ఐదు నెలల్లో పది లక్షల హోండా యాక్టివా అమ్మకాలు
నంబర్ వన్ టూవీలర్గా హ్యాట్రిక్
ముంబై: హోండా యాక్టివా స్కూటర్లు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 10 లక్షలు అమ్ముడయ్యాయి. దీంతో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టూ-వీలర్‌గా యాక్టివా నిలిచిందని హోండా మోటార్‌సైకిల్ అండ స్కూటర్ ఇండియా తెలిపింది. కొన్ని నెలలుగా టూవీలర్ల మార్కెట్లో అమ్మకాలు క్షీణిస్తూ వస్తున్నప్పటికీ, ఈ స్థాయి అమ్మకాలు సాధించామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ సింగ్ గులేరియా చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు కాలానికి 10,01,350 యాక్టివాలను విక్రయించామని పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం విక్రయాలతో పోల్చితే 20 శాతం వృద్ధి సాధించామని వివరించారు. పండుగ సీజన్ ఇలాంటి జోష్‌తో ఆరంభమైనందుకు ఆనందంగా ఉందని కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కీత మురమత్సు చెప్పారు. వరుసగా మూడు నెలల పాటు అత్యధికంగా అమ్ముడైన టూవీలర్గా యాక్టివా హ్యాట్రిక్ కొట్టిందని తెలిపారు. భారత్‌లో విక్రయమవుతున్న టూవీలర్లలో మూడోవంతు స్కూటర్లదే. ఈ స్కూటర్ల మార్కెట్లో హోండా మార్కెట్ వాటా 59 శాతంగా ఉండగా, ఒక్క యాక్టివా బ్రాండ్ స్కూటర్ల వాటానే 51 శాతంగా ఉంది. మొత్తం టూవీలర్ల మార్కెట్లో హోండా మార్కెట్ వాటా 27 శాతమని అంచనా.