ప్రపంచంలోనే సీనియర్ ఆఫీస్ మేనేజర్
ఈ మే 15 కి యసూకో తమాకీ 91 లోకి ప్రవేశిస్తున్నారు. పుట్టిన రోజు అని ఆమె సెలవు పెడితే తప్ప, ఆరోజూ ఆమె ఆఫీస్‌కు వెళతారు. అయితే ఆ రోజు శనివారం వచ్చింది. తర్వాత ఆదివారం. పక్కపక్కన రెండు సెలవు రోజులు. ఒకవేళ ఆమె పుట్టిన రోజు ఆ రెండు రోజుల్లో కాకుండా తక్కిన ఐదు పని దినాల్లో ఏ రోజు వచ్చినా ఆమె సెలవు పెట్టి ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటారని నమ్మకంగా అనుకోలేం. బహుశా ఆమె ఆఫీస్‌కు వెళ్లేందుకు మొగ్గుచూపడానికే అవకాశం ఎక్కువ! అరవై ఐదేళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నారు యసూకో! అప్పట్నుంచీ ఆమె ఆఫీస్ మేనేజరే.
అత్యవసరం అయితే తప్ప ఏ రోజూ సెలవు తీసుకోలేదు. వారానికి ఐదురోజులు, రోజుకు ఏడున్నర గంటలు షిఫ్టులో మిగతా సిబ్బందిలా పని చేస్తూనే వస్తున్నారు. ఈ తొంభై ఏళ్ల వయసులోనూ ఆమె అలసిపోలేదు. అలసట లేకుండా ఉండటానికి ఉద్యోగం ఆమెకు ఇష్టమైన వ్యాపకం కావచ్చు. ‘వరల్డ్ ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్’ అని ఏప్రిల్ 8న గిన్నెస్ ఆమెను కీర్తించింది. ఆమె చేతికి ‘రికార్డు’ పత్రాన్ని అందించింది.
1930లో జన్మించారు యసూకో. 1956లో ఒసాకాలోని ‘సన్‌కో ఇండస్ట్రీస్’ అనే ఒక ట్రేడింగ్ కంపెనీలో చేరారు. స్క్రూలను తయారు చేయడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సన్‌కో.. మిగతా లోహపు మెటీరియల్స్ కూడా ఉత్పత్తి చేస్తుంటుంది. ఆ సంస్థలో అటుఇటుగా ఇరవై ఐదేళ్ల వయసులో ఆఫీస్ మేనేజర్ గా చేరారు. నాటి నుంచి అరవై ఐదేళ్లుగా అదే హోదాలో కొనసాగుతున్నారు. ఆఫీస్ అకౌంట్స్ చూడ్డం ఆమె ప్రధాన విధి. సిబ్బంది జీతాలు, బోనస్‌లు, పన్ను లెక్కలు అందులో భాగం. ఇప్పుడైతే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌తో లెక్కలన్నీ చక్కబెడుతున్నారు కానీ, మొదట్లో అన్నీ కాగితాల మీదే చకచకా! ఇప్పుడు ఫేస్బుక్, స్మార్ట్‌ఫోన్ కూడా ఉపయోగిస్తున్నారు.
గిన్నిస్ గుర్తింపు పత్రంతో యసూకో తమాకీ, ‘సీనియర్’ ఆఫీస్ మేనేజర్
వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో ఓపిక తగ్గి పని మీద ఉత్సాహం నశించే అవకాశం ఉంది. అయితే యసూకో శక్తి ఆమె పనే! ‘‘పని చేస్తున్నంత సేపూ నాకు ఉత్సాహంగా ఉండటం మాత్రమే కాదు, కొత్త ఉత్సాహం ఏదో నాలో జమ అవుతుంటుంది’’ అని నవ్వుతూ అంటారు యసూకో. అందుకే ఆమె రిౖటెర్మైంట్ తీసుకోలేదు. వాళ్లూ ఇవ్వలేదు. సన్కోలోని మిగతా ఉద్దండ ఆఫీస్ మేనేజర్లంతా ఆమె ఇచ్చిన తర్ఫీదుతో ఉద్యోగంలో నిలబడినవారే! అకౌంట్స్‌కి కొత్తగా ఎవరైనా వచ్చి చేరారంటే.. మొదట ఆమె ఆశీర్వాదం తీసుకోవలసిందే. అప్పుడు ఆమె ఒకటే మాట చెబుతారు. ‘‘సంస్థ కోసం నమ్మకంగా పని చేయండి. సంస్థ మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోదు’’ అని.
ఆ మాట ఆమె చెబితే ఎవరైనా వినకుండా ఉంటారా! గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకుంటున్నప్పుడు ఆమె తన ఆఫీస్ పట్ల కృతజ్ఞతను వ్యక్తం చూస్తూ.. ‘‘సంస్థ నా నుంచి ఏమైతే ఆశించిందో అదే చేస్తూ వచ్చాను. అదేమీ విశేషం కాదు కదా’’ అన్నారు. ‘‘ఇన్నేళ్లుగా మీరెలా చేయగలుగుతున్నారు’’ అని గిన్నెస్ ప్రతిధిని ఒకరు ఆమెను అడిగారు. ‘‘ఇతరులకు చేదోడుగా ఉండటం అనేది నా స్వభావం. ఆఫీస్లోనైతే చైర్మన్‌కి, ఇతర మేనేజర్లకు, సహోద్యోగులకు సహాయంగా ఉండటంలోని ఆనందమే నన్ను ఇన్నేళ్లుగా ఆఫీస్‌వైపు నడిపిస్తోందనే అనుకుంటున్నాను’’ అని సమాధానమిచ్చారు యసూకో. ‘‘నేనసలు రిటైర్మైంట్ ఉంటుందన్న ఆలోచననే ఏనాడూ తెచ్చుకోను. సంవత్సరం తర్వాత సంవత్సరం గడిచిపోతాయి. వాటితోపాటే నేనూ నడుస్తుంటాను. నన్ను నడిపిస్తున్నది నా ఆఫీస్’’ అని కూడా అన్నారు యసూకో.