Narrator
-
కథా రచయిత ‘శ్రీవిరించి‘ కన్నుమూత
సాక్షి ప్రతినిధి, చెన్నై: శ్రీ విరించి అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన ప్రముఖ కథా రచయిత డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రామానుజాచారి (87) బుధవారం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఉదయం 11 గంటలకు రామానుజాచారి తుది శ్వాస విడిచారని ఆయన సోదరుడు, ఆకాశవాణి విశ్రాంత డైరెక్టర్ నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్య తెలిపారు. ఆయన అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శ్రీవిరించికి ఒక కుమార్తె ఉన్నారు. రామానుజాచారి 1935లో విజయవాడలో జన్మించారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ, పారిశ్రామిక వాణిజ్య చట్టాలలో బీఎల్‌తో పాటు డాక్టరేట్ కూడా చేశారు. తులనాత్మక తత్వశాస్త్రంలోనూ పట్టభద్రులు. థియోసాఫికల్ సొసైటీలో సేవలు రామానుజాచారి 1958 నుంచి థియోసాఫికల్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. అడయార్‌లోని సంస్థ ప్రపంచ ప్రధాన కార్యాలయంలో అనేక హోదాలలో బాధ్యతలు నిర్వర్తించారు. 1951లో తెలుగులో ఆయన చేసిన తొలి రచన ఒక వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత తెలుగు, ఇంగ్లిష్‌లో అనేక కథలు రాశారు. తెలుగులో 100, ఇంగ్లి‹Ùలో 50కిపైగా విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. వందలాది గ్రంథ సమీక్షలు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీకి, నేషనల్ బుక్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు అనువాదకులు. మధ్యమావతి, కొత్తనక్షత్రం (1982), అర్థం, కారని కన్నీరు, మెట్లులేని నిచ్చెన (1995), కనకపు గట్టు (1997); గంధపు చుక్క (2000) వంటి పలు కథా సంపుటాలు వెలువరించారు. ఇంగ్లిష్‌లో అవేకనింగ్ టూ ట్రూత్, సీక్రెట్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, ద ట్రూ పాత్ ఆఫ్ థియోసాఫీ, వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ తదితర రచనలు చేశారు. సముద్ర శిఖర్ అనే హిందీ రచన కూడా చేశారు. తెలుగు యూనివర్శిటీ అవార్డు, డాక్టర్ దాశరథి రంగాచార్య, శ్రీమతి కమలా సాహిత్య పురస్కారం (2004) వంటి పలు పురస్కారాలను అందుకున్నారు . శ్రీవిరించి మరణం సాహితీలోకానికి తీరనిలోటని మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు విభాగం పూర్వాధిపతి మాడభూషి సంపత్‌కుమార్ పేర్కొన్నారు. కథాశిల్పం విషయంలో ఆయనది ప్రత్యేకమైన శైలి అని, తెలుగు కథా ప్రపంచం ఓ గొప్ప రచయితను కోల్పోయిందంటూ నివాళులర్పించారు. -
రాయాలీ అని రాయలేను, రచనొక జ్వరం
‘నేను దేన్నయితే నమ్మలేదో దాని గురించి ఎప్పుడూ రాయలేదు,’ అంటారు పతంజలి శాస్త్రి. ఈ కథకుడు, నవలాకారుడు, పర్యావరణ చింతనాపరుడికి ఇది సప్తతి సంవత్సరం. ఆ అసందర్భసందర్భమే ఈ సంభాషణకు పునాది. పురస్కారాల పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తం చేశారు... వ్యతిరేకత కంటే అసంతృప్తి ఎక్కువ. ఏ పురస్కారం తీసుకున్నా ‘ఎవరు ఇప్పించారు గురూ’ అని అడుగుతారు. ఎందుకంటే ప్రతిభ వల్ల వచ్చేవి తక్కువ అని అందరికీ అర్థమయింది. మీపై రచన దిశగా పడిన తొలి ప్రభావం చెప్పండి? ఎక్కువ కుటుంబమే. ఆరో తరగతిలోనే మొదటి కథ రాశాను. ఇల్లంతా పుస్తకాలుండేవి, ఇంటికి ఎంతోమంది కవులూ గాయకులూ వచ్చిపోతుండేవాళ్లు. మూడుతరాల కవులతో నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది. మొదట్లో మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయితలెవరు? నేను కాలేజీ స్థాయికి వచ్చేసరికి- నేనే కాదు మా తరానికి అందరికీ గురువులు ఎవరంటే- మపాసా, సోమర్సెట్ మామ్, ఇక ఆ మూడో పేరు ఓ.హెన్రీ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. మపాసా కథకు వాతావరణాన్ని గొప్పగా సృష్టిస్తాడు. మామ్‌ను అప్పట్లో ఇష్టపడ్డాంగానీ గొప్ప రచయిత కాడు, లోతు తక్కువ. కాని కథ గొప్పగా చెప్పగలడు. మీరు రాసే పద్ధతి ఎలా ఉంటుంది? ఎక్కువ రివైజ్ చేస్తారా, లేక ఒకే ఊపులో రాసి అదే ఖాయం చేస్తారా? కూర్చుని కథ రాయాలీ అనుకుని రాయలేను. లోపల చిత్రమైన కదలిక మొదలై, అది జ్వరంలా మారుతుంది. అప్పుడు రాయడానికి కూర్చుంటాను. రాయడం మొదలుపెడితే ఏకబిగిన రాస్తాను. వేగంగా రాస్తాను. ఒక్కోసారి రాసింతర్వాత ఏం రాశానో నేనే గుర్తు పట్టలేను. పూర్తయ్యాకా మళ్లీ డ్రాఫ్ట్ అంటూ విడిగా రాయను గానీ, ఇంక అందులోనే మార్పులు చేస్తాను. రాయడానికి కూర్చుంటే ముందే కథ ఆద్యంతాల పట్ల పూర్తి అవగాహన ఉంటుందా? లేక రాస్తూపోతూ దారి కనుక్కుంటారా? రెండూను. మామూలుగా కథల విషయంలో ఎలా ముగించాలనేది ముందే ఉంటుంది. ప్రారంభమే ఉండదు. ఇలా మొదలెట్టాలీ అని ఖాయంగా అనుకోలేను. ఇన్ని పేజీలూ అనుకోను. ఎంతవరకూ వస్తే అంతటితో ఆపేస్తాను. కథ రాసేటప్పుడు పాత్రలన్నీ నా కనుల ముందర కనిపిస్తూ ఉంటాయి. చర్మం రంగేమిటి, జుట్టు ఎలా దువ్వుకుంటుంది, ఎలా మాట్లాడుతుంది... ఇలా ప్రతి మైనరు డీటైలూ కనిపిస్తుంది. కనిపించిందంతా కథలో రాయకపోవచ్చు. కానీ కనిపిస్తుంది. కాబట్టి ముందు ఎక్కడో ఒకచోట మొదలుపెట్టేస్తాను. నాకు ఇష్టమైన ఉదాహరణ చెప్తాను. నా ‘వీరనాయకుడు’ నవలలో నాకు ఇష్టమైన పాత్ర పూర్ణయ్య అనే ఒక వేగు పాత్ర. ఆ పాత్ర వచ్చే ముందున్న పేరాగ్రాఫులో కూడా నాకు ఆ పాత్ర వస్తుందన్న స్పృహ లేదు. మీ కథలు కొన్ని వాస్తవికంగా సాగుతూనే ఉన్నట్టుండి దాన్నించి దూరం జరుగుతాయి... వాస్తవికత అనేదానికి చాలా పరిమితులు ఉన్నాయి. దాని రిలవెన్స్ దానికి ఉంది, కాదనటం లేదు. కానీ కేవల వాస్తవికత అనేది creatively not inspiring for me. లాటిన్ రచయిత Mario Vargas Llosa 'The Feast’ నవల రాశాడు. డొమినికన్ రిపబ్లిక్‌ను పాలించిన ఒక నియంత జీవితం గురించి. రచయిత వాస్తవికంగానే కథ చెప్తాడు, చెప్తూనే ఏం చేస్తాడంటే, తన కథన శక్తి ద్వారా ఈ వాస్తవిక పరిమితుల నుంచి దాన్ని పైకి లేపి వదిలేస్తాడు. ఫలితంగా, అది కేవలం ఒక దేశానికి సంబంధించిన నియంత గురించి అని తెలుస్తూనే ఉన్నాగానీ మనం రిలేట్ చేసుకోగలం. మీ ఉద్దేశం మేజిక్ రియలిజమా? ఇది most misunderstood word. మన తెలుగువాళ్లు ఏం చేసినా అతి కదా. ఒకరకంగా ఆలోచిస్తే మన దేశానికి మేజిక్ రియలిజం కొత్త కాదు. నేను చెప్తున్నది సింబాలిజం గురించి. మేజిక్ రియలిజం మార్క్వెజ్ నుంచి మొదలైంది. నేరేషన్లో కాలం అన్న డెమైన్షన్ను మేజిక్ రియలిస్టులు తీసి పారేశారు. కాలంతో సంబంధం లేకుండా గతాన్ని వర్తమానం చేస్తుంటారు. మనవాళ్లు దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. తెలుగు రచయితల్లో గోపిని కరుణాకర్ ఒక్కడే దానికి సమర్థుడు. అతనికే అది సహజంగా పట్టుబడింది. కథారచన చేసినంత విస్తారంగా నవలారచన వైపు మీ దృష్టి ఎందుకు పోలేదు? నాకు కథలంటే ఎక్కువ ఇష్టం. రాసిన నవలలు కూడా బాగా చిన్నవి. అసలు నేను- రచన ఇంతవరకూ ఉండాలి, ఈ కోవకు చెందాలి అనుకోను. అది సహజంగా ఎంతవరకూ డెవలప్ అవుతుందో అంతవరకూ పోనిచ్చి ఆపేస్తాను. కుళాయిలో నీరు పోయినంత పోయి చివరకు చుక్కలుగా మారి డ్రై అయిపోతుందే- అలాగ. ఒక పర్యావరణ కార్యకర్తగా, కల్చర్కూ ఎకాలజీకి ఉన్న సంబంధం ఏమిటి? మానవ సమూహం జీవిత నిర్వహణ కోసం చేసే కృషి అంతా ఆ జీవావరణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో ఈ ప్రభావం ఉంటుంది. అది ఒక జీవనవిధానాన్ని ఏర్పాటుచేస్తుంది. ఆ విధానంలో ముఖ్యమైన భాగమే సంస్కృతీ సంప్రదాయాలు. మీకు సినిమా అంటే ఇష్టమని తెలిసింది. ఆ వైపుగా ప్రయత్నాలేమన్నా చేశారా? దృశ్యమాధ్యమం మన క్రియేటివిటీకి కొనసాగింపు లాంటిది. మంచిసినిమా చూడటం నాకు గొప్ప ఈస్థటిక్ అనుభవం. నాలుగైదు ప్రయత్నాలు చేశాను, కుదర్లేదు. నా కథలు కొన్ని స్క్రీన్‌ప్లేగా చేస్తున్నాను. మీకు బాగా నచ్చిన రచయితలు? త్రిపుర, కేశవరెడ్డి, పాలగుమ్మి పద్మరాజు, చాసో, గోపిని కరుణాకర్, కాశీభట్ల... ఇలా చాలామంది. ఇంగ్లీషులో లెక్కేలేదు. ఇంటర్వ్యూ: ఫణి (పతంజలి శాస్త్రి ఫోన్: 9440703440) -
కథకుడికి కావలసిన శ్రద్ధ
విమర్శ కథకుడు ఎలా ఉండాలి? కథానికను ఎలా నడిపితే బిగువు సడలకుండా ఉంటుంది? లాంటి అంశాలను తన ‘సాహిత్య శిల్పసమీక్ష’లో వివరించారు పింగళి లక్ష్మీకాంతం (1894-1972). ఆ పుస్తకానికి 1966లో రాసుకున్న పీఠికలో ‘ఇది నేను ముప్పదియేండ్ల క్రితము ప్రచురింపవలసిన గ్రంథము’ అన్నారాయన. ఆ లెక్కన ఈ అభిప్రాయాలు వెల్లడించిన కాలం మీద ఒక అంచనాకు రావచ్చు. విశాలాంధ్ర ప్రచురించిన ఈ పుస్తకంలోని ‘కథానిక’ వ్యాసంలోంచి కొన్ని ముఖ్యాంశాలు: 1. చిత్త విశ్రాంతిలేని ఈ ఆధునిక జీవితములో శ్రమాపనోదనార్థము1,2, సాహిత్య జన్యమైన మానసిక సుఖమును అనుభవించుటకు కొంచెంపాటి విరామము కలిగించుకొని, ఆ కొంచెము సేపులో ఎక్కువ శ్రమకు లోనుకాకుండ తేలికగా చదువుకొనదగిన కావ్యవిశేషముగా ఒక్క కథానికయే లభించుచున్నది. 2. నవలలో కథా వైపుల్యము3ను బట్టి పాత్ర స్వభావమును సంపూర్ణముగా సమున్మీలితము4 చేయవచ్చును. కథానికా సంక్షిప్తతనుబట్టి ఇయ్యెడ చిత్రలేఖనమును ఏకభంగిమ చిత్రణమువలె ఏదో ఒక సంఘటనను మాత్రమే చూపబడునుగాన దానికి సంబంధించిన స్వభావలేశము మాత్రమే ఆపేక్షితమగును. అదియుగాక, కొన్ని కథానికలలో పాత్రలు నిమిత్తమాత్రములును, సంఘటనలు ప్రధానములును అయియుండును. కావున అన్నింటను పాత్ర చిత్రణమును ఆశింపరాదు. మరికొన్నింట పాత్రలకును, సంఘటనలకును లేని ప్రాధాన్యము, ఒక జీవితధర్మ నిరూపణమున కుండును. అట్టియెడ ఆ రెండును నిమిత్తమాత్రములే. 3. కథానిక స్వల్పకాల పఠనయోగ్యము గనుక అందలి పాత్రలు మనము లోకములో యాదృచ్ఛికముగా కలిసి విడిపోయెడి వ్యక్తుల వంటివి. వీటితో మనకు చిరపరిచయము కుదరదు. ఎంత ఉత్తమ కథానికయైనను, రెండవసారి చదువబడుట చాల అరుదు. నవలను కావ్యనాటకములవలె బహుపర్యాయములు గాకున్నను రచనా సౌందర్యమునుబట్టి రెండవసారియైనను చదువుటకు బుద్ధిపుట్టును. అయినను కథానికా రచయితకు ఉండదగిన ఏకాగ్రత నవలాకారునకు ఆవశ్యకము కాదు. కథా సంక్షిప్తతను బట్టి ఎయ్యెడను నీరసత్వముగాని, పలుచదనముగాని, కుంటినడకగాని లేకుండ మనస్సును ఆకట్టెడి రక్తితో కథ నడపవలెనన్నచో కథకుడు ఏకాగ్రచిత్తుడై రచించిననే తప్ప కృతార్థుడు కాడు. అనవసరమైన వాగ్వ్యయము ఎందుకూ పనికిరాదు. కథారంగమును అలంకరించు నెపమున దీర్ఘ వర్ణనలు చేయుటయు కూడదు. ఈ నియమములు ఇంచుమించు నాటక రచనా నియమములకంటెను కఠినములైనవి. ఇట్టి నియమములకు విధేయుడై కథను స్వయం సంపూర్ణమగునట్లు చేయుటలో అతనికిగల క్లేశము నవలాకారునకు లేదు. నవలయందు ఒకప్పుడు కథలో బిగువు సడలినను, అప్రస్తుత ప్రసంగములు దొరలినను, కథావిస్తృతిలో అవి మరుగున పడిపోవును. కథానికలో అట్టి లోపములు రచనను వికృతమొనర్చును. 1. అపనోదనము=తొలగించుట, దూరంచేయుట; 2. శ్రమాపనోదనార్థము=శ్రమను దూరం చేసుకోవడానికి; 3. వైపుల్యము=విపులత్వము; 4. ఉన్మీలితము = వికసించుట. పింగళి లక్ష్మీకాంతం -
తెలుగుతేజం నీనా దావులూరి యాంకరింగ్
మోదీ ప్రసంగానికి ముందు మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు భారత సంతతికి చెందిన తెలుగుతేజం, మిస్ అమెరికా-2014 విజేత నీనా దావులూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. భారతీయ అమెరికన్, దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీతోపాటు పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను సభకు పరిచయం చేశారు. ఆమెకు భారత సంతతి యాంకర్ హరి శ్రీనివాసన్ సహకారం అందించారు.