సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తోంది జగన్ ఒక్కరే
= కిర ణ్, చంద్రబాబుది డబుల్ గేమ్
= స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన
= కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెబుతారు
= మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి
సాక్షి, బళ్లారి : వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడని మాజీ ఎంపీ వైఎస్. వివేకానందరెడ్డి అన్నారు. గురువారం ఆయన బళ్లారిలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా స్థానిక పోలా హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెరవెనుక సహకరించారని విమర్శించారు.
ప్రజలు సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమాలు లేవనెత్తిన తర్వాత వారిద్దరూ డబుల్‌గేమ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడికి ముందుగా చెప్పకుండా కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకునే అవకాశమే లేదన్నారు. సీఎం ముందు అంగీకారం తెలిపి, తర్వాత తన ఉనికి దెబ్బతింటుందన్న భయంతో మాటమార్చారని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలనుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
తెలంగాణా ప్రాంతంలో కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అనేక మంది కోరుకుంటున్నారని గుర్తు చేశారు. రాయల తెలంగాణ అంశం కూడా కొందరు లేవనెత్తుతున్నారని, ఇది సరైన చర్య కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బళ్లారిని వదులుకోవడం వల్ల చాలా నష్టపోయామని గుర్తు చేశారు. హెచ్ఎల్సీ ద్వారా సమాంతర కాలువ ఏర్పాటు చేసుకుని రైతులకు నీరు అందించాలని తమ ప్రాంత ప్రజలు పోరాటం చేస్తుంటే కర్ణాటక అడ్డుపుల్ల వేస్తోందన్నారు. విడిపోతే నీటి పంపకాల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు.