భార్యకు పూల వనాన్నే ఇచ్చాడు...
టోక్యో: పుట్టిన రోజునాడో, వాలెంటైన్ రోజునాడో ప్రపంచంలో ఏ భర్త అయినా పూల బొకే ఇచ్చి భార్యకు గ్రీటింగ్స్ చెబుతారు. జపాన్‌కు చెందిన ఓ భర్త మాత్రం తన భార్యకు పూల వనాన్నే సృష్టించి ఇచ్చారు. అందుకోసం దాదాపు దశాబ్దకాలం పాటు నిర్విరామంగా కృషి చేశారు. భార్యాభర్తల ప్రేమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని నిరూపిస్తున్నారు.
మియాజకి ప్రాంతంలోని షింటోని పట్టణానికి చెందిన తోషియుకి, ఆయన భార్య యాసుకో డెయిరీ ఫారమ్ నిర్వహిస్తూ ప్రేమైక జీవనం సాగిస్తూ వస్తున్నారు. వారి పెళ్లైన 30వ ఏట మధుమేహం వ్యాధి వల్ల భార్య యాసుకోకు రెండు కళ్లు పోయి గుడ్డిదైంది. దాంతో ఆమె డిప్రెషన్‌లో కూరుకుపోయింది. అటు ఇద్దరు చిన్న పిల్లల ఆలనాపాలనా చూస్తూ, డెయిరీ ఫారమ్ నిర్వహిస్తూ భార్యను ఎలా చూసుకోవాలో, ఆమెను ఎలా ఊరడించాలో తెలియక తల్లడిల్లి పోయారు.
ఇంటిబయట ల్యాండ్ స్కేప్‌లా ఉన్న స్థలంలో వేసిన కొద్దిపాటి షిబాజకురా (కార్పెట్‌లా పెరిగే గులాబీ పూలు) పూలను దారంటూ పోయేవారు ఆసక్తి చూడడం తోషియుకి గమనించారు. అంతే మనసులో ఓ ఆలోచన తళుక్కుమంది. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలమంతా ఇదే పూలతో నింపేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చని, అలా వచ్చే వారితో మాటా ముచ్చట కలిపితే తన భార్య డిప్రెషన్ పోవచ్చని, ఒంటరితనం దూరమవుతుందని భావించారు. అంతే ఇక కార్యరంగంలోకి దిగారు. అప్పటికే తన వద్దనున్న 70 ఆవులను కొన్ని కొన్ని చొప్పున అమ్మేస్తూ వచ్చారు. అలా వచ్చిన సొమ్ముతో పూల వనాన్ని విస్తరిస్తూ వచ్చారు.
అలా వనం విస్తరిస్తూ వచ్చింది. ఊహించినట్లుగానే వనం అందాలను తిలకించేందుకు, అక్కడ కాసేపు విశ్రమించేందుకు, గులాబీ పూల ల్యాండ్ స్కేప్ వద్ద ఫొటోలను దిగేందుకు పర్యాటకులు రావడం ప్రారంభించారు. అలా వచ్చిన వారందరూ భార్యతో మాట మంతి కలపడం, కుశల ప్రశ్నలు వేస్తుండడంతో భార్య డిప్రెషన్ పూర్తిగా ఎగిరిపోయింది. ఒంటరితనం దూరమైంది. తోసియుకి కూడా ద్విగుణీకృత ఉత్సాహంతో తోటను మరింద అందంగా తీర్చుదిద్దుతూ వస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో కూలివాళ్లను పెట్టుకోకుండా ఒంటరిగా శ్రమిస్తూ వస్తున్నారు. వారి పెళ్లై 60 వసంతాలు ఇటీవలనే పూర్తయ్యాయట. ముదిమి వయస్సులో కూడా తోషియుకి ఉత్సాహంగా ఎప్పటికప్పుడు కలుపు ఏరేయడం లాంటి పనులు చేస్తున్నారు.
ఈ వయస్సులో కూడా భార్యాభర్తలు ఉల్లాసంగా జీవించడాన్ని చూసి పర్యాటకులు ముచ్చటపడుతున్నారు. ఖాళీ అయిన ఆవుల కొట్టాన్ని భార్యాభర్తలు తోట మధ్యన కాలక్రమంలో దిగిన ఫొటోలతో గ్యాలరీగా మార్చి వేశారు. వాటిని చూసిన పర్యాటకులు వారి మధ్యనున్న దాంపత్య సాన్నిహిత్యానికి అబ్బురపడుతున్నారు. ఏడాదికి కనీసంగా ఏడువేల మంది పర్యాటకులు ఆ తోటను సందర్శిస్తున్నారట. మార్చి, ఏప్రిల్ నెలల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందట. ప్రవేశం కూడా ఉచితం.