రేపు కారెక్కుతున్నా..
వికారాబాద్: గులాబీ దళంలో చేరే విషయంలో ఇన్ని రోజులూ ఊగిసలాటలో ఉన్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎట్టకేలకు స్పష్టతనిచ్చారు. నియోజవర్గ అభివృద్ధి కోసం తాను ఆదివారం టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సమక్షంలో ఆదివారం కారు ఎక్కుతున్నట్లు తెలిపారు.
తన కంటే ముందు టీఆర్ఎస్లో ఎంతమంది నాయకులున్నప్పటికీ పార్టీలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో కేసీఆర్‌కు తెలుసని ఆయన చెప్పారు. చేవెళ్ల నియోజవర్గం నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారందరినీ కలుపుకొని వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. భవిష్యత్‌లో తనకు కేసీఆర్ ఎలాంటి కార్యక్రమాలను అప్పగించినా బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని యాదయ్య స్పష్టంచేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ కృషి అమోఘమైనదని తెలిపారు. ఆయన కృషి పలితంగానే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బంగారు తెలంగాణ సాధ్యమని.. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళుతున్నట్లు ఆయన కొనియాడారు. చేవెళ్ల నియోజవర్గంలో కారును స్పీడ్‌గా ముందుకు తోలుతానని తెలిపారు. తన అనుచరులు, నాయకులతో సంప్రదింపులు జరిపానని, అన్నీ ఆలోచించిన తర్వాతే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు యాదయ్య తెలిపారు. కేవలం చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొనే తాను కారెక్కుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు.