ఈ-కామర్స్‌లోకి మెడ్‌ప్లస్..
ఆర్డరిచ్చే ఔషధాలు 6 గంటల్లో దగ్గర్లోని స్టోర్‌లో సిద్ధం
త్వరలో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు నేరుగా ఇంటికే డెలివరీ
మూడేళ్లలో దేశవ్యాప్తంగా 10,000 స్టోర్లు
ఆరునెలల్లో రూ.450 కోట్ల పీఈ నిధులు
మెడ్‌ప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
ఇప్పటిదాకా ఔషధాల విక్రయ రంగంలో ఉండి ఫార్మసీ చైన్‌ను నిర్వహిస్తున్న మెడ్‌ప్లస్ సంస్త ఈ-కామర్స్ బాట పట్టింది. ‘క్లిక్, పిక్, సేవ్’ పేరుతో ఔషధాలను కూడా మెడ్‌ప్లస్‌మార్ట్.కామ్ ద్వారా విక్రయించే విధానాన్ని ప్రారంభించింది. దశలవారీగా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులనూ ఆన్లైన్లో పరిచయం చేయనుంది. ప్రస్తుతం వ్యక్తిగత సంరక్షణ, సౌందర్య పోషణ, పోషకాహార తదితర ఉత్పత్తులను మెడ్‌ప్లస్ విక్రయిస్తోంది. భవిష్యత్తులో అన్ని ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులనూ అందుబాటులోకి తెస్తామని మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ వ్యవస్థాపకులు, సీఈవో మధుకర్ గంగాడి చెప్పారు. శుక్రవారమిక్కడ ఆన్లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించిన సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో మాట్లాడారు. ఈ-కామర్స్‌ను వేదికగా చేసుకుని రిటైల్ రంగంలో సుస్థిర స్థానం దక్కించుకుంటామని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే..
ఆన్లైన్లో 20 వేల రకాలు..
మెడ్‌ప్లస్‌మార్ట్.కామ్ వెబ్సైట్ ప్రత్యేకత ఏంటంటే సబ్‌స్టిట్యూట్ (ప్రత్యామ్నాయ) మందులను కూడా స్క్రీన్‌పై చూపిస్తుంది. కస్టమర్ కోరుకుంటున్న మందుకు, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఇతర బ్రాండ్ల మందులకు మధ్య ధరలో ఉన్న తేడా, తయారు చేసిన కంపెనీ, ఔషధ ఉపయోగాలు, దుష్పరిణామాల వంటి వివరాలూ కూడా కనిపిస్తాయి. మొత్తం 20 వేల రకాల మందులు, 10 వేల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను పోర్టల్‌లో ఉంచాం. ఆన్లైన్లో ఆర్డరు ఇస్తే చాలు. 6 గంటల వ్యవధిలో కస్టమర్‌కు దగ్గర్లో ఉన్న స్టోర్‌లో మందులు సిద్ధంగా ఉంటాయి. వినియోగదారు తనకు వీలున్న సమయంలో షాప్‌కు వెళ్లి తెచ్చుకోవచ్చు. ఔషధాలపై 15 శాతం, ఎఫ్ఎంసీజీ ఉత్పాదనలపై 30 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. దశలవారీగా అన్ని నగరాలకు విస్తరిస్తాం.
ఇలా చేరుకుంటాం...
మెడ్‌ప్లస్‌కు 12 రాష్ట్రాల్లో 1,240 స్టోర్లున్నాయి. మూడేళ్లలో 10,000 స్టోర్లను చేరుకుంటాం. ఇందులో 8,000 స్టోర్లు ఫ్రాంచైజీ విధానంలో వస్తాయి. కనీసం 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ ఉంటుంది. ఒక్కో స్టోర్‌లో 6,000 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు ఎలాగూ లభిస్తాయి. అన్ని స్టోర్లనూ ఆన్‌లైన్‌కు అనుసంధానిస్తాం. రానున్న రోజుల్లో ఆన్లైన్లో ఆర్డరు ఇస్తే... సరుకులు ఇంటికే పంపే ఏర్పాట్లు చేస్తాం. మందులు మాత్రం స్టోర్ నుంచి తీసుకోవాల్సిందే.
నిధులు సమీకరిస్తున్నాం..
దేశవ్యాప్తంగా మందుల విక్రయాల పరిమాణం రూ.80 వేల కోట్లుంది. ఇందులో రూ.4,800 కోట్లు వ్యవస్థీకృత రంగం కైవసం చేసుకుంది. వ్యవస్థీకృత రంగంలో మెడ్‌ప్లస్‌కు 30 శాతం మార్కెట్ వాటా ఉంది. మొత్తం మందుల వ్యాపారంలో మూడేళ్లలో 25 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నాం. విస్తరణకుగాను రూ.450 కోట్ల పీఈ నిధుల్ని సమీకరిస్తున్నాం. ఇది ఆరునెలల్లో పూర్తవుతుంది. 2014-15లో రూ.1,430 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేస్తున్నాం. ఎంహెచ్ఎస్ బ్రాండ్‌తో జనరిక్ ఔషధాలు, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. టర్నోవర్ రూ.15,000 కోట్లకు చేరుకున్నాక సొంత ఔషధ తయారీ ప్లాంటు పెట్టాలన్నది ఆలోచన. మౌంట్ కెల్లెట్ క్యాపిటల్ మేనేజ్మెంట్, టీవీఎస్ క్యాపిటల్, అజయ్ పిరమల్ ఇండియా వెంచర్ అడ్వైజర్స్‌కు మెడ్‌ప్లస్‌లో 70 శాతం వాటా ఉంది. ఈ వాటాను కొనేందుకు భారత్‌తోపాటు మరో దేశానికి చెందిన ప్రైవేటు ఈక్విటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రక్రియ 2015 లోనే పూర్తవుతుంది.