేయిచేసుకున్నాడు. -
వాతావరణ సూచన : హర్షాభావం
అడవిలో నడుస్తున్న ఇద్దరు కొద్ది దూరంలో ఆకలిమీదున్న ఒక ఎలుగుబంటిని చూశారు. వెంటనే ఒకతను పారిపోవడానికి తయారైపోయాడు. రెండో అతను, ‘‘నువ్వెంత ప్రయత్నించినా ఎలుగుబంటి కంటే వేగంగా పరిగెత్తలేవు,’’ అన్నాడు. మొదటి వ్యక్తి అతన్ని చూసి–‘‘ఫర్లేదు, నీకంటే వేగంగా పరిగెత్తితే చాలు కదా!’’ అన్నాడు. ఆరేళ్ల క్రితం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెక్యులేషన్ నవలతో సంచలనాన్ని సృష్టించిన అమెరికన్ రచయిత్రి జెన్నీ ఓఫిల్ తన తాజా నవల వెదర్లో ‘లేట్ కాపిటలిజం’ అంటే ఏమిటి అన్న ఒక ప్రశ్నకి ఇచ్చిన చమత్కార సమాధానం అది. అలాగని ఈ నవల లేట్ కాపిటలిజమ్ గురించి కాదు. హాస్య వ్యంగ్యాలు కథనశైలిలో ఒక భాగమే తప్ప, ఇది పూర్తిగా అలాంటి తరహా నవలా కాదు. వీటన్నింటినీ దాటుకుని వాతావరణం, పర్యావరణం, మనిషి మనుగడల మీదుగా నవల విస్తృతి కొనసాగుతుంది. నవలలోని కథకురాలు లిజీ ఒక లైబ్రేరియన్. భర్త, కొడుకు, తమ్ముడి చుట్టూ ఆమె జీవితం అల్లుకుని ఉంటుంది. లిజీకి ఒకప్పటి ప్రొఫెసర్ అయిన సిల్వియా, వాతావరణంలో వస్తున్న పెనుమార్పుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తన ప్రసంగాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తూంటుంది. సిల్వియాకి ఉన్న పని ఒత్తిళ్ల వల్ల ఆమెకొచ్చే రకరకాల మెయిల్స్ చూసి సమాధానాలు ఇవ్వటానికి లిజీని కుదుర్చుకుంటుంది. ఆ మెయిల్స్‌లోని వైవిధ్యం చూసి లిజీ ఆశ్చర్యపోతుంది. పర్యావరణానికి మనిషి కలిగిస్తున్న హాని, తద్వారా వచ్చే వాతావరణ మార్పులు రానున్న ఉపద్రవానికి సూచనలనీ, ఆ ప్రమాదం సుదూర భవిష్యత్తులో కాదనీ, అనుకున్న దానికంటే చాలా వేగంగా సమీపిస్తోందనీ ఎంతోమంది ఆందోళన చెందటం ఆ మెయిల్స్‌లో గమనిస్తుంది. ముంచుకొస్తున్న వినాశనాన్ని ఎవరూ సరిగ్గా అంచనా వేయని అలసత్వాన్ని గుర్తిస్తుంది. రాబోయే తరాల భద్రత గురించి ఎలాంటి అనుమానాలూ లేని లిజీకి ఈ కొత్త ఎరుక ఉలికిపాటుని కలిగిస్తుంది. తన పిల్లవాడి గురించీ, తరువాతి తరాల గురించీ ఆలోచిస్తున్న లిజీతో ‘‘నువ్వు నీ పిల్లల్ని వీటన్నిటినుంచీ రక్షించగలననే అనుకుంటున్నావా?’’ అని ఆమె ఆలోచనా భారాన్ని మరింత పెంచుతుంది సిల్వియా. అందరిలానే జీవన వైరుధ్యాలని లిజీ కూడా ఎదుర్కొంటూనే ఉంటుంది. బొటాబొటి జీతం, తమ్ముడి బాధ్యత, ఆ బాధ్యత వల్ల సంసారంలో ఇబ్బందులూ, పిల్లవాడూ, చదువూ వంటి వైయక్తిక సమస్యలు ఎన్ని ఉన్నా, ఎన్నికల ఫలితాలూ, నిరంకుశ ధోరణులూ, పెరుగుతున్న అసమానతలూ, స్కూల్లో కాల్పులూ, అభద్రతలూ, అలుముకుంటున్న నిరాశ వంటి సామాజిక పరిస్థితులు భయం కలిగిస్తున్నా – వీటన్నిటి మధ్య కూడా పర్యావరణం పట్ల తన బాధ్యత గురించి ఆలోచించే లిజీ కథే ఈ నవల. రకరకాల విషయాల ప్రస్తావనలతో ప్రారంభంలో పాఠకుడికి పట్టు దొరకనివ్వని కథనం, పోనుపోను అల్లిక చిక్కనై అందులోకి లాగేస్తుంది. కథావిస్తరణలో ఏ నవలా సూత్రాలకీ కట్టుబడకుండా, తార్కికమైన మొదలూ తుదీ అంటూ లేకుండా సాగే కథ– లిజీ ఆలోచనల విస్ఫోటనాల చుట్టూ పాదరసంలా సంచలిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు కొంత హాస్యంతో, కొంత తాత్త్వికతతో కలగలిసి ఆమె మేధను తాకి విడిపోతుంటాయి. రోజువారీ జీవితపు పరుగులో మనిషి కొట్టుకుపోతూ, తన మనుగడనే ప్రశ్నార్థకం చేసే ముఖ్యమైన విషయాలను చూసీచూడనట్టు వదిలేయటం సరికాదన్నదే ఈ నవల ఇతివృత్తం. మేధోపరమైన చర్చలకే పరిమితమైపోతున్నవారు, మార్పుకోసం బరిలోకి దిగి అందరితో కలిసి నడవాలన్నది నవలాంతరంగం. పద్మప్రియ -
