yallanur
-
మా ఇష్టం వచ్చినట్లు ఓట్లు వేసుకుంటాం..
సాక్షి, యల్లనూరు: ‘మీరు ఎందుకు వచ్చారు ఓటు వేయడానికి..? అంతా మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం.. అన్నీ మేమే (ఓట్లు) వేసుకుంటాం’ అంటూ టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. యల్లనూరు మండలం జంగంపల్లిలో ఓటు వేయడానికి తమ వారితో కలిసి వెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులను టీడీపీ ఏజెంటు ఈవీఎంల వద్దకు తీసుకెళ్లి సైకిల్ గుర్తుకు వేయించాడు. వైఎస్సార్సీపీ ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతే రెచ్చి పోయిన టీడీపీ ఏజెంట్, కార్యకర్తలు దుర్భాషలాడారు. ఇంతలో ఓటు వేయడానికి వచ్చిన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త సంజన్న కూడా విషయం తెలుసుకుని టీడీపీ వారి తీరును తప్పుపట్టారు. మా ఇష్టం వచ్చినట్లు వేసుకుంటాం అంటూ సంజన్పపై దాడిచేశారు. పోలింగ్ కేంద్రం బయట ఉన్న సంజన్న భార్య, మాజీ సర్పంచ్ వకీదతో పాటు మరొక వైఎస్సార్సీపీ కార్యకర్తపైనా దాడి చేసి గాయపరిచారు. సమాచారం తెలియగానే జెడ్పీటీసీ కొత్తమిద్దె వెంకటరమణ, ఎంపీటీసీ బోగాతి ప్రతాప్‌రెడ్డి జంగంపల్లికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కొత్తమిద్దె వెంకటరమణ, బోగాతి ప్రతాప్‌రెడ్డిలు గ్రామంలోకి వచ్చారన్న విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కట్టెలు, రాళ్లు తీసుకుని మరోసారి దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక్క రోజు ఆగండి.. జంగంపల్లిలో జరిగిన ఘర్షణ గురించి తెలుసుకున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గ్రామానికి చేరుకుని టీడీపీ కార్యకర్తలను కలుసుకున్నారు. ఎంపీతో పాటు టీడీపీ చోటా నాయకులు మాట్లాడుతూ ‘మీరు ఒక్క రోజు ఆగండి.... మర్నాడు వైఎస్సార్సీపీ వాళ్ల కథ ఏందో చూద్దాం’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
భర్తను కడతేర్చిన భార్య
సాక్షి, యల్లనూరు: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్యచేయించిన భార్య ఉదంతం యల్లనూరు మండల కేంద్రంలో వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు... యల్లనూరుకు చెందిన డి.చిన్న ఆంజనేయులు (38) భార్య రాజేశ్వరి, ఇద్దరు కూతుర్లతో కలిసి నివాసముంటున్నాడు. చిన్న ఆంజనేయులు లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రాజేశ్వరి ఆశావర్కర్‌గా విధులు నిర్వహిస్తోంది. రాజేశ్వరి కొంత కాలంగా తాడిపత్రి ప్రాంతానికి చెందిన వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. పథకం ప్రకారం హత్య అడ్డుగా ఉన్న భర్తను హతమార్చడం కోసం రాజేశ్వరి తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ అమలు చేసింది. గత శుక్రవారం రోజున చిన్న ఆంజనేయులు, రాజేశ్వరి ప్రియుడు మద్యం తాగారు. రాజేశ్వరి సూచనల ప్రకారం చిన్న ఆంజనేయులును హత్య చేసి, శవాన్ని గోనె సంచుల్లో కట్టి సమీపంలోని చెరువు వద్ద గల చింత వనంలో పడేసి వెళ్లారు. భర్తను వెతుకుతున్నట్లు నటించి.. భర్తను హత్య చేయించిన రాజేశ్వరి ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. శుక్రవారం సాయంత్రం రూ.500 కావాలంటూ భర్త తనతో గొడవపడ్డాడని, డబ్బు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని కోపంగా చెప్పి వెళ్లిపోయాడని సమీప బంధులకు చెప్పింది. అనంతరం