ఘనంగా జాతీయ తెలుగు సదస్సు
కడప కల్చరల్ :
భాషాభిమానుల సూచనలను అమలు చేయడంతోపాటు ప్రభుత్వం తెలుగు అమలు పట్ల కఠిన చర్యలు తీసుకుంటే గానీ తెలుగుకు పూర్వ వైభవం చేకూరదని పలువురు తెలుగు భాషాభిమానులు అభిప్రాయపడ్డారు. సోమవారం స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో తెలుగుభాష మిత్ర మండలి, కవిత విద్యా సాంస్కృతిక సేవా సంస్థల ఆధ్వర్యంలో తెలుగు భాషోద్ధారకుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా జాతీయ సదస్సును నిర్వహించారు. సభను ప్రారంభిస్తూ తెలుగు భాషా మిత్రమండలి సమన్వయకర్త డాక్టర్ జీవీ సాయిప్రసాద్ సదస్సు నిర్వహణ ఉద్దేశాలను వివరించారు. ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి తెలుగుపై పరిశోధన చేస్తున్న యువ భాషావేత్తలు తమ అభిప్రాయాలతో పత్రాలను సమర్పించారని, వాటిని సమీక్షించి వాటి అమలులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వానికి పంపుతామన్నారు.
కవిత విద్యా సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు అలపర్తి పిచ్చయ్యచౌదరి మాట్లాడుతూ భాష పట్ల మమకారం ఎంతైనా అవసరమన్నారు. ఇందుకు తమిళనాడు, కర్ణాటక ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధి అంకాల్ కొండయ్య మాట్లాడుతూ ప్రభుత్వం భాషాభివృద్ధికి సరైన విధి విధానాలను ఏర్పాటు చేసి వాటిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. భాషావేత్త డాక్టర్ అనుగూరి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సులో తెలుగు భాష ప్రాచీనతను నిరూపించే అంశాలు, పరిపాలన భాషగా తెలుగు అమలు, ప్రభుత్వం, ప్రజల పాత్ర, గిడుగు రామమూర్తి పంతులు జీవితం–సాహిత్యం, భాషా ఉద్యమం, తెలుగు సాహిత్యంలో రైతు అనే అంశంపై సదస్సులో చర్చ జరగడం ఆనందంగా ఉందన్నారు. ఒక్కో అంశంలో ఐదారుమంది యువ భాషా వేత్తలు పత్ర సమర్పణ చేయడం శుభపరిణామంగా భావిస్తున్నామన్నారు.
నాలుగు సదస్సులలో...
ఈ సందర్భంగా జరిగిన మూడు సదస్సులలో మొదటి విభాగానికి అనుగూరు చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన మహబూబ్‌నగర్, హైదరాబాదు, తిరుపతిలకు చెందిన డాక్టర్ మన్నెమోని కృష్ణయ్య, డాక్టర్ ఎన్.సూర్యకాంతి, వెంకట సురేంద్ర, పవన్‌కుమార్‌రెడ్డిలు పత్ర సమర్పణ చేశారు. అలపర్తి పిచ్చయ్య అధ్యక్షతన రెండవ సదస్సులో నెల్లూరు, వనపర్తి, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, హైదరాబాదు, చిత్తూరులకు చెందిన డాక్టర్ తలారి మాలకొండయ్య, కె.ఖాజన్న, జె.శ్రీకాంత్, ఐ.నిర్మలానంద్, కె.జనార్దన్‌లు పత్ర సమర్పణ చేశారు. మూడవ సదస్సులో డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్తి, కోడూరి స్వతంత్య్రబాబు (తిరుపతి), గంగనపల్లె వెంకట రమణ, డాక్టర్ పొదిలి నాగరాజులు పత్ర సమర్పణ చేశారు. నాల్గవ సదస్సులో డాక్టర్ ఎన్.ఈశ్వర్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాదు, వారణాసి, సెంట్రల్ యూనివర్శిటీ, తిరుపతిలకు చెందిన డాక్టర్ బాణాల భుజంగరెడ్డి, డాక్టర్ వనితాకృష్ణ, నీలం వెంకటేశ్వర్లు, హెచ్.శారద, ఎం.ఆనంద్‌లు పత్ర సమర్పణ చేశారు.