నవ్వుల రచయితకు నివాళి
ప్రముఖ సినీ, నవలా రచయిత ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1940 సెప్టెంబర్ 5న విఘ్నేశ్వరరావు మచిలీపట్నంలో జన్మించారు. వినాయక చవితి నాడు పుట్టడంతో తల్లిదండ్రులు ఆయనకు ‘విఘ్నేశ్వరరావు’ అని నామకరణం చేశారు. హిందూ కళాశాలలో బీకామ్ చదివిన ఆయన ‘ఆదివిష్ణు’ కలం పేరుతో కాలేజ్ రోజుల్లోనే కథలు, నవలలు, నాటకాలు రాయడం ప్రారంభించి, ఆ తర్వాత సినిమా రచయితగా మారారు. కలం పేరు ఆదివిష్ణు కావడంతో ఆయన్ని ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అంటారు. ఉద్యోగం చేస్తూనే 40 సినిమాలకు కథా రచయితగా, మాటల రచయితగా పని చేసి, హాస్య రచయితగా గొప్ప ఖ్యాతి గడించారు. 1960లలో ఆదివిష్ణు రాసిన నవలలు, నాటికలు, నాటకాలు, కథలకు విశేష ఆదరణ లభించింది. ఆదివిష్ణు కథల్లో హాస్యం, సెంటిమెంట్ బాగా పండాయి. ట్రాజెడీ, కామెడీ కలయికలో ఆయన రాసిన ‘మంచు తెర’ అనే నాటకానికి మంచి ఆదరణ లభించింది. సినీ రచయితగానూ మంచి పేరు సంపాదించుకున్నారు. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ‘సుందరీ సుబ్బారావు’తో పాటు ప్రముఖ దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించిన ‘అహనా పెళ్ళంట, వివాహ భోజనంబు, జయమ్ము నిశ్చయమ్మురా, ప్రేమా జిందాబాద్’ వంటి చిత్రాలకు కథారచయితగా వ్యవహరించారు. అలాగే బాలమిత్రుల కథ, ఇదాలోకం, కన్నె వయసు, నిజరూపాలు వంటి చిత్రాలకు రచయితగా చేశారు. ‘సుందరి సుబ్బారావు’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ఇటీవల హీరో చిరంజీవి చేతుల మీదగా సత్కారాన్ని అందుకున్నారు. ఉమ్మడి ఏపీఎస్ ఆర్టీసీ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గానూ పని చేశారాయన. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. ఆదివిష్ణు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులతో పాటు ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇంకా సీనియర్ పాత్రికేయులు, నవలా రచయిత నందం రామారావు, ‘పెన్’ సంఘం నేతలు బడే ప్రభాకర్, సింహాద్రి కృష్ణ ప్రసాద్, సనకా వెంకటనాథ ప్రసాద్, సామర్ల మల్లికార్జున రావు, పోతన వెంకటరమణ, రవిచంద్, వంగర శర్మ సంతాపం వ్యక్తం చేశారు. -
జార్జ్ లూయీ బోర్హెస్ గ్రేట్ రైటర్
బోర్హెస్ ఎంత రచయితో, అంతకంటే ఎక్కువ పాఠకుడు. ఒక పాఠకుని జీవితం కూడా వేరే ఏ జీవితంతోనైనా సమానంగా సమృద్ధమైనదే అంటాడు. ‘అందరూ తాము రాసిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటారు. కాని నేను చదివిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటాను’ అనేవాడు. పఠనాన్ని బోర్హెస్ ఎంత ఆనందమయం చేసుకున్నాడంటే, స్వర్గం కూడా గ్రంథాలయంలా ఉండివుంటే బాగుండేదని తలపోశాడు. అర్జెంటీనాలో జన్మించిన బోర్హెస్(1899–1986) తొమ్మిదేళ్లప్పుడే ఆస్కార్ వైల్డ్ ‘ద హ్యాపీ ప్రిన్స్’ను స్పానిష్ భాషలోకి అనువదించాడు. కానీ అది వాళ్ల నాన్న చేశాడనుకున్నారట. తరువాత ఆయన ఎన్నో పుస్తకాలు రాసినప్పటికీ, వాటిలో కొన్ని అచ్చువేసినప్పటికీ వాటన్నింటినీ తన ‘ప్రాక్టీస్’గా మాత్రమే పరిగణించాడు. కవీ, విమర్శకుడూ కూడా అయిన బోర్హెస్ మేజిక్ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకు ఆద్యుడిగా నిలిచాడు. ‘ఫిక్షన్స్’, ‘ది అలెఫ్’ ఆయన కథాసంకలనాలు. తొమ్మిదేళ్లపాటు బోర్హెస్ లైబ్రరీలో పనిచేశాడు. అప్పుడో సహోద్యోగి, ‘జార్జ్ లూయీ బోర్హెస్’ అనే రచయిత పేరూ, ఇతడి పేరూ ఒకటేకావడం; పైగా ఇద్దరికీ ఒకే పుట్టినరోజు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట! రోజూ పుస్తకాలు సర్దే ఈ యువకుడే ఆ రచయితని అతడు మాత్రం ఎలా నమ్మగలడు! విపరీతంగా చదవడం వల్ల 55 ఏళ్ల వయసులో బోర్హెస్‌కు చూపు పోయింది. ఒక కళాకారునికి సంభవించే ప్రతిదీ అతని కళకు కావాల్సిన ముడిసరుకేనని నమ్మి, అంధత్వాన్ని కూడా తన జీవితానికి దక్కిన బహుమతిగా స్వీకరించాడు. డిక్టేషన్ చెబుతూ రచనలు చేశాడు. -
ఘనంగా జాతీయ తెలుగు సదస్సు
కడప కల్చరల్ : భాషాభిమానుల సూచనలను అమలు చేయడంతోపాటు ప్రభుత్వం తెలుగు అమలు పట్ల కఠిన చర్యలు తీసుకుంటే గానీ తెలుగుకు పూర్వ వైభవం చేకూరదని పలువురు తెలుగు భాషాభిమానులు అభిప్రాయపడ్డారు. సోమవారం స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో తెలుగుభాష మిత్ర మండలి, కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థల ఆధ్వర్యంలో తెలుగు భాషోద్ధారకుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా జాతీయ సదస్సును నిర్వహించారు. సభను ప్రారంభిస్తూ తెలుగు భాషా మిత్రమండలి సమన్వయకర్త డాక్టర్ జీవీ సాయిప్రసాద్ సదస్సు నిర్వహణ ఉద్దేశాలను వివరించారు. ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి తెలుగుపై పరిశోధన చేస్తున్న యువ భాషావేత్తలు తమ అభిప్రాయాలతో పత్రాలను సమర్పించారని, వాటిని సమీక్షించి వాటి అమలులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వానికి పంపుతామన్నారు. కవిత విద్యా సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు అలపర్తి పిచ్చయ్యచౌదరి మాట్లాడుతూ భాష పట్ల మమకారం ఎంతైనా అవసరమన్నారు. ఇందుకు తమిళనాడు, కర్ణాటక ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధి అంకాల్ కొండయ్య మాట్లాడుతూ ప్రభుత్వం భాషాభివృద్ధికి సరైన విధి విధానాలను ఏర్పాటు చేసి వాటిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. భాషావేత్త డాక్టర్ అనుగూరి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సులో తెలుగు భాష ప్రాచీనతను నిరూపించే అంశాలు, పరిపాలన భాషగా తెలుగు అమలు, ప్రభుత్వం, ప్రజల పాత్ర, గిడుగు రామమూర్తి పంతులు జీవితం–సాహిత్యం, భాషా ఉద్యమం, తెలుగు సాహిత్యంలో రైతు అనే అంశంపై సదస్సులో చర్చ జరగడం ఆనందంగా ఉందన్నారు. ఒక్కో అంశంలో ఐదారుమంది యువ భాషా వేత్తలు పత్ర సమర్పణ చేయడం శుభపరిణామంగా భావిస్తున్నామన్నారు. నాలుగు సదస్సులలో... ఈ సందర్భంగా జరిగిన మూడు సదస్సులలో మొదటి విభాగానికి అనుగూరు చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన మహబూబ్‌నగర్, హైదరాబాదు, తిరుపతిలకు చెందిన డాక్టర్ మన్నెమోని కృష్ణయ్య, డాక్టర్ ఎన్.సూర్యకాంతి, వెంకట సురేంద్ర, పవన్‌కుమార్‌రెడ్డిలు పత్ర సమర్పణ చేశారు. అలపర్తి పిచ్చయ్య అధ్యక్షతన రెండవ సదస్సులో నెల్లూరు, వనపర్తి, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, హైదరాబాదు, చిత్తూరులకు చెందిన డాక్టర్ తలారి మాలకొండయ్య, కె.ఖాజన్న, జె.శ్రీకాంత్, ఐ.నిర్మలానంద్, కె.జనార్దన్‌లు పత్ర సమర్పణ చేశారు. మూడవ సదస్సులో డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్తి, కోడూరి స్వతంత్య్రబాబు (తిరుపతి), గంగనపల్లె వెంకట రమణ, డాక్టర్ పొదిలి నాగరాజులు పత్ర సమర్పణ చేశారు. నాల్గవ సదస్సులో డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాదు, వారణాసి, సెంట్రల్ యూనివర్శిటీ, తిరుపతిలకు చెందిన డాక్టర్ బాణాల భుజంగరెడ్డి, డాక్టర్ వనితాకృష్ణ, నీలం వెంకటేశ్వర్లు, హెచ్.శారద, ఎం.ఆనంద్‌లు పత్ర సమర్పణ చేశారు. -
ద్విపథం.. ఒక గమ్యం
కడప కల్చరల్: అభ్యుదయ రచయితల సంఘం కడపశాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో సంస్థ బాధ్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి రచించిన రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాహిత్యంలో అన్ని ప్రక్రియలు సమాజ హితం కోరేవే. డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి కవిత్వాన్ని తనకు ఆత్మీయ మిత్రునిగా ఇష్టపడతారు. ఆలోచింపజేసే వచనం కంటే హృదయాన్ని కదిలింపజేసే భావుకత, క్లుప్తత, అంతర్లీనంగా సంగీతం ధ్వనించే కవిత్వం వైపే ఆయన కలం, గలం మొగ్గుచూపుతున్నాయి. ప్రస్తుతం ఆవిష్కృతం కానున్న ‘కవిత–మానవీయత’ పుస్తకం ఎందరో కవులు తమ రచనలతో మానవతను ఆవిష్కరించారో తెలుపుతుంది. కవితకు నిజమైన లక్ష్యాన్ని సాధించి ఉత్తమ మార్గాన్ని చూపుతుంది. మనము అదే బాటలో నడుద్దామన్న స్పూర్తిని కలిగిస్తోంది. మనకోసం కాకుండా సమాజం కోసం బ్రతికిన వారే చరిత్రలో నిలుస్తారన్నది పెద్దల మాట. సామాజిక హితం కోరని కవిత్వం కాలానికి నిలువబోదని కూడా వారు చెప్పారు. ఎన్నో సందర్బాల్లో తనకు మార్గదర్శనం చేసిన రచనలను హృదయ గ్రంథాలయం నుంచి డాక్టర్ ఈశ్వర్‌రెడ్డి సాహిత్యం, సామాజిక అవసరం పుస్తకంలో ఆవిష్కరించారు. తనకు కూడా ఆ పథమే ఇష్టం గనుక కవిగా తన బాధ్యత గనుక అలాంటి ఎందరో రచనలను, అవి లక్ష్యం వైపు సాగిన విధానాన్ని ఈ పుస్తకంలో తెలుపుతున్నారు. ఈ పుస్తకాలను డాక్టర్ పీసీ వెంకటేశ్వర్లు, డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి పరిచయం చేయనున్నారు. ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి సబాధ్యక్షులుగా, ఆచార్య ఆర్వీఎస్ సుందరం ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆర్ఎం ఉమామహేశ్వరరావు, ఆచార్య బి.రామకృష్ణారెడ్డి, ఆచార్య డీవీ శ్రవణ్‌కుమార్ అతిథులుగా హాజరు కానున్నారు.