కథా రచయిత ‘శ్రీవిరించి‘ కన్నుమూత  | Storyteller NC Ramanujachary Passed Away At Chennai | Sakshi
Sakshi News home page

కథా రచయిత ‘శ్రీవిరించి‘ కన్నుమూత 

Published Thu, Jan 27 2022 1:20 AM | Last Updated on Thu, Jan 27 2022 1:21 AM

Storyteller NC Ramanujachary Passed Away At Chennai - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: శ్రీ విరించి అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన ప్రముఖ కథా రచయిత డాక్టర్‌ నల్లాన్‌ చక్రవర్తుల రామానుజాచారి (87) బుధవారం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఉదయం 11 గంటలకు రామానుజాచారి తుది శ్వాస విడిచారని ఆయన సోదరుడు, ఆకాశవాణి విశ్రాంత డైరెక్టర్‌ నల్లాన్‌ చక్రవర్తుల నరసింహాచార్య తెలిపారు. ఆయన అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శ్రీవిరించికి ఒక కుమార్తె ఉన్నారు. రామానుజాచారి 1935లో విజయవాడలో జన్మించారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ, పారిశ్రామిక వాణిజ్య చట్టాలలో బీఎల్‌తో పాటు డాక్టరేట్‌ కూడా చేశారు. తులనాత్మక తత్వశాస్త్రంలోనూ పట్టభద్రులు. 

థియోసాఫికల్‌ సొసైటీలో సేవలు     
రామానుజాచారి 1958 నుంచి థియోసాఫికల్‌ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. అడయార్‌లోని సంస్థ ప్రపంచ ప్రధాన కార్యాలయంలో అనేక హోదాలలో బాధ్యతలు నిర్వర్తించారు. 1951లో తెలుగులో ఆయన చేసిన తొలి రచన ఒక వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత తెలుగు, ఇంగ్లిష్‌లో అనేక కథలు రాశారు. తెలుగులో 100, ఇంగ్లి‹Ùలో 50కిపైగా విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. వందలాది గ్రంథ సమీక్షలు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీకి, నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియాకు అనువాదకులు. మధ్యమావతి, కొత్తనక్షత్రం (1982), అర్థం, కారని కన్నీరు, మెట్లులేని నిచ్చెన (1995), కనకపు గట్టు (1997); గంధపు చుక్క (2000) వంటి పలు కథా సంపుటాలు వెలువరించారు.

ఇంగ్లిష్‌లో అవేకనింగ్‌ టూ ట్రూత్, సీక్రెట్స్‌ ఆఫ్‌ అవర్‌ ఎగ్జిస్టెన్స్, ద ట్రూ పాత్‌ ఆఫ్‌ థియోసాఫీ, వర్డ్స్‌ ఆఫ్‌ విజ్‌డమ్‌ తదితర రచనలు చేశారు. సముద్ర శిఖర్‌ అనే హిందీ రచన కూడా చేశారు. తెలుగు యూనివర్శిటీ అవార్డు, డాక్టర్‌ దాశరథి రంగాచార్య, శ్రీమతి కమలా సాహిత్య పురస్కారం (2004) వంటి పలు పురస్కారాలను అందుకున్నారు . శ్రీవిరించి మరణం సాహితీలోకానికి తీరనిలోటని మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు విభాగం పూర్వాధిపతి మాడభూషి సంపత్‌కుమార్‌ పేర్కొన్నారు. కథాశిల్పం విషయంలో ఆయనది ప్రత్యేకమైన శైలి అని, తెలుగు కథా ప్రపంచం ఓ గొప్ప రచయితను కోల్పోయిందంటూ నివాళులర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement