గ్యాస్ట్రో కౌన్సెలింగ్
నాకు చాలారోజులుగా ఛాతీలో మంటగా ఉంటోంది. దగ్గర్లోని మెడికల్ షాప్లో యాంటాసిడ్ జెల్ కొని తాగుతున్నాను. తాగినంతసేపు మంట తగ్గుతోంది. ఆ తర్వాత యధావిధిగా వస్తోంది. దీన్ని తగ్గించుకోడానికి తగిన సూచనలు ఇవ్వగలరు.
- రాజశేఖర్, ఆదిలాబాద్
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నట్లు అర్థమవుతోంది. వీలైతే మీరొకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవడం మంచిది. మీరడిగినట్లు జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా మీ వ్యాధి లక్షణాల తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంది. మీరు పాటించాల్సిన సూచనలలో ముఖ్యమైనవి... ఆహారంలో కొవ్వు పదార్థాలను తగ్గించడం; కాఫీ, టీలను మానివేయడం పొగతాగే అలవాటునూ, ఆల్కహాల్లను పూర్తిగా మానివేయడం తిన్న వెంటనే పడుకోకుండా ఉండటం పడకలో తలవైపున కాస్త ఎత్తుగా ఉండేలా తలగడ ఉంచుకోవడం పై సూచనలతో పాటిస్తూనే ఒకసారి మీరు ఒకసారి డాక్టర్ను సంప్రదించి హెచ్2 బ్లాకర్స్, పీపీఐ అనే మందులను వాడటం మంచిది.
డాక్టర్ భవానీ ప్రసాద్ రాజు,
కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్