yadadri collectarate
-
యాదాద్రి కలెక్టరేట్లో దంపతుల ఘర్షణ
భువనగిరి క్రైం: కొద్దికాలంగా తనతో సఖ్యతగా ఉండటంలేదన్న కోపంతో భర్తపై కత్తితో దాడి చేసింది ఓ భార్య. శుక్రవారం యాదాద్రి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కలెక్టరేట్లో ఆత్మకూర్(ఎం) మండల వ్యవసాయశాఖ అధికారిణిగా పనిచేస్తున్న నర్ర శిల్ప, అదే కార్యాలయంలో తన కిందిస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న మాటూరి మనోజ్‌గౌడ్‌ను గతేడాది జూన్ 7న ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా 3నెలల క్రితం మనోజ్‌గౌడ్ యాదగిరిగుట్టకు డిప్యూటేషన్‌పై వెళ్లి అనంతరం సెలవుపై వెళ్లాడు. శుక్రవారంతో సెలవులు పూర్తికావడంతో విధులకు హాజరుకావడానికి రిపోర్ట్ చేసేందుకు కలెక్టర్‌ట్‌కు వచ్చాడు. అదేసమయంలో భర్తతో మాట్లాడేందుకు శిల్ప దగ్గరకు వెళ్లింది. గొడవల నేపథ్యంలో వారిద్దరిమధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో శిల్ప కత్తి తీసుకుని మనోజ్‌పై దాడి చేయగా..అతడి వీపు, మెడపై తీవ్రగాయాలయ్యాయి. సహోద్యోగులు వెంటనే వారిని అడ్డుకుని మనోజ్‌ను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడ్నుంచి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై శిల్పను వివరణ కోరగా..మనోజ్ కొంతకాలంగా తనతో సఖ్యతగా ఉండటం లేదని ఇదే విషయం మాట్లాడేందుకు రాగా తనపై కత్తితో దాడి దిగాడని చెప్పారు. దీంతో ఆత్మరక్షణార్థం అతడి వద్ద ఉన్న కత్తిని లాక్కుని దాడి చేసినట్లు చెప్పారు. శిల్ప, మనోజ్ తండ్రి ఉపేందర్ వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఘటనపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని భువనగిరి కలెక్టర్ హనుమంతు కె.జడంగే చెప్పారు. -
తీరొక్క మొక్క.. పల్లె లెక్క
కనుచూపు మేర కనువిందుచేసే పచ్చిక..ఆహ్లాదాన్ని పంచే పూలతో పాటు ఇతర మొక్కలు.. నీటిలో ఈదులాడే చేపలు, బాతులు..చెట్టు కింద ధ్యానముద్రలో బుద్ధుడు..పక్కనే తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టేలా ఎడ్లబండి.. అక్కడే సాగుపనిలో నిమగ్నమైన రైతుదంపతులు.. భవనం గోడలపై అల్లిబిల్లిగా అల్లుకున్న లతలు.. పచ్చికపై ఆడుకుంటున్న చిన్నారులు.. కుందేళ్ల పరుగులు.. పక్షుల కిలకిలారావాలు..వేపచెట్టుకు కట్టిన ఊయల.. ఓపెన్ జిమ్.. ఇదీ అక్కడ అడుగుపెడితే కనిపించే అందమైన ‘పల్లె దృశ్యం’. ఇంతకీ ఇదెక్కడో చెప్పలేదు కదూ.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ బంగ్లాలో.. పర్యావరణహితంగా.. యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌తోపాటు కలెక్టర్, అదనపు కలెక్టర్ బంగ్లాలను గతేడాది ఫిబ్రవరి 12న ప్రారంభించారు. బంగ్లాలో చేరిన కలెక్టర్ పమేలా సత్పతి కేవలం 3 నెలల్లోనే తన అభిరుచికి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుకున్నారు. కొత్త ఆవిష్కరణలకు, అందమైన ల్యాండ్‌స్కేపింగ్‌కు బంగ్లాను వేదికగా మార్చారు. పర్యావరణహితంగా, సేంద్రియ పద్ధతిలో గార్డెనింగ్, టెర్రస్, కిచెన్ గార్డెనింగ్ నిర్వహిస్తూ పలురకాల పూలమొక్కలు పెంచుతున్నారు. కలెక్టర్‌గా క్షణం తీరికలేకుండా గడిపే ఆమె కొద్ది సమయం చిక్కినా మొక్కల సంరక్షణలోనే గడుపుతారు. బంగ్లాను ఉద్యానవనంగా మార్చిన ఆమె.. రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగిన గార్డెన్ ఫెస్టివల్–2023లో సేంద్రియ పద్ధతిలో పర్యావరణహితంగా చేపట్టిన వ్యక్తిగత గార్డెనింగ్ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్నారు. ఎటుచూసినా పచ్చదనం.. పూల అందాలే.. కలెక్టర్ బంగ్లా టెర్రస్ వందల రకాల మొక్కలతో చిన్నపాటి ఉద్యానవనాన్ని తలపిస్తోంది. ఇక బంగ్లా ఆవరణ 400 రకాల మొక్కలకు నెలవైంది. వాటి రక్షణకు విభిన్నమైన కుండీలు పెట్టారు. నీటి మొక్కల కోసం తొట్లను ఏర్పాటుచేశారు. కలెక్టర్ బంగ్లా కిటికీలు, ఇంట్లోకి వెళ్లే కారిడార్, వరండా.. ఇలా ఆవరణ మొత్తం అందమైన మొక్కలతో నింపేశారు. విధి నిర్వహణలో భాగంగా ఎక్కడకు వెళ్లినా కొత్త మొక్కలు సేకరించి.. వాటిని తన బంగ్లా ఆవరణలో నాటడం పమేలాకు అలవాటు. అలాగే, వేర్వేరు ప్రాంతాల్లో భిన్నమైన మొక్కలు పెంచుతున్న వారి దగ్గర నుంచీ కొన్నింటిని తెచ్చారు. వృథా సామగ్రి, రాళ్లు, ఇసుక, రకరకాల మట్టితో గార్డెనింగ్ నిర్వహిస్తున్నారు. మొక్కలంటే ప్రాణం.. మొక్కలంటే నాకు ప్రాణం. ఉద్యోగ నిర్వహణలో ఎక్కడికి బదిలీపై వెళ్లినా నా వెంట లగేజీతోపాటు మొక్కలను కచ్చితంగా తీసుకెళ్తా. మా అమ్మ వ్యవసాయ శాస్త్రవేత్త కావడంతో పదేళ్లప్పటి నుంచే నాకూ మొక్కలంటే ఇష్టం ఏర్పడింది. చిన్నప్పుడు మా అమ్మతో వెళ్తే అక్కడ కొందరు నాకు మొక్క లు బహుమతిగా ఇచ్చేవారు. అలా నాకు మొక్కల పెంపకంపై ఆసక్తి కలిగింది. నేను ప్రస్తుతం ఉంటున్న బంగ్లాలో 400 మొక్కల తొట్లు ఉన్నాయి. ఎంత బిజీగా ఉన్నా మొక్కల సంరక్షణకు రోజూ కొంత సమయం కేటాయిస్తాను. – పమేలా సత్పతి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ -
యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోతుంది: సీఎం కేసీఆర్
-
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే: సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక సంపద బాగా పెరిగిపోయిందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ శనివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోతుందన్నారు. మిషన్ కాకతీయలో చెరువులను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని, . భూముల విలువ విపరీతంగా పెరిగిందన్నారు. దళితులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయి. ఉద్యోగాల విషయంలో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉద్యోగుల జీతాలు ఇంకా పెరుగుతాయి. గతంలో మీకు పరిపాలన చేతకాదని ఎద్దేవా చేశారు. కరెంట్ ఉండదు. అంతా చీకటే అన్నారు. ఒక సీఎం అయితే కట్టెతో మ్యాప్‌లో చూపించారు. అప్పుడు అలా చూపించిన వాళ్ల రాష్ట్రంలో కరెంట్ లేదు. మన దగ్గర 24 గంటల కరెంట్ ఉంది. హైదరాబాద్-వరంగల్ కారిడార్ అద్భుతంగా డెవలప్ అవుతోంది. భువనగిరి జిల్లా అవుతుందని ఎవరూఊహించలేదు. యాదాద్రి పూర్తయితే వేగంగా అభివృద్ధి చెందుతుంది.’ అని పేర్కొన్నారు. చదవండి: ఫైటర్ పైలట్ కోర్సుకు గురుకుల విద్యార్థి ఎంపిక -
యాదాద్రి కలెక్టరేట్ వద్ద బీజేపీ ధర్నా
యాదాద్రి: పలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యాదాద్రి భువనగిరిజిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా చేపట్టింది. రైతులకు రుణ మాఫీ చేయాలని, ప్రధాన మంత్రి ఫసల బీమా యోజనను సక్రమంగా అమలు చేయాలని, పేద, దళిత రైతులకు మూడెకరాల భూమి పంపిణీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, పేద, మధ్య తరగతి ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.