అక్కడా, ఇక్కడా వెతకడంతో పాటు పలువురు స్వామీజీల వద్దకు వెళ్లింది. అయితే స్వామీజీల వద్దకు వెళ్లినప్పుడు నీ భర్త ఊరికి తూర్పు భాగాన వేరొక ఊరికి వెళ్లే దారిలో కుడి పక్క ఉన్నట్లు చెప్పడంతో ఆ మేరకు వెతుకుతుండగా చింత వనంలో భర్త శవమై కనిపించాడని, దీంతో గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. రాజేశ్వరిపై బంధువుల ఫిర్యాదు చిన్న ఆంజనేయులు హత్యకు గురయ్యాడని తెలుసుకున్న అతని సమీప బంధువులు సోమవారం యల్లనూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి చిన్న ఆంజనేయులు భార్య రాజేశ్వరిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చిన్న ఆంజనేయులు హత్యకు గల కారణం వివాహేతర సంబంధమేమని, భార్యే అతడి హత్యకు ప్లాన్ వేసిందని పోలీసుల విచారణలో తేలింది. హత్య చేసిన నిందితులు, వారికి సహకరించిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
జల జగడం
- కృష్ణా జలాలను తరలించేందుకు వైఎస్సాఆర్ కడప జిల్లా రైతుల యత్నం - అడ్డుకున్న యల్లనూరు రైతులు యల్లనూరు : నీటి కోసం అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల రైతుల మధ్య వివాదం రాజుకుంది. గండికోట ఎత్తి పోతల పథకం నుంచి యల్లనూరు, గడ్డంవారిపల్లి చెరువుల ద్వారా గోడ్డుమర్రి ఆనకట్ట మీదుగా కృష్ణా జలాలను పార్నపల్లి రిజర్వాయర్‌కు పంపింగ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలను యల్లనూరు, గడ్డంవారిపల్లి చెరువులకు పంపింగ్ చేస్తున్నారు. అయితే గోడ్డుమర్రి ఆనకట్ట పనులతో పాటు పంప్ హౌస్ పనులు అసంపూర్తిగా ఉండటంతో నీటిని గడ్డంవారిపల్లి చెరువు నుంచి చిత్రావతి నదికి మళ్లించారు. అయితే వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలంలోని రామిరెడ్డిపల్లి, బురుజుపల్లి, ఏటూరు గ్రామల రైతులు తమ గ్రామాలకు సమీపంలో ఉన్న చిత్రావతి నదిలోకి నీటిని మళ్లించుకునేందుకు సోమవారం రాత్రి ప్రయత్నించారు. యల్లనూరు చెరువు తూముకు అడ్డుగా ఇసుక మూటలను వేయడంపై వివాదం చెలరేగింది. నీటిని మళ్లించడం కోసం ప్రయత్నించారని తెలుసుకున్న యల్లనూరు రైతులు మంగళవారం ఉదయం ఇసుక మూటలను తొలగించారు. అధికారులు తమకు హామీ ఇచ్చారంటూ రామిరెడ్డిపల్లి, బురుజుపల్లి, ఏటూరు గ్రామాల రైతులు పోలీసుల సహకారంతో మరోమారు యల్లనూరు చెరువు వద్ద నీటిని వెళ్ళకుండా అడ్డుకట్ట వేయాలని మంగళవారం ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న యల్లనూరు మండల ప్రజలు చెరువు వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో తాడిపత్రి రూరల్ సీఐ సురేంద్రనా«ధ్‌రెడ్డి, డీఈ ఆనందరావు అక్కడి చెరుకోని యల్లనూరు మండల రైతులతో చర్చించారు. ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. -
తేలికపాటి వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పగలు తేలికపాటి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యల్లనూరులో 22 మి.మీ, పుట్లూరు 19 మి.మీ, బొమ్మనహాల్ 13 మి.మీ, అనంతపురం 12 మి.మీ, అగళి 12 మి.మీ, ఆత్మకూరు 10 మి.మీ వర్షపాతం కురిసింది. తాడిమర్రి, రాప్తాడు, కూడేరు, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, తనకల్లు, ఉరవకొండ, గాండ్లపెంట, కనగానపల్లి, కనేకల్లు, గుత్తి, వజ్రకరూరు, ఓడీ చెరువు, రొద్దం, శింగనమల, గార్లదిన్నె, ముదిగుబ్బ తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది.