సెక్షన్-8 వద్దంటూ ఆందోళన
సనత్ నగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు శాంతిభద్రతల విషయంలో ఎలాంటి సమస్య తలెత్తలేదని, అలాంటప్పుడు సెక్షన్-8ను ఎందుకు తెరమీదకు తీసుకు వస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. 'సెక్షన్-8 మాకొద్దు' అంటూ ప్లకార్డులు చేతబూని సనత్నగర్లో బుధవారం టీఆర్ఎస్ నేత వై.బాలరాజ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసు ఉదంతాన్ని పక్కదోవ పట్టించడానికి చేస్తున్న కుట్రలో భాగంగానే సెక్షన్-8 జపం చేస్తున్నారని విమర్శించారు.
సీమాంధ్రులు, మిగతా ప్రాంతాల వారనే తేడా లేకుండా అందరి సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న భద్రతా చర్యలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజలు సెటిలర్స్తో ఎంతో సఖ్యతగా ఉంటారనడానికి సనత్నగర్ ఒక ఉదాహరణ అన్నారు. ఇరు ప్రాంతాల మధ్య తారతమ్యం అనేది రాకుండా సెటిలర్స్ కూడా తాము ఇక్కడ వారమే అనే భావనను వారిలో తీసుకువచ్చి వారికి కావాల్సిన వసతులను కల్పించడంలో ముందువరుసలో ఉన్నారని తెలిపారు.