స్పీకర్ కోడెలకు సత్కారం
స్పీకర్ కోడెల శివప్రసాదరావును జ్ఞాపికతో సత్కరిస్తున్న మండలిచైర్మన్ చక్రపాణి తదితరులు
* ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న శివప్రసాదరావు
* అసెంబ్లీ కమిటీలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తై సందర్భంగా ఆయన్ను సోమవారం పలువురు అభినందించారు. శాసనసభ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె. సత్యనారాయణ నేతృత్వంలో అసెంబ్లీ సిబ్బంది శాసనసభ ఆవరణలో ఈ సందర్భంగా సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ ఎ. చక్రపాణి, వైస్ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి, శాసనమండలి ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్ తదితరులు కోడెలను అభినందించారు. చట్టసభ నిర్వహణకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తనకు అభినందనలు తెలిపిన వారికి స్పీకర్ కోడెల కృతజ్ఞతలు తెలిపారు.
కమిటీల సూచనలు విలువైనవి
శాసనసభ కమిటీలు చేసే సూచనలు విలువైనవని శాసనసభాపతి కోడెల అన్నారు. సోమవారం ఆయన నైతిక విలువలు, పిటీషన్స్, మెనారిటీ సంక్షేమంపై నియమించిన శాసనసభ కమిటీలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్లు మండలి బుద్ధప్రసాద్, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఎథిక్స్ కమిటీకి సీనియర్ శాసనసభ్యుడు పతివాడ నారాయణ స్వామినాయుడును చైర్మన్‌గా నియమించారు.
ఆయన అందుకు సమ్మతించలేదు. దీంతో చైర్మన్‌గా ఉపసభాపతి మండ లి బుద్ధప్రసాద్‌ను నియమించారు. పిటీషన్స్ కమిటీ ఛైర్మన్‌గా కూడా ఆయనే వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అసెంబ్లీ కమిటీలు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలన్నారు.
నేడు నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా గెలిచిన టీడీపీ ఎమ్మెల్సీలు నలుగురు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైవీబీ రాజేంద్రప్రసాద్ (కృష్ణా), రెడ్డి సుబ్రహ్మణ్యం (తూర్పు గోదావరి), అన్నం సతీష్ ప్రభాకర్ (గుంటూరు), ద్వారపురెడ్డి జగదీష్ (విజయనగరం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.