ఖాకీల అత్యుత్సాహం
కొళాయి ఏర్పాటు విషయంలో గొడవ..
18న కోర్టుకు హాజరైన నిందితులు.. రిమాండ్‌కు ఆదేశం
విచారణ పేరుతో రెండురోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు
మంత్రి మెప్పు కోసమే కస్టడీకి అంటున్న నిందితుల బంధువులు
రాయదుర్గం: కణేకల్లు మండలంలో పట్టపగలే సర్పంచ్ హత్య జరిగినా, రాయదుర్గం పట్టణంలో చోరీలు పెరుగుతున్నా, లారీలకు లారీలు ఇసుక తరలిపోతున్నా పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు. చిన్నపాటి గొడవలకు పాల్పడి రిమాండ్‌లో ఉన్న వారిపై మాత్రం విచారణ పేరుతో పోలీస్ కస్టడీకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించి, భయాందోళనకు గురిచేస్తూ వివాదాస్పదమవుతున్నారు. వివరాల్లోకెళితే.. కణేకల్లు మండలం యర్రగుంట గ్రామంలో జూలై 7న తాగునీటి కుళాయి ఏర్పాటు విషయంలో ఇరువర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. ఇందులో ఒక వర్గానికి చెందిన వ్యక్తికి కాలు విరిగిపోగా, మరో వర్గానికి చెందిన వ్యక్తికి తలకు గాయమై ఆరు కుట్లు పడ్డాయి. ఇంటివద్దకు వచ్చి గొడవకు దిగారని ఈ దాడిలో తమ తండ్రి చంద్రమౌళిరెడ్డి కాలువిరిగిపోయిందని వైఎస్సార్సీపీకి చెందిన శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్‌రెడ్డిలు కణేకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇందుకు కౌంటర్‌గా.. హత్యాయత్నం చేశారని వన్నారెడ్డి తదితరులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో భయపడిపోయిన శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్‌రెడ్డిలు పరారయ్యారు. ఆ సమయంలో నియోజకవర్గంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బాధితుల బంధువులను విచారణ పేరుతో పట్టుకువచ్చి స్టేషన్లు మార్చిమార్చి వేధించారు. చివరకు ఆగస్టు 18న నిందితులు కళ్యాణదుర్గం కోర్టుకు హాజరు కాగా.. వీరికి జడ్జి రిమాండ్ విధించారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాయదుర్గం జడ్జికి అప్పీలు చేసి విచారణ పేరుతో ఆ ఇద్దరు యువకుల(శ్రీనివాసరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి)ను రెండురోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకోవడంపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జడ్జి రిమాండ్‌కు ఆదేశించిన తరువాత కూడా విచారణ అంటూ పోలీసులు తీసుకురావడం చిత్రహింసలకు గురిచేయడానికే అంటూ వాపోతున్నారు. మంత్రి వద్ద మెప్పు పొందడం కోసమే తమను భయబ్రాంతులకు గురిచేయడానికి పోలీసులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కణేకల్లు ఎస్ఐ యువరాజును వివరణ కోరగా రాయదుర్గం జడ్జికి అప్పీలు చేసి విచారణ నిమిత్తం రెండురోజులు కస్టడీకి తీసుకున్నది వాస్తవమేనన్నారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని జడ్జి ఆదేశించారన్నారు. విచారణకు ముందు కణేకల్లు ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించి స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు వివరించారు.