తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట అభివృద్ధి: కేసీఆర్
యాదగిరిగుట్టను తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తామని, రెండేళ్లలో దీన్ని పూర్తిగా టీటీడీ తరహాలో టెంపుల్ సిటీగా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ ప్రాంతంలో శుక్రవారం నాడు ఏరియల్ సర్వే చేసిన కేసీఆర్.. యాదగిరిగుట్టపై వరాలజల్లు కురిపించారు. రెండువేల ఎకరాల్లో తిరుమల తిరుపతి తరహాలో ఉద్యానవనాలు, కళ్యాణమండపాలు, కాటేజిలు ఏర్పాటు చేస్తామన్నారు.
గుట్ట కింద చెరువులు, గుట్టలు కలిపి 400 ఎకరాల్లో అభయారణ్యం ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. యాదగిరిగుట్టలో వేద పాఠశాల ఏర్పాటు చేస్తామని, ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించేలా ఆనవాయితీ ఇకమీదట ఉంటుందని చెప్పారు. వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీరు ఏర్పాటుచేస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్లోని కార్పొరేట్ సంస్థలన్నీ యాదగిరిగుట్టను టీటీడీ తరహాలో అభివృద్ధి చేయాలని పిలుపునిస్తామని సీఎం కేసీఆర్ వివరించారు.