హిందీ చిత్రానికి నిర్మాతగా - ఎ.ఆర్.రెహమాన్
సంగీత సంచలనం ఎ.ఆర్.రెహమాన్ ఇటీవలే చెన్నయ్‌లో కేఎం కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ టెక్నాలజీని ప్రారంభించారు. మరోవైపు సంగీతదర్శకుడిగా అటు భారతీయ చిత్రాలతో ఇటు విదేశీ చిత్రాలతో బిజీగా ఉన్నారాయన. ఇంత బిజీలో కూడా మరో బాధ్యతను తలకెత్తుకున్నారు రెహమాన్. అదే నిర్మాణ బాధ్యత. అవును. త్వరలో ఆయన నిర్మాతగా మారనున్నారు.
‘వైఎమ్ మూవీస్’ పేరుతో ఓ బేనర్ కూడా స్థాపించారు రెహమాన్. తొలి ప్రయత్నంగా ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి ఓ హిందీ సినిమా నిర్మించబోతున్నారు. కొంతమంది రచయితలతో కలిసి ఈ చిత్రానికి రెహమాన్ కథ తయారు చేశారు. ఇంకా దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులను, నటీనటులను ఎంపిక చేయలేదు. ఈ చిత్రానికి సంగీతం కూడా రెహమానే అందిస్తారు.
ఈరోస్‌తో పదహారేళ్లుగా అనుబంధం కొసాగుతోందని ఈ సందర్భంగా రెహమాన్ పేర్కొన్నారు. సినిమాటిక్ అంశాలతో పాటు కళాత్మక అంశాలతో ఈ చిత్రం ఉంటుందని ఆయన చెప్పారు. అందరికీ వినోదాన్ని పంచడమే వైఎమ్ మూవీస్ ముఖ్యోద్దేశమని రెహమాన్ అన్నారు. రెహమాన్‌లాంటి జీనియస్‌తో సినిమా నిర్మించడం ఆనందంగా ఉందని, ఈ సినిమా తమ సంస్థకు ప్రత్యేకమని ఈరోస్ ప్రతినిధి చెప్పారు.