సోనీ ఎక్స్పీరియాలో 2 కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: సోనీ కంపెనీ ఎక్స్పీరియా మోడల్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం హ్యాండ్సెట్ మార్కెట్లో మరింత వాటా సాధించడం లక్ష్యంగా ఈ రెండు కొత్త ఎక్స్పీరియా స్మార్ట్ఫోన్లను అందిస్తున్నామని సోనీ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) సచిన్ రాయ్ చెప్పారు. 5.2 అంగుళాల స్క్రీన్ సైజు ఉన్న ఎక్స్పీరియా జడ్3 ధర రూ.51,990 అని, 4.6 అంగుళాల స్క్రీన్ సైజు ఉన్న ఎక్స్పీరియా జడ్3 కాంపాక్ట్ స్మార్ట్ఫోన్ ధర రూ.44,900 అని వివరించారు.
గురువారం నుంచే వీటి విక్రయాలు ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ రెండు ఫోన్లలలో స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్, 2.5 గిగాహెర్ట్స్ క్వాడ్-కోర్ సీపీయూ, 3 జీబీ ర్యామ్, 4జీ ఎల్టీఈ, 20.7 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 25 ఎంఎం వైడ్యాంగిల్ లెన్స్, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. నీళ్లలో, దుమ్ములో పడినా ఈ ఫోన్లు పాడుకావని. గేమింగ్ ప్రియుల కోసం పీఎస్4(ప్లేస్టేషన్) రిమోట్ ప్లే ఫీచర్ను అందిస్తున్నామని తెలిపారు.
పీఎస్4పై గేమ్స్ అడుకోవడానికి ఈ ఫోన్లను రిమోట్ స్క్రీన్లుగా ఉపయోగించుకోవచ్చని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ అవుట్లెట్ల సంఖ్యను 10వేలకు విస్తరించనున్నామని, వీటిల్లో 250 ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియా స్టోర్స్ ఉంటాయని పేర్కొన్నారు. భారత ప్రీమియం హ్యాండ్సెట్ మార్కెట్లో సోనీకి 10 శాతం వాటా ఉంది. సోనీ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించింది.