వ్యాగన్ల నుంచి హైస్పీడ్ పెట్రోల్ లీక్
యలమంచిలి స్టేషన్లో తీవ్ర ఉత్కంఠ
ప్రమాదకరమైనా స్పందించని రైల్వే సిబ్బంది!
యలమంచిలి : లీక్... అదేమాత్రంలే అన్న నిర్లక్షమో లేదా ఏమరుపాటో చాలు... పెను ప్రమాదం సృష్టించడానికి! ఈ విషయం రైల్వే శాఖ సిబ్బందికి తెలియనిది కానేకాదు. అయినా బాధ్యతల నిర్వహణలో అదే నిర్లక్ష్యం.. అదే ఏమరుపాటు! ఈ విషయం సోమవారం మరోసారి తేటతెల్లమైంది... యలమంచిలి ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది. అత్యంత సున్నితమైన (స్వల్ప ఉష్ణోగత్ర వద్ద కూడా అత్యధికంగా మండే లక్షణం ఉన్న) హైస్పీడ్ పెట్రోల్, డీజిల్ లోడుతో 52 వ్యాగన్ల గూడ్స్ రైలు విశాఖపట్నం నుంచి విజయవాడ బయల్దేరింది.
అయితే ట్రాక్ రద్దీ కారణంగా సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో జిల్లాలోని యలమంచిలి రైల్వేస్టేషన్లో నిలిచిపోయింది. ఆ రైలులో ఎనిమిది వ్యాగన్ల నుంచి బొట్లుబొట్లుగా హైస్పీడ్ పెట్రోల్, డీజిల్ లీక్ అవుతుండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందారు. ఈ విషయం తెలిసీ పలువురు గుమిగూడారు.
కొందరు సాహసం చేసి నేలపాలవుతున్న ఇంధనాన్ని పట్టుకునేందుకు బకెట్లు, బాటిళ్లు పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు రైలు కదిలేవరకు ఈ లీక్ కొనసాగుతున్నా రైల్వే సిబ్బంది అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఒకవేళ ప్రమాదవశాత్తూ వ్యాగన్లకు నిప్పు అంటుకుంటే పెను విస్ఫోటనం జరిగేదని, కనీసం రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రాణ, ఆస్తినష